ఈ నెల 30వ తేదీలోగా ప్రీ–టెస్ట్ జనగణన

హైదరాబాద్ (జనంసాక్షి) : ఈ నెల 30వ తేదీలోగా ప్రీ–టెస్ట్ జనగణన – 2027 పూర్తి చేయాలనీ రాష్ట్ర జనగణన సంచాలకురాలు భారతి హోలికేరి అధికారులకు సూచించారు. బుధవారం రామచంద్రపురం (వార్డు నెం.112) ప్రాంతాన్ని సందర్శించి ప్రీ–టెస్ట్ జనగణన –2027 జరుగుతున్న తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె హౌస్‌లిస్టింగ్, ఫీల్డ్ వెరిఫికేషన్ పురోగతిని తెలుసుకుని ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లతో మాట్లాడారు. డేటా సేకరణలో అనుసరిస్తున్న విధానాలు, క్షేత్ర స్థాయిలో జనగణన జరుగుతున్న తీరును సమీక్షించారు. ఈ నెల 30వ తేదీలోగా అన్ని పనులను మార్గదర్శకాల మేరకు ఖచ్చితత్వంతో, తప్పులేకుండా పూర్తిచేయాలని ఆమె అధికారులకు సూచించారు. జనగణన 2027కు ముందు చేపట్టే ఈ ప్రీ–టెస్ట్ ప్రక్రియ భవిష్యత్ వ్యూహాల, ప్రణాళికల రూపకల్పనకు అత్యంత కీలకమని, సమగ్రతతో కూడిన నాణ్యమైన డేటా సేకరణకు ఇది పునాదిగా నిలుస్తుందని ఆమె తెలిపారు. క్షేత్ర పరిశీలనలో సమాచాలకుల వెంట జీహెచ్ఎంసీ రామచంద్రపురం డిప్యూటీ కమిషనర్, ఛార్జ్ ఆఫీసర్ సురేష్, జనగణన శాఖ డిప్యూటీ డైరెక్టర్ వి. శ్రీకాంత్ ఉన్నారు.