సురక్షిత నగరంగా హైదరాబాద్
అనుక్షణం నిఘా.. అప్రమత్తత
ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్, జూలై 9 (జనంసాక్షి) :
హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. నగరాన్ని సేఫ్ అండ్ స్మార్ట్ సిటీగా చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. ‘స్మార్ట్ అండ్ సేఫ్ సిటీ’ అనే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కార్యక్రమం రూపొందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. జీఎంఆర్ ప్రతినిధుల బృందం ఈ అంశంపై ముఖ్యమంత్రికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. లండన్ పోలీస్ ఉన్నతాధికారి, మహారాష్ట్ర మాజీ డీజీపీ శివానందం ఈ సమావేశంలో పాల్గొన్నారు. నగరంలో అనుక్షణం నిఘా ఉంటుందని, పోలీసు వ్యవస్థ అత్యంత అప్రమత్తతో వ్యవహరిస్తుందని తెలిపారు. నగరాన్ని విశ్వశ్రేణి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఇక్కడ భద్రతపై ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలో పెట్టుబడులకు వివిధ దేశాలకు చెందిన అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయని, ఐటీఐఆర్ వల్ల నగరం మరింత అభివృద్ధి చెందుతుందని ఇక్కడికి వచ్చే కంపెనీలకు భద్రతపై నమ్మకం కల్పించాలని అన్నారు. హైదరాబాద్ పోలీసింగ్‌ను న్యూయార్క్ తరహాలో అభివృద్ధి చేయబోతున్నామని మరో నెల రోజుల్లో ఇది అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. అంతకుముందు సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిపారుదల శాఖపై సమీక్ష ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతోపాటు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.