విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు రెడ్ కార్పెట్
– కీలకమైన రక్షణ, ఇన్సూరెన్స్ రంగాల్లో ఎఫ్‌డీఐలు
– ఆంధ్రకు పెద్దపీట.. తెలంగాణకు మొండి చేయి
– ఊరించి ఉసురుమనిపించిన జైట్లీ బడ్జెట్
న్యూఢిల్లీ, జూలై 10 (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం భారీ సంస్కరణలకు పెద్దపీట వేసింది. నిధుల సమీకరణకు ఎఫ్‌డీఐలకు తలుపులు బార్లా తెరిచింది. కీలకమైన రక్షణ, ఇన్సూరెన్స్ వంటి రంగాల్లో ఎఫ్‌డీలపై ఉన్న పరిమితిని పెంచింది. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించేందుకు అంగీకరించింది. విద్యుత్, ఉన్నత విద్య, వ్యవసాయం, మౌళిక వసతులకు బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2014-15 సంవత్సరానికి గాను రూ.17.94 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. వ్యవసాయం, విద్యుత్, విద్య, మౌళిక సదుపాయాలు, పరిశ్రమలకు పెద్ద పీట వేశారు. అయితే, బడుగు జీవికి ఆశించిన స్థాయిలో ఉపశమనం దక్కలేదు. వ్యక్తిగత పన్నుల మినహాయింపును రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు పెంచారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కఠిన నిర్ణయాలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. రాబోయే మూడు నాలుగేళ్లలో 7-8 శాతం వృద్ధి రేటు సాధించాలన్నదే తాజా బడ్జెట్ లక్ష్యమని చెప్పారు. 2015-16 నాటికి ద్రవ్యలోటును 3.6 శాతానికి తగ్గించాలన్నదే లక్ష్యమన్నారు. సమష్టిగా, సమగ్రాభివృద్ధికి అన్న నినాదంతో అందరం కలిసి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పాటుపడదామని పిలుపునిచ్చారు. వేగంగా నిర్ణయాలు తీసుకోకపోతే అవకాశాలు కోల్పోతామన్నారు. ద్రవ్యలోటు 3.6 శాతానికి తగ్గించడమే తమ లక్ష్యమని తెలిపారు. అందుకోసం విదేశీ పెట్టుబడులను మరింత ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. సంస్కరణలతోనే ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. కాగా ఎన్డీయే సర్కారు బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపింది. ఒకే ఒక్క హార్టికల్చర్ యూనివర్సిటీ కేటాయింపుతో చేతులు దులుపుకొంది. రూ.200 కోట్లతో తెలంగాణలో హార్టికల్చర్ యూనివర్సిటీ కేటాయించింది. ఐఐఎం, పసుపు పరిశోధనా కేంద్రం, వెటర్నరీ యూనివర్సిటీ వంటి హామీలను తుంగలో తొక్కింది. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పనున్న అగ్రికల్చర్ యూనివర్సిటీకి రూ.500 కోట్లు కేటాయించింది. విశాఖపట్నం-చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు పూర్తి చేస్తామన్నారు. కృష్ణాపట్నం ఇండస్ట్రీయల్ సిటీ పూర్తి చేసేందుకు అదనపు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోర్టు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. కాకినాడ కేంద్రంగా హార్డ్‌వేర్ ఉత్పత్తి రంగం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. నేషనల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీని అనంతపు హిందూపురంలో, హైదరాబాద్‌లలో డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
కఠిన నిర్ణయాలు తప్పవు: జైట్లీ
ప్రజలు మార్పు కోసం ఓటేశారన్న జైట్లీ.. దారిద్య రేఖ నుంచి బయటకు రావాలని పేదలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. నిరుద్యోగంతో ఇంకా తల్లిడిల్లాలని దేశం భావించడం లేదన్నారు. నిర్ణయాల్లో జాప్యం వల్ల అవకాశాలు కోల్పోయామని, ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదన్నారు. నిరుద్యోగిత, మౌళిక వసతుల లేమి, నిర్ణయాల్లో జాప్యం కారణంగా ఆర్థిక వ్యవస్థలో స్తబ్ధత నెలకొందని తెలిపారు. రానున్న కాలంలో ద్రవ్యోల్బణం తగ్గుతందుని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ బడ్జెట్ సమగ్ర కార్యాచరణ ప్రణాళకతో రూపొందిందన్న జైట్లీ ఈ బడ్జెట్ నుంచి అతిగా ఆశించవద్దు. ఈ బడ్జెట్ మనం ఆశించే ఆర్థిక స్థితికి మొదటి అడుగు మాత్రమేనని స్పష్టం చేశారు. అవసరాలకు భిన్నంగా వ్యయం చేయలేనని తెలిపారు. తయారీ మౌలిక సదుపాయాల రంగాలను వృద్ధిబాట పట్టించాల్సి ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది సబ్సిడీల వ్యవస్థీకరణపై దృష్టి సారిస్తామని చెప్పారు. వస్తు సేవల పన్నుపై చర్చకు ముగింపు పలకాలన్నారు. వ్యయ నిర్వహణ సంస్థను కేంద్రం నియంత్రిస్తుందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు నల్లధనం ప్రమాదకరంగా మారిందని, నల్లధనాన్ని వెనక్కి తెప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
ఎఫ్‌డీఐలకు పెద్దపీట..
ఒకప్పుడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను వ్యతిరేకించిన ఎన్డీయే సర్కారు ఇప్పుడు ఎఫ్‌డీఐలకు పెద్దపీట వేసింది. విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచింది. రక్షణ, ఇన్సూరెన్స్ రంగాల్లో ఎఫ్‌డీఐలపై ఉన్న పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకొంది. బీమారంగంలో ఎఫ్‌డీఐలు 26 శాతం ఉండగా, దానిని 49 శాతానికి పెంచింది. అలాగే, రక్షణ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పెంచనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రస్తుతం 26 శాతం ఉన్న ఎఫ్‌డీఐలను 49 శాతానికి పెంచనున్నట్లు జైట్లీ వెల్లడించారు. అలాగే, పట్టణీకరణ, స్మార్ట్ సిటీల రూపకల్పనలో విదేశీ పెట్టుబడులను అనుమతిస్తామని తెలిపారు. తయారీ, మౌళిక సదుపాయాల రంగాల్లోనూ ఎఫ్‌డీఐలకు అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు.
మూడేళ్లలో 7-8 వృద్ధిరేటు
గత రెండేళ్లుగా ఐదు శాతం కంటే తక్కువగా ఉన్న ఆర్థిక వృద్ధి రేటు ఈ ఏడాది 5.9 శాతంగా ఉండొచ్చని జైట్లీ తెలిపారు. అయితే, ప్రతికూల పరిస్థితులు వెంటాడుతున్నా.. రాబోయే మూడు నాలుగేళ్లలో 7-8 శాతం వృద్ధి రేటు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధిరేటు, సమ్మిళత అభివృద్ధే తమ ప్రధాన అజెండాగా పేర్కొన్నారు. ప్రపంచ వృద్ధిరేటు మందగమనంలో ఉందని.. ద్రవ్యోల్బణం, ప్రతికూల వాతావరణం వంటి కారణాల వల్ల మన ఆర్థిక వ్యవస్థ స్తబ్ధుగా ఉందన్నారు. అయినా, ఆశించిన వృద్ధి రేటు రేటు నమోదు చేస్తామని తెలిపారు.
కీలక రంగాలకు భారీగా నిధులు..
సామాజిక పథకాలకు కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలకు రూ.50 వేల కోట్లకు పైగా కేటాయించారు. అలాగే, గ్రామీణాభివృద్ధికి భారీగా నిధులు వెచ్చించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2.4 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. హస్తకళల పునరుద్ధరణకు రూ.30 కోట్లతో అకాడమీ ఏర్పాటు చేస్తామన్నారు. పురావస్తు కట్టడాల పరిరక్షణకు రూ.100 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. జాతీయ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తామని, అందులో అన్ని క్రీడలకు ప్రాధాన్యమిస్తామన్నారు. బెంగళూరు, ఫరీదాబాద్‌లో బయోటెక్ క్లస్టర్లు అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. పర్యాటక రంగానికి ప్రాధాన్యమిస్తామని తెలిపారు. ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా గయ నగరాన్ని తీర్చిదిద్దుతామన్నారు. అన్ని పర్యాటక, ఆధ్యాత్మిక నగరాలకు రవాణా, ఇతర మౌళిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. పర్యాటక రంగ ప్రోత్సాహానికి తొమ్మిది విమానాశ్రయాల్లో ఈ-వీసాలకు అనుమతి ఇస్తామన్నారు. అర్హులకే సబ్సిడీ అందేలా చూస్తామని జైట్లీ అన్నారు. డీజిల్, కిరోసిన్, వంటగ్యాస్ సబ్సిడీ నేరుగా లబ్ధిదారులకే లభించాలన్నారు. మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చడమే లక్ష్యమని తెలిపారు. త్వరలో కొత్త యూరియా పాలసీ ప్రకటిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యానికి రూ.500 కోట్లు, గ్రామాల్లో పరిపాలన మెరుగుకు రూ.100 కోట్లు, ధరల స్థిరీకరణ కోసం రూ.500 కోట్లు, రహదారుల కోసం రూ37,800 కోట్లు కేటాయించారు.
రాష్టాన్రికో ఎయిమ్స్..
దేశంలో నాలుగు కొత్త అఖిల భారత వైద్యవిద్య సంస్థలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఆంధ్ర, బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం రూ.500 కోట్ల కేటాయించింది. త్వరలోనే ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ తరహా వైద్యసంస్థల ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. అలాగే, 12 మెడికల్ కళాశాల స్థాపనకు అంగీకారం తెలిపారు. నూతనంగా 5 ఐఐటీ, 5 ఐఐఎంల స్థాపించనున్నట్లు తెలిపారు. గంగా నదిని ప్రక్షాళన చేస్తామని ఇందుకోసం రూ.2 వేల కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. గంగానదిలో జల రవాణా కోసం రూ.4 వేల కోట్లు వెచ్చిస్తామని చెప్పారు.. మహిలల రక్షణకు నిర్భయ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. బాలికల సాధికారత కోసం రూ. 100 కోట్లు కేటాయిస్తామని వివరించారు. అమరవీరుల స్మారకార్థం వార్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ఇందుకోసం రూ.100 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మావోయిస్టు ప్రాంతాల్లో బలగాల ఆధునికీకరణకు రూ.3 వేల కోట్లు కేటాయించామన్నారు.
———————————–
2014-15 బడ్జెట్ అంచనా ఇలా.. (రూ.లలో)
మొత్తం బడ్జెట్ 17.94 లక్షల కోట్లు
ప్రణాళిక వ్యయం రూ. 5.75 లక్షల కోట్లు
ప్రణాళికేతర వ్యయం రూ. 12.19 లక్షలకోట్లు
ద్రవ్యలోటు 4.8 శాతం
——————————-
ప్రధాన కేటాయింపులు ఇలా..
గ్రామీణ రహదారుల అభివృద్ధి రూ.14,839 కోట్లు
స్మార్ట్ సిటీల నిర్మాణం కోసం రూ.7060 కోట్లు
ప్రధానమంత్రి నీటిపారుదల పథకం రూ. 1,000 కోట్లు
గృహ నిర్మాణ పథకానికి రూ.800 కోట్లు
గ్రామీణ తాగునీటి కోసం రూ.3,600 కోట్లు
మెట్రో పనుల కోసం రూ.100 కోట్లు
సీనియర్ సిటిజన్ల సంక్షేమం రూ. 6 వేల కోట్లు
సర్వశిక్ష అభియాన్ రూ.28,635 కోట్లు
ఆన్‌లైన్ విద్యాబోధన రూ.100 కోట్లు
పాఠశాలల అభివృద్ధి రూ.28 వేల కోట్లు
పోర్టుల అభివృద్ధి రూ.11,635 కోట్లు
గంగానది ప్రక్షాళన రూ.2037 వేల కోట్లు
రక్షణ రంగానికి రూ.2.29 లక్షల కోట్లు
బలగాల ఆధునికీకరణ రూ.3 వేల కోట్లు
వాటర్‌షెడ్ రూ.2,942 కోట్లు