సల్లంగ సూడు మాయమ్మ మహంకాళి

COVER 14

సుఖశాంతులై తెలంగాణ సుభిక్షంగా ఉండాలి

తొలి స్టేట్‌ ఫెస్టివల్‌ బోనాలకు హాజరై పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్‌

హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : పిల్లాపాప, గొడ్డూగోదా, చేను చెలకా సల్లంగ సూడు మాయమ్మ మహంకాళి తల్లి అంటూ భక్తజనం బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళీ బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం బోనాల జాతరను స్టేట్‌ ఫెస్టివల్‌గా ప్రకటించి ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఈ బోనాల జాతరలో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సతీసమేతంగా విచ్చేసి ఆదివారం సికింద్రాబాద్‌ ఉజ్జయని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి అమ్మవారికి బోనం సమర్పించారు. సీఎం రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అమ్మవారి దయవల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజలు బోనాల పండుగను జరుపుకోవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి దయ తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ ఉంటుందన్నారు. వర్షాలు కురిపించాలని, పాడిపంటలతో, పిల్లాపాపలతో ప్రజలను చల్లంగా చూడాలని, రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. బోనాల జాతరలో భాగంగా ఆదివారం ఉదయం 4 గంటలకు శాసన సభ్యుడు తలసాని శ్రీనివాస యాదవ్‌ కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారికి మొదటి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచేే భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని బోనాలను సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో ప్రభుత్వ యంత్రాంగం ఈ పండుగను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సందర్భంగా భారీ పోలీస్‌ భద్రతను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ఐదు క్యూలు, బోనాల కోసం ఒక ప్రత్యేక లైన్‌ను ఏర్పాటు చేశారు. కాగా, ఉదయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, మంత్రి ఈటెల రాజేందర్‌ తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు రాక సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తెలుగు వారంతా కలిసి మెలిసి స్నేహపూర్వకంగా ఉండాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. కాగా, మంత్రి ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ, తెలంగాణాలో బోనాలు జరుపుకునే భాగ్యం ఈసారి కలిగిందన్నారు. తెలంగాణ ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికార పండుగగా ప్రకటించిందన్నారు. సకాలంలో వర్షాలు కురిసి పిల్లాపాపలు ఆనందంగా ఉండేవిధంగా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు.