గాజా గజగజ

COVER 15

పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ భూతల దాడులు

120 దాటిన మృతుల సంఖ్య

మృతుల్లో పిల్లలు, మహిళలు, వృద్ధులు

పౌరులపై కుక్కలతో దాడులు, కాల్పులు

నోరు విప్పని ఐక్యరాజ్య సమితి

ఖండించని ప్రపంచ దేశాలు

భీతిల్లి వలస వెళ్తున్న పాలస్తీనీయులు

గాజా, జూలై 14 (జనంసాక్షి) :

ఇజ్రాయిల్‌ దాడులతో గాజా గజగజలాడుతోంది. ఇన్నాళ్లు బాంబుదాడులకు పాల్పడ్డ ఇజ్రాయిల్‌ ఏకంగా భూతల దాడులకు తెగపడింది. ఈ మారణహోమంలో ఇప్పటి వరకు 120 మందికి పైగా మృతిచెందినట్టు సమాచారం. మృతుల్లో అత్యధికంగా పిల్లలు, మహిళలు, వృద్ధులే ఉన్నారు. హమాస్‌ కేంద్రాల లక్ష్యంగా యుద్ధ విమానాలు బాంబులు కురిపించి పెద్ద ఎత్తున ప్రాణాలను బలిగొనగా రెండు రోజులుగా భూతల దాడులతో బెంబేలెత్తిస్తోంది. దీంతో పాలస్తీనీయులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దేశం విడిచి పారిపోతున్నారు. అంతటితో ఆగకుండా ప్రజలపై కుక్కలతోనూ దాడులు చేయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఐక్యరాజ్య సమితి నోరు విప్పడం లేదు. ప్రపంచ దేశాలు ఇజ్రాయిల్‌ దురాక్రమణను కనీసం పట్టించుకోవడం లేదు. దాడులను ఖండించడానికి కూడా ఎవరూ సిద్ధపడలేదు. ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు, ఇజ్రాయెల్‌పై పాలస్తీనియన్ల రాకెట్‌ దాడులతో పశ్చిమాసియా ప్రాంతం రగులుతోంది. గాజాస్ట్రిప్‌పై వరుసగా ఏడో రోజు కూడా ఇజ్రాయెల్‌ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో ఇద్దరు అశక్తులైన మహిళలతో సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో ఇప్పటి వరకు దాడుల్లో మరణించిన వారి సంఖ్య 120 కు చేరింది. కాల్పుల విరమణకు చర్చలు జరిగే విధంగా అంతర్జాతీయంగా ఒత్తిడి వచ్చినప్పటికీ ఆ దిశగా సూచనలు కనిపించటంలేదు. గాజాపై ఇజ్రాయెల్‌ గత ఐదు రోజులుగా వైమానిక దాడులు నిర్వహిస్తోంది. వీటిని తిప్పికొట్టేందుకు తీవ్రవాదులు రాకెట్‌ దాడులు నిర్వహిస్తున్నారు. ఈ రాకెట్‌ దాడులను నిలువరించేందుకు గాజాలో భూతల యుద్ధానికి దిగుతారా? అని ప్రశ్నించగా ‘మేము అన్ని అవకాశాలను పరిశీలి స్తున్నాం. అలాగే, అన్ని అవకాశాలకు సిద్ధమవుతున్నాం’ అని ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు చెప్పారు. ‘అన్ని అధికారాలను వినియోగించకుండా అంతర్జాతీయ ఒత్తిడి ఏదీ మా విూద పనిచేయటంలేదు” అని టెల్‌అవీవ్‌లో విలేకరులతో మాట్లాడుతూ నెతన్యాహు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బారక్‌ ఒబామా గురువారంనాడు నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడి పశ్చిమాసియా పరిస్థితిపై చర్చించారు. దాదాపు గత రెండు సంవత్సరాలలో ఇజ్రాయెల్‌- పాలస్తీనా మధ్య ఇంత తీవ్రస్థాయిలో హింసనెలకొనలేదు. గాజానగరం ఈశాన్య ప్రాంతంలోని పునరావాస శిబిరంపై ఇజ్రాయెల్‌ ట్యాంకులు కురిపించిన గుళ్లవర్షం ధాటికి ఇద్దరు వికలాంగులైన మహిళలతో సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నదని పాలస్తీనా వైద్యవిద్యార్థులు తెలిపారు. ఈ కేంద్రాన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ సైనిక ప్రతినిధి తెలిపారు. శనివారం తెల్లవారుజామున జరిపిన వైమానిక దాడిలో ముగ్గురు తీవ్రవాదులు, 65ఏళ్ల మహిళతో సహా నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని ఈ ప్రాంతంలోని వైద్యులు తెలిపారు.

గాజాస్ట్రిప్‌పై దాడులకు క్యూబా ఖండన

గాజాస్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ తాజా దాడులను క్యూబా తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల్లో వందమందికి పైగా మృతిచెందగా, వందలాది మందికి గాయాల య్యాయి. క్యూబా విదేశాంగ మంత్రి గెరార్డో పెనల్వర్‌ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్‌ తన సైనిక, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆయుధాలను దాడికి వినియో గించటాన్ని ఆ ప్రకటన తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ విధంగా చేయటం వల్ల అమాయక పౌరులు మృతిచెందగా, పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం సంభవిస్తోందని తెలిపింది. ఇజ్రాయెల్‌ ముందు తన హింసాత్మక చర్యలకు అంతంపలకాలని అంతరా? జాతీయ సమాజం ఒత్తిడి తీసుకురావాలని కోరింది.