గాజాలో కొనసాగుతున్న బాంబుల వర్షం
ప్రపంచ దేశాల ప్రేక్షకపాత్ర
గాజా/జెరూసలేం, జూలై 15 (జనంసాక్షి) :
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. వైమానిక దాడులతో పాటు భూతల దాడులను ఇజ్రాయెల్ కొనసాగిస్తోంది. పాలస్తీనాకు చెందిన తీవ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్ సేనలపై ప్రతిదాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో 180 మంది అమాయక ఇజ్రాయీలు మృతిచెందారు. 1600 మందికి పైగా గాయపడ్డారు. సోమవారం హమాస్ తొలిసారిగా ప్రయోగించిన మానవ రహిత విమానం (ద్రోన్) ఇజ్రాయెల్ కూల్చేసింది. హమాస్ ప్రయోగించిన ద్రోన్ తమ దేశంలోని అషదాద్ నగరానికి సమీపంలో కనిపించిందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజా సరిహద్దుల్లోని హమాస్ శిక్షణ కేంద్రాలతో పాటు పట్టణంపైనా దాడులు కొనసాగిస్తూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఇజ్రాయెల్ బాంబు దాడులతో 17 వేల మంది రక్షణ కోసం గాజాలోని బీత్ లహియాలోని ఐక్యరాజ్య సమితి శిబిరానికి చేరుకున్నారు. మరోవైపు లెబనాన్ నుంచి తమ భూభాగంలో రాకెట్ దాడులు జరిగాయని ఇజ్రాయెల్ తెలిపింది. గాజాపై దాడుల్లో అమాయక ప్రజలు సమిధలవుతున్నా ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి ప్రేక్షకపాత్ర వహించడంపై అంతర్జాతీయ పౌరహక్కుల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచిదికాదని భవిష్యత్తులో మరిన్ని సమస్యలను సృష్టిస్తుందని వారు పేర్కొంటున్నారు.