తెలంగాణపై కేసీఆర్ వరాల జడివాన
43 కీలకాంశాలకు కేబినెట్ ఆమోదం
ఉగ్రనరసింహున్నవుతా
ల్యాంకోహిల్స్‌లో ఇంచు భూమి వదలను
రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్
ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు
వ్యాట్ చట్టం సవరణ
రాష్ట్ర సలహామండలి ఏర్పాటు
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య పథకానికి జయశంకర్ పేరు
దళిత, గిరిజన యువతుల వివాహానికి కళ్యాణలక్ష్మి పథకం కింద రూ.50 వేలు
తెలంగాణ ఉద్యమకారులపై 2001 నుంచి పెట్టిన కేసుల ఎత్తివేత
కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్
తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీకి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరు
జర్నలిస్టులు, అడ్వకేట్ల సంక్షేమానికి కృషి
అత్యాధునిక హంగులతో తెలంగాణ జర్నలిస్టు భవనం
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు
హైదరాబాద్, జూలై 16 (జనంసాక్షి) :
ప్రజలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వరాల జడివాన కురిపించారు. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో 43 కీలకాంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో బుధవారం ఐదున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగిన మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీలో 43 అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలంగాణ అమరవీరులను ఆదుకోవడం తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం, అర్హులుంటే ఒకరికి ఉద్యోగం, కుటుంబం మొత్తానికి పూర్తి ఉచిత వైద్య సదుపాయం, గృహ వసతి, అమరుల పిల్లలకు ఉచిత విద్య, భూమి లేకుంటే 3 ఎకరాల భూమి అందజేస్తామని అన్నారు. దీనిని సత్వరమే అమలు చేయాలని రెవెన్యూ శాఖను కేబినెట్ ఆదేశించినట్లు తెలిపారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు రూ.1500, వృద్ధులు, వితంతువులకు రూ.1000 చొప్పున పింఛన్ దసరా నుంచి దీపావళి మధ్యలో అందజేస్తామని అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎస్‌ను ఆదేశించామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అందజేస్తామని చెప్పారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి పేస్కేల్ ఇంప్లిమెంట్‌కు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. తెలంగాణ ఇంక్రిమెంట్ అందిస్తామని అన్నారు. పరిశ్రమల అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదని ఇందుకోసం సింగిల్‌విండో విధానం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకోసం వెంటనే మార్గదర్శకాలు జారీ చేస్తామని అన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి రాష్ట్ర సలహా మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. సలహా మండలిలో జర్నలిస్టులు, మేధావులు, నిపుణులతో పాటు పలువురు సభ్యులుగా ఉంటారని అన్నారు. ఈ సంఘం కూడా త్వరలోనే ఏర్పడుతుందని చెప్పారు. ఇది అమలైతే జిల్లాల్లోనూ సలహా మండళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రెండు బెడ్రూంలు, కిచెన్, హాల్, బత్రూంతో కూడిన ఇంటి నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని, గ్రామీణ ప్రాంతాల్లోనైతే 125 గజాల్లో, పట్టణ ప్రాంతాల్లోనైతే అపార్ట్‌మెంట్లు కట్టిచ్చి వారికి అందజేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు గృహ నిర్మాణ శాఖలో అక్రమాలకు పాల్పడిన వారికి జైలు తప్పదని హెచ్చరించారు.
అన్యాక్రాంతమైన తెలంగాణ భూముల పరిరక్షణకు ఉగ్రనరసింహుడి అవతారం ఎత్తుతానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని భూములను ఇష్టారాజ్యంగా కట్టబెట్టారని, అలాంటి అక్రమ సామ్రాజ్యమే ల్యాంకో హిల్స్ అని తేల్చిచెప్పారు. వక్ఫ్‌బోర్డు భూముల్లో నిర్మించిన ల్యాంకోహిల్స్‌ను స్వాధీనం చేసుకొని తీరుతామన్నారు. కొన్ని మీడియా సంస్థలు ఈ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయని, అదే భూముల్లో ఉన్న ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలకు కేటాయించిన స్థలాలను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా అని కొత్త భాష్యాలు చెప్తున్నాయని, అవన్నీ ప్రభుత్వ కేటాయింపులని, ల్యాంకోహిల్స్‌కు కేటాయింపులు మాత్రం ప్రభుత్వపరంగా జరిగిన కుంభకోణమని చెప్పారు. ఇందులో ఇంచు భూమిని కూడా వదులకోబోమన్నారు. ఒక్క ల్యాంకోహిల్స్ మాత్రమే కాదని, ఎమ్మార్ ప్రాపర్టీస్ తదితర సంస్థలకు కేటాయింపులు కబ్జాలు ఉన్నాయని, వాటన్నింటిని స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఇకపై నగరంలో భూకబ్జాలు సాగబోవని ఆయన తేల్చిచెప్పారు. హైదరాబాద్‌లో 60 వేలకు పైగా అక్రమ భవనాలు ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్ర పరిపాలన కేంద్రం సచివాలయానికి సమీపంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకున్న వారే లేరని ఆయన తెలిపారు. వర్షం కురిస్తే సచివాలయం, సీఎం క్యాంపు ఆఫీస్, ఇతర ప్రధాన కూడళ్లలో నీళ్లు నిలుస్తున్నాయని ఇదేమిటని ప్రశ్నిస్తే నాళాలన్నీ కబ్జాకు గురైనట్లు అధికారులు చెప్తున్నారని పేర్కొన్నారు. ఇదేనా అభివృద్ధి అంటే అని ఆయన ప్రశ్నించారు. ఇకపై కబ్జాకోరుల ఆటలు సాగబోవని తేల్చిచెప్పారు. కబ్జాకు గురైన అన్ని భూములను స్వాధీనం చేసుకుంటామని ఆయన తేల్చిచెప్పారు. ప్రజల పొట్టలు కొట్టే, కుటుంబాలు కూల్చే నగరంలోని పేకాట క్లబ్బులను మూసివేయిస్తామని అన్నారు. నగరం ప్రపంచ శ్రేణి నగరంగా అవతరించబోతున్న తరుణంలో డంపింగ్ యార్డుల కోసం త్వరలో రెండు వేల ఎకరాల స్థలం కేటాయిస్తామని అన్నారు. త్వరలోనే తెలంగాణ భూదాన చట్టాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. భూదాన భూముల్లో అక్రమాలకు పాల్పడిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. భూ కమతాల ఏకీకరణకు రద్దుబదులు పథకం ఏర్పాటు చేస్తాని చెప్పారు. ఇది నిజాం కాలంలో అమల్లో ఉన్న పథకమని చెప్పారు. దేశం ఆశ్చర్యపడేలా జర్నలిస్టు భవన్ ఏర్పాటు చేస్తాని, నగరంలో మంచి ప్రాంతాన్ని చూసి భవన్‌ను నిర్మిస్తామని అన్నారు. జర్నలిస్టులు, అడ్వకేట్ల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పారు. నగర భద్రత వ్యవస్థలో సమూళ మార్పులకు గాను రూ.340 కోట్లు పోలీసు శాఖకు కేటాయిస్తున్నామని తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 3,620 కానిస్టేబుళ్లు భర్తీ చేస్తామని అన్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు తర్వాత వేలాది పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు. తెలంగాణ అమరవీరుల కుటంబాలు, పేదల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. దళిత, గిరిజనుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. రైతులు, పవర్‌లూమ్ కార్మికుల వ్యక్తిగత రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. వ్యవసాయ, బంగారు రుణాలను మాఫీ చేస్తామని, దీంతో ప్రభుత్వంపై రూ.19 వేల కోట్ల వరకు భారం పడుతుందని అన్నారు. నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల చొప్పున భూమిని పంపిణీ చేస్తామని అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను వచ్చే యేడాది నుంచి అమలు చేస్తామని చెప్పారు. ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు కమ్యూనిటీ పారామెడికల్ శిక్షణ ఇప్పించి వారి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేస్తామని , పర్యాటకరంగ అభివృద్ధి కోసం టూరిజం కార్పొరేషన్, మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నర్సింహారావు పేరుతో పశువైద్య యూనివర్సిటీ, జయశంకర్‌సారు పేరుతో హార్టికల్చర్ యూనివర్సిటీ, రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంలో స్వల్ప మార్పులు, ఎస్టీలు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ల కల్పనపై సిట్టింగ్ జడ్జిలతో కమిటీలు ఏర్పాటు చేసి అధ్యయనం చేస్తామని అన్నారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులను రక్షించడానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని, దానికి జ్యుడిషయరీ అధికారాలు ఇస్తామని అన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కర్నె ప్రభాకర్ పేరును కేబినెట్ సిఫార్సు చేసిందని, ఒకటి రెండు రోజుల్లో గవర్నర్ ఆమోద ముద్ర పడుతుందని చెప్పారు. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టం ప్రకారం శాసనసభకు ఒక ఆంగ్లో ఇండియన్ సభ్యుడిని నామినేట్ చేయాల్సి ఉందని, రేడియన్ రోచ్ పేరును కేబినెట్ భేటీలో ఖరారు చేసినట్లు చెప్పారు. తెలంగాణ రాజముద్రలో స్వల్ప మార్పులు చేసినట్లు సీఎం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ముద్ర అయిన మూడు సింహాల కిందనే సత్యమే వ జయతే అనే అక్షరాలుండాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లేఖ రాసిందని దాన్ని సవరిస్తామని అన్నారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా సీనియర్ న్యాయవాది కె. రామకృష్ణారెడ్డి నియామకానికి కేబినెట్ ఓకే చెప్పిందన్నారు. బీడీ కార్మికులకు త్వరలోనే వెయ్యి రూపాయల భృతి అందజేస్తామని తెలిపారు.
మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని..
– రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్
– మైనార్టీ రిజర్వేషన్లపై అధ్యయనానికి కమిటీ
– మైనార్టీల సంక్షేమానికి రూ.1000 కోట్లు
– జిల్లా జడ్జి స్థాయి అధికారితో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు
– రాజముద్రలో స్వల్ప మార్పులకు గ్రీన్‌సిగ్నల్
– ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చేందుకు ఆమోదం.. ఈ నిర్ణయం అమలు వల్ల ప్రభుత్వంపై రూ.180 కోట్ల భారం.
– కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే విషయాన్ని పరిశీలించేందుకు కమిటీ
– ఆటోలు, ట్రాక్టర్లు, ట్రాలీలపై వాహన పన్ను రద్దు
– తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం
– వ్యాట్ చట్టం సవరణకు ఆమోదం
– ఆర్‌ఎంపీలకు కమ్యూనిటీ పారామెడికల్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయం
– రాష్ట్ర సలహామండలి ఏర్పాటు చేయాలని నిర్ణయం
– కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య పథకానికి జయశంకర్ సారు పెట్టాలని నిర్ణయం
– పింఛన్‌దారులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇవ్వాలని నిర్ణయం
– గిరిజనుల అభివృద్ధికి కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం
– ప్రవాస తెలంగాణ వాసుల కోసం ప్రత్యేక విభాగం
– ఆటో, ట్రాలీలకు పన్ను తొలగింపు
– దళిత, గిరిజన యువతుల వివాహానికి కళ్యాణలక్ష్మి పథకం కింద రూ.50 వేల ఆర్థిక సాయం
– తెలంగాణ ఉద్యమకారులపై 2001 నుంచి పెట్టిన కేసుల ఎత్తివేత
– 500 జనాభా దాటిన లంబాడా తండాలు, గిరిజన గూడేలకు పంచాయతీ హోదా
– రాష్ట్రంలోని అన్ని శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్
– నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి
– ఫాస్ట్ పథకం కింద విద్యార్థుల చదువులకు సాయం
– వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1,500 పింఛన్
– జంట నగరాల్లో కల్లు దుకాణాల ఏర్పాటు
– తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఏర్పాటు దీనికి మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నర్సింహారావు పేరు పెట్టాలని నిర్ణయం.
– హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ రూపకల్పన
– 1956కు ముందు ఇక్కడ స్థిరనివాసం ఏర్పరుచుకున్న వారి స్థానికత ఆధారంగా బోధనరుసుంల చెల్లింపు
– టూరిజం కార్పొరేషన్ ఏర్పాటు
– తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం
– పోలీసు శాఖ ఆధునీకరణకు 3,883 వాహనాల కొనుగోలు కోసం ఆదేశాలు