శవాల గుట్టగా గాజా

COVER18

గల్లంతయిన మానవత్వం జాడ

ఆగని బాంబుల మోత.. వందలాదిగా మృత్యువాత

అమాయక పౌరుల ఊచకోత

పాలస్తీనాలో ఇజ్రాయెల్‌ ఉన్మాద మేడ

తట్టుకోలేని అమాయకులు… గుట్టలుగా శవాలు

12 రోజులు.. మృతులు 227

కడుపులో విషం.. మతిలేని కారణం

అంతిమంగా ఇం’ధనం’ కోసమే ఆధిపత్యం

ఈ దురాగతాలు విశ్వానికి కానేకాదు క్షేమకరం

ప్రపంచ దేశాల మౌనం శోచనీయం

అమెరికా తొత్తుగా ఐరాస నిర్వాకం

కళ్లూ చెవులూ మూసుకున్న పెద్దన్న

జెరూసలేం/గాజా, జూలై 17 (జనంసాక్షి) :

ప్రపంచ దేశాల ‘పెద్దన్న’ చమురు దాహానికి పాలస్తీనాలోని గాజా తదితరచోట్ల అమాయకుల ప్రాణాలు నైవేద్యమవుతున్నాయి. డజను రోజులుగా ఇజ్రాయెల్‌ దురాగతాలకు 227 మంది బలయ్యారు. ఇజ్రాయెల్‌ కడుపులో ఉన్నది విషమైతే.. పైకి నమ్మబలుకుతోన్న కారణం ఇంకోటి. ఎవరో వ్యక్తులు తమ దేశానికి చెందిన ముగ్గురు విద్యార్థులను అపహరించి హతమార్చారన్న ఒకే ఒక నెపంతో గాజాలో ఇజ్రాయెల్‌ మానవత్వపు జాడల్ని గల్లంతు చేసింది. గాజాలో గుట్టలు గుట్టలుగా స్థానిక పౌరుల శవాలు పేరుకుపోతున్నాయి. ఇజ్రాయెల్‌ ఎడతెరిపి లేకుండా కురిపిస్తున్న బాంబుల మోతతో పాలస్తీనా ఛిన్నాభిన్నమవుతోంది. రక్తం ఏరులై పారుతోంది. ముక్కుపచ్చలారని పసివాళ్లు సహా పండుటాకుల వరకూ నిస్సహాయస్థితిలో నిర్జీలవుతున్నారు. మరెందరో భవిష్యత్తులో కోలుకోలేని రీతిలో క్షతగాత్రులయ్యారు. ఇప్పటికే బాధితులు అనేక మంది శరీర భాగాలను కోల్పోయి శాశ్వతంగా అవిటివాళ్లయ్యారు. వారికి కనీస వైద్య సహాయం అందని అత్యంత దయనీయ దుస్థితి నెలకొంది. బతికుండి నరకాన్ని చవిచూడాల్సిన అగత్యం తిష్టవేసింది. ఈ మారణ హోమాన్ని ఆపడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావడంలేదు. మరోవైపు ఇజ్రాయెల్‌ సేనలు అంతకంతకూ రెచ్చిపోతున్నాయి. పాలస్తీనాలో ఉన్మాదపు మేడల్ని కట్టుకుంటున్నాయి. సాధారణ జన సమూహాలపై విరుచుకుపడుతున్నాయి. శత్రువులను ఎదుర్కొనే మౌలిక రక్షణ సామగ్రి పాలస్తీనాకు అందుబాటులో లేకపోవడం అక్కడి

ప్రజలకు మరింత ముప్పుగా పరిణమిస్తోంది. పాలస్తీనాలోని హమాస్‌ అనే తీవ్రవాద సంస్థ ఇజ్రాయెల్‌ విద్యార్థులు ముగ్గురిని కిడ్నాప్‌ చేసి చంపేసినందున ‘ప్రొటెక్టివ్‌ ఎడ్జ్‌’ పేరిట పాలస్తీనాపై ఆ దేశం ఉరుముతోంది. దుర్మార్గమైన దాడులతో భీకరంగా దండెత్తుతోంది. నిజానికి బాధ్యులైన తీవ్రవాదుల్ని కానీ..ఆ సంస్థను కానీ నేరుగా కట్టడి చేసే వీలున్నప్పటికీ ఇజ్రాయెల్‌ విస్మరించింది. తన మనసులో ఉన్నది ఒకటైతే పైకి మాత్రం విద్యార్థుల హత్యను సాకుగా చూపుతోంది. ఆ దేశం మదిలో ఉన్నదల్లా పాలస్తీనా ప్రాంతంలో ఉన్న చమురు నిక్షేపాలే. ఆ ఇం’ధన’ వనరుల కోసమే అత్యంత పాశవికంగా తెగబడుతోంది. తద్వారా పాలస్తీనాను నిర్వీర్యం చేయజూస్తోంది. ఇందుకు తగుదునమ్మా అన్నట్లు అగ్రరాజ్యం ఆజ్యం పోస్తోంది. ఈ విపరిణామాలపై సత్వరం చలించాల్సిన ఐక్యరాజ్య సమితి తన పవిత్ర ధర్మాన్ని, బాధ్యతల్ని మరిచిపోయి అమెరికాకు తొత్తుగా వ్యవహరిస్తోంది. అంతేకాదు…కాలఖర్మానికి అమ్నెస్టీ ఇంటర్నేష్నల్‌ నోరు విప్పకపోవడం విషాదకరమవుతోంది. ఆపదలో పడిన బాధిత దేశానికి అండగా నిలువాల్సిన తరుణంలో ప్రపంచ స్థాయి సంస్థలు మిన్నకుండిపోవడం మానవతావాదుల హృదయాలను బరువెక్కిస్తున్నాయి. ఇప్పటికే పన్నెండు రోజులుగా చిగురుటాకుల వణికిపోతున్న పాలస్తీనా వంక కన్నెత్తయినా చూడకపోవడం, నరమేధాన్ని నిలువరించకపోవడం విశ్వంలోని ఏ ఇతర దేశాలకు కూడా మంచిదికాదు. రానురాను చమురు నిక్షేపాల సంక్షోభం వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదు. ఏ వివాదాన్నైనా చర్చల ద్వారా పరిష్కరించుకునే మార్గాలున్నా ఇలా నిరాయుధులైన పౌరులే లక్ష్యంగా గాజాను అగ్నిగుండం చేయడం ఏమాత్రం క్షంతవ్యంకాదు. పాలస్తీనా, గాజాల్లో ఇజ్రాయెల్‌ సాగిస్తోన్న విధ్వంసాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మానవ వైపరీత్యానికి తక్షణం తెరదించాల్సి ఉంది.