మరో కోటి మంది నివాసయోగ్యంగా హైదరాబాద్
భవన నిర్మాణ అనుమతులు సరళీకృతం చేద్దాం
అక్రమ నిర్మాణాలు తొలిగిద్దాం
మునిసిపల్ అధికారులతో కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్, జూలై 19 (జనంసాక్షి) :
హైదరాబాద్ మహా నగరాన్ని మరో కోటి మంది నివాసానికి అనుగుణంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. నగరంలో భవన నిర్మాణానికి అనుమతుల జారీని మరింత సరళతరం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. శనివారం సచివాలయంలోని సీ బ్లాకులో ఆయన రాష్ట్రంలో మునిసిపాలిటీల పనితీరుపై సమీక్షించారు. మునిసిపల్ శాఖలో పెరిగిపోయిన అవినీతిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మునిసిపాలిటీల పరిధిలోని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలని సూచించారు. హైదరాబాద్ నగరం ఐటీఐఆర్ ప్రాజెక్టుతో మరింత అభివృద్ధి చెందుతుందని ఈ నేపథ్యంలో మరో కోటిమందికి ఆవాస యోగ్యంగా నగరాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగు పరచాలని ఆయన సూచించారు. మునిసిపాలిటీలను అభివృద్ధి చేయడంతో పాటు అవినీతి రహితంగా సేవలందించేందుకే ఈ శాఖను తన వద్ద ఉంచుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో అన్ని మునిసిపాలిటీల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.