పాతబస్తీ మహంకాళి ఆలయంలో బోనాలఉత్సవాల సందడి

54555

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పాతబస్తీలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ తెల్లవారుజామున 4గంటలకు అమ్మవారి మేలుకొలుపుతో భక్తులు లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించడం ప్రారంభించారు. భక్తుల రద్దీతో ఆలయం కిటకిటలాడుతోంది. తెలంగాణ ప్రభుత్వం బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో జీహెచ్‌ఎంసీ, దేవాదాయశాఖ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో దాదాపు 6వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. నగర జాయింట్‌ పోలిస్‌కమిషనర్‌ అంజనీకుమర్‌, దక్షిణ మండలం డీసీపీ త్రిపాఠి తదితరులు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాంగ్రెస్‌ నేత జానారెడ్డి, సికింద్రాబాద్‌ మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌లు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.