మహంకాళమ్మకు బంగారు బోనం
సుఖశాంతులతో తెలంగాణ సుభిక్షంగా చూడమ్మ
నీ దయతోనే తెలంగాణ వచ్చిందమ్మ
తొలి తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నం
ఆలయాన్ని అద్భుతంగా తీర్యిదిద్దుతామే అమ్మ : ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, జూలై 20 (జనంసాక్షి) :
లాల్‌దర్జా మహంకాళమ్మకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బంగారు బోనం సమర్పించారు. సుఖశాంతులతో తెలంగాణ సుభిక్షంగా ఉండేలా దీవించాలంటూ వేడుకున్నారు. అమ్మదయతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో లాల్‌దర్వాజ, అక్కన్న మాదన్న దేవాలయాల్లో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలతో కలకలలాడుతున్న నగరాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రంలో భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తున్న ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు చెప్పారు. ప్రతియేటా ఇలాగే ప్రజలు బోనాల పండుగను ఘనంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తాను లాల్‌దర్వాజ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక రాష్ట్రంలో బోనం సమర్పించుకుంటానని మొక్కుకున్నానని తెలిపారు. మొక్కు ప్రకారం అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించుకున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి రాష్ట్ర పండుగగా బోనాలు జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. అమ్మవారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని అన్నారు. అధికారికంగా బోనాల పండుగను జరుపుకుంటున్నామంటే అది అమ్మవారి దయ, చలువేనని అన్నారు.
మరోవైపు ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ప్రజలు బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పెద్దఎత్తున పిల్లాపాపలతో ఆలయాలకు చేరుకుని సందడి చేశారు. ఉదయం 6 గంటల నుండే తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయబద్ధంగా డప్పు వాయిద్యాలతో ప్రజలు భక్తిశ్రద్ధలతో అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. భక్తులతో అమ్మవారి దేవాలయాలు కిటకిటలాడాయి. తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో నగరంలో భక్తులకు అసౌకర్యాలకు, ఇబ్బందులు కలుగకుండా జీహెచ్‌ఎంసీ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. అక్కన్న మాదన్న అమ్మవారి ఆలయంలో ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటునుంచి బయలుదేరి సిఎం పాతబస్తీలోని లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. బంగారు బోనమెత్తుకుని ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి పాతబస్తీ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో పాటు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా సికింద్రాబాద్ చిలకలగూడలోని కట్టమైసమ్మ అమ్మవారికి మంత్రి పద్మారావు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ నేత జానారెడ్డి, టీడీపీ నేత తలసాని శ్రీనివాసయాదవ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి లాల్‌దర్వాజ అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం 30 ప్రత్యేక, 9 కంపెనీల కేంద్ర పోలీస్ బలగాలను మొహరింపజేశారు. జంటనగరాల్లో సుమారు వెయ్యికిపైగా అమ్మవారి దేవాలయాల్లో ప్రజలు భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ వేడకలు జరుపుకున్నారు.