రంజాన్‌ పవిత్ర ఉపవాస దీక్షను భగ్నం చేసిన శివసేన ఎంపీ

COVER24
భగ్గుమన్న పార్లమెంట్‌ ఉభయ సభలు

ముస్లిం ఉద్యోగి నేమ్‌ ప్లేట్‌ చూశాకే ఎంపీ అలా ప్రవర్తించారు : బాధితుడు

న్యూఢిల్లీ, జూలై 23 (జనంసాక్షి) :

శివసేన ఎంపీలు ముస్లిం కార్మికుడితో బలవంతంగా రంజాన్‌ పవిత్ర ఉపవాస దీక్షను భగ్నం చేయించారు. ఉద్దేశపూర్వకంగా అతడితో చపాతి తినిపించిన ఘటన పార్లమెంట్‌ ఉభయ సభలను కుదిపేసింది. దీనిపై చర్చించాలని డిమాండ్‌ చేయడంతో గందరగోళం నెలకొంది. బుధవారం ఉదయం లోక్‌సభ ప్రారంభంకాగానే పలువురు విపక్ష ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తారు. మత స్వేచ్ఛను శివసేన ఎంపీలు కాలరాశారని విమర్శించారు. వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. ప్రధాని నరేంద్ర మోడీ సభలో ఉండగానే ఈ గందరగోళం చోటుచేసుకుంది. స్పీకర్‌ సమిత్రా మహాజన్‌ సర్దిచెప్పినా వారు వెనక్కు తగ్గలేదు. దీంతో సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. రాజ్యసభ కూడా ‘చపాతి’ ఘటనపై అట్టుడికింది. ఢిల్లీలోని న్యూ మహారాష్ట్ర సదన్‌ లో తమకు మహారాష్ట్ర వంటకాలు వండిపెట్టలేదన్న కారణంతో ఆగ్రహానికి గురైన 11 మంది ఎంపీలు ముస్లిం మతస్థుడైన కేటరింగ్‌ సూపర్వైజర్‌ తో బలవంతంగా చపాతి తినిపించారు. అతడి రంజాన్‌ ఉపవాస దీక్షను భగ్నం చేశారు. ఈ వీడియో వార్తా చానళ్లలో ప్రసారం కావడంతో విపక్షాలు భగ్గుమన్నాయి. ఇందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో శివసేన ఎంపీలు ఆహారం విషయంలో గొడవ చేశారు. అక్కడ మరాఠీ ఆహారం వడ్డించడం లేదంటూ కేటరింగ్‌ సూపర్‌ వైజర్‌తో గొడవకు దిగారు. ఆ ఆహారాన్ని కనీసం వండి వడ్డించినవారైనా తినలేరని ఎంపీలు వీరంగం సృష్టించారు. ఆ సందర్భంగా శివసేన ఎంపీలు ఆహారాన్ని తినాలంటూ కేటరింగ్‌ సూపర్‌వైజర్‌ను బలవంతం చేశారు. సూపర్‌వైజర్‌ ముస్లిం కావడంతో ప్రస్తుతం రంజాన్‌ ఉపవాస దీక్షలో ఉన్నాడు. దాంతో శివసేన ఎంపీల గొడవ పెద్దదయింది. ఈ వ్యవహారం మొత్తం ప్రసార మాద్యమాల్లో రావడంతో పార్లమెంట్‌ను కుదిపింది. ఈ అంశంపై పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేశాయి. ఈ అంశంపై చర్చకు అనుమతించాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. జీరో అవర్‌లో చర్చకు అనుమతి ఇస్తామని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ చెప్పినా సభ్యులు వినకుండా సభ సమావేశాలకు అంతరాయం కలిగించారు.

అద్వానీ అసంతృప్తి

రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన ‘చపాతి’ ఘటనపై బీజేపీ సీనియర్‌ నాయకుడు ఎల్కే అద్వానీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఆమోదయోగ్య చర్య కాదని పేర్కొన్నారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌ లో ముస్లింతో బలవంతంగా శివసేన ఎంపీలు చపాతి తినింపించిన ఘటనపై ఆయనీ విధంగా స్పందించారు. తమకు మహారాష్ట్ర వంటకాలు పెట్టలేదనే ఆగ్రహంతో శివసేన ఎంపీలు ముస్లిం కేటరింగ్‌ సూపర్వైజర్‌ తో బలవంతంగా చపాతి తినిపించే ప్రయత్నం చేశారు. గతవారం చోటుచేసుకున్న ఈ ఘటనపై బుధవారం పార్లమెంట్‌ ఉభయ సభలు దద్దరిల్లాయి.

గొంతునొక్కే ప్రయత్నం

తమ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరే ఆరోపించారు. ఇతర మతాల పట్ల తమ పార్టీకి ఎటువంటి ద్వేషం లేదని ఆయన స్పష్టం చేశారు. శివసేన ఎంపీలు ఢిల్లీలో ముస్లింతో బలవంతంగా చపాతి తినిపించేందుకు ప్రయత్నించి అతడి ఉపాసన దీక్షను భగ్నం చేశారని వచ్చిన ఆరోపణలపై థాకరే స్సందించారు. ‘ఇది శివసేన గొంతు నొక్కేందుకు జరుగుతున్న ప్రయత్నం. హిందుత్వ వాదులుగా ఉనప్పటికీ ఇతర మతాల పట్ల మాకు ద్వేషభావం లేదు’ అని ఉద్దవ్‌ థాకరే పేర్కొన్నారు. మహారాష్ట్ర సదన్‌ లో ముస్లింతో శివసేన ఎంపీలు బలవంతంగా చపాతి తినిపించేందుకు ప్రయత్నిస్తున్న వీడియోలు బయటకు రావడంతో నిరసన వ్యక్తమవుతోంది. అయితే తన నేమ్‌ ప్లేట్‌ చూసిన తర్వాతనే శివసేన ఎంపీలు తనతో చపాతి తినిపించారని క్యాటరింగ్‌ సూపర్‌వైజర్‌ వాపోయాడు.