సీమాంధ్రులు ఆశించినట్లు అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాలేదు
ఆంధ్ర ముఖ్యమంత్రి హాజరైన ఇఫ్తార్ విందుకు కేసీఆర్ డుమ్మా
హైదరాబాద్, జూలై 23 (జనంసాక్షి) :
సీమాంధ్రులు ఆశించిన అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాలేదు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఇచ్చిన ఇఫ్తార్ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరుకాలేదు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కేసీఆర్ ఈ విందులో ముఖాముఖి కలుసుకుంటారని అంతా అనుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య నదీ జలాలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో వీరిద్దరి కళయికకు సీమాంధ్ర మీడియా అధిక ప్రాధాన్యతనిచ్చింది. అయితే సీఎం కేసీఆర్ ఈ ఇఫ్తార్ విందుకు డుమ్మా కొట్టారు. ఆయనకు బదులుగా ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ ఈ విందుకు హాజరయ్యారు. సీఎం కేసీఆర్ వివిధ శాఖల అధికారులతో సమీక్షలలో బిజీగా ఉన్నందునే ఈ విందుకు గైర్హాజరైనట్లుగా తెలుస్తోంది. ఈ విందులో ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పరస్పరం ఎదురుపడి నమస్కారం చేసుకున్నారు. విందులో మంత్రి నాయిని నర్సింహారెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ప్రతిపక్ష నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏసీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, సీఎస్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.