ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయండి

COVER26

ఒప్పందాలు చేయండి

1500 మెగావాట్ల విద్యుత్‌కు వీలుగా లైన్లు వేయండి

కరెంట్‌ కష్టాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌, జూలై 25 (జనంసాక్షి) :

తెలంగాణ రాష్ట్రానికి అవసరమయ్యే విద్యుత్‌ను చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి కొనుగోలు చేయాలని, ఇందుకు సంబంధించి ఒడంబడికలు చేసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. వచ్చే ఐదేళ్ల కోసం రెండువేల మెగావాట్ల విద్యుత్‌ను ఆ రాష్ట్రం నుంచి తెచ్చుకునేందుకు ఆ ప్రభుత్వంతో మాట్లాడడం జరిగిందన్నారు. శుక్రవారం సచివాలయంలో విద్యుత్‌ లోటు పూడ్చుకునే అంశంపై అనుసరించాల్సిన తక్షణ, మధ్యకాల, దీర్ఘకాల వ్యవహారాలపై విద్యుత్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం, ప్రైవేట్‌ రంగాల్లో విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోందని, అక్కడ కావలసిన విద్యుత్‌ అందుబాటులో ఉందని సిఎం చెప్పారు. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నుండి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ తెచ్చుకునేందుకు వీలుగా లైన్లు నిర్మించాలని, ఇందుకోసం వెంటనే పీసీఏ కుదుర్చుకోవాలని అధికారులకు సూచించారు. ఛత్తీస్‌గఢ్‌ నుండి 1500 మెగావాట్ల విద్యుత్‌ను పొందేందుకు వీలుగా ప్రత్యేక విద్యుత్‌ లైన్లు నిర్మించాలని సూచించారు. ఆ రాష్ట్రం నుంచి విద్యుత్‌ను పొందే విషయంలో అధికారులు వెంటనే కార్యరంగంలో దిగాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సిఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగ్‌రావు, ట్రాన్స్‌కో ఎండీ రిధ్వి, జాయింట్‌ ఎండి కార్తీకేయ మిత్ర, సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌ పాల్గొన్నారు.