గృహ నిర్మాణ అక్రమాలపై కేసీఆర్ కొరడా
2004 నుంచి 2014 ఇళ్ల నిర్మాణాలపై విచారణ
సీబీసీఐడీ ఎంక్వైరీకి సీఎం ఆదేశం
హైదరాబాద్, జూలై 26 (జనంసాక్షి) :
గృహ నిర్మాణ శాఖలో జరిగిన అక్రమాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కొరడా ఝలిపించాలని నిర్ణయించారు. 2004 నుంచి 2014 వరకు జరిగిన అక్రమాలపై సీబీసీఐడీ విచారణకు సీఎం ఆదేశించారు. శనివారం
సీఎం హౌసింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2006 నుంచి 2014 మధ్య 22.40 లక్షల గృహాలు నిర్మించినట్టు లెక్కలు చెప్తున్నప్పటికీ వీటిలో ఎన్నింటి నిర్మాణాలు పూర్తయ్యాయి.. ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే విషయంపై స్పష్టత లేదన్నారు. గత ప్రభుత్వాలు వీటిలో అక్రమాలను కొంతవరకు గుర్తించి థర్డ్ పార్టీ, శాఖాపరమైన విచారణలు చేపట్టి 490 మంది అధికారులను సస్పెండ్ చేసిందని, మరో 285 మందిని డిస్మస్ చేసిందని చెప్పారు. వీరిలో కొంతమంది ఇప్పటికీ జైళ్లలోనే ఉన్నారని, అప్పట్లో చాలామంది నాయకులపై కేసులు కూడా నమోదయ్యాయని అన్నారు. తమ ప్రభుత్వం 593 గ్రామాల్లో ప్రాథమిక విచారణ జరపగా రూ.235 కోట్లు దుర్వినియోగం అయినట్లు తేలిందని చెప్పారు. 36 వేల ఇళ్లు నిర్మించకుండానే కాంట్రాక్టర్లు బిల్లులు పొందారని తెలిపారు. 2008-09 ఆర్థిక సంవత్సరంలోనే 75 శాతం అక్రమాలు జరిగాయని, ఆ సమయంలో ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖకు రూ.5,500 కోట్లు విడుదల చేసిందని, 13 లక్షల ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఒక్క యేడాదిలోనే ఇంతపెద్ద ఎత్తున జరిగిన అవినీతి ఆ తర్వాతి కాలంలో విచ్చలవిడిగా కొనసాగిందని అన్నారు. తాను ఈ విషయాన్ని శాసనసభలో వెల్లడించినప్పుడు అన్ని రాజకీయపక్షాల నాయకులు సమగ్ర విచారణ జరపాలని కోరారని చెప్పారు. కొన్ని గ్రామాల్లో 99 శాతం గృహ నిర్మాణం పూర్తయినట్టు చెప్తున్నా అక్కడ ఒక్క ఇళ్లు కూడా నిర్మించలేదని అన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 45 వేల ఇళ్లు, మంథని నియోజకవర్గంలో 41,009 ఇళ్లు, కొడంగల్‌లో 32,337 ఇళ్లు, పరిగి నియోజకవర్గంలో 30,416 ఇళ్లు కట్టినట్లు లెక్కలు చెప్తున్నప్పటికీ అవన్నీ తప్పులేనని సీఎం వివరించారు. ఇళ్ల నిర్మాణాల్లోనే కాదు పెన్షన్ల విషయంలోనూ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రేషన్‌కార్డులు, ఇలా అనేక అంశాల్లో భయానక పరిస్థితి నెలకొని ఉందని, అవినీతి తారస్థాయికి చేరుకున్నదని అన్నారు. ప్రభుత్వం నూతనరగా నిర్మించదలుచుకున్న డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో ఇలాంటి పొరపాట్లు దొర్లకుండా కఠినంగా ఉంటామని చెప్పారు. గృహ నిర్మాణశాఖలో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో నయా పైసా దుర్వినియోగం జరిగినా బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 83,59,000 కుటుంబాలకు సంబంధించి సమగ్ర సర్వే నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల కేటాయింపులో అవినీతి, అక్రమాలకు తావులేకుండా ఈ సర్వే ఉపయోగపడుతుందని అన్నారు. ప్రభుత్వంలోని నాలుగు లక్షల మంది ఉద్యోగుల ద్వారా కేవలం ఒకే ఒక్క రోజు పూర్తయేలా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకోసం కలెక్టర్లు, జేసీ, ఆర్డీవోలు, తహశీల్దార్లతో ఆగస్టు 1న హైదరాబాద్‌లో సన్నాహక సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. సమగ్ర సర్వే అనంతరం సిసలైన లబ్ధిదారులను గుర్తించి గృహ నిర్మాణ పథకం అమలు చేస్తామని కేసీఆర్ తెలిపారు.