పారదర్శకతకు పెద్దపీట

cover28
ప్రభుత్వ పథకాలకు ఆధార్‌

ఐరీస్‌్‌, బయోమెట్రిక్‌తో అనుసంధానం

నేరుగా లబ్ధిదారునికే సంక్షేమ ఫలాలు

అవినీతిరహిత పాలనతో దేశానికే ఆదర్శం

నిష్ణాతులతో కేసీఆర్‌ బృహత్‌ ప్రణాళికలు

హైదరాబాద్‌, జూలై 27 (జనంసాక్షి) :

పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మానానికి బృహత్‌ ప్రణాళికలు రూపొందించడంపై చర్చించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు, అవినీతి రహిత పాలన అందించేందుకు వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ప్రభుత్వ పథకాల్లో అవినీతి, అక్రమాలను అంతమొందించేందుకు ఆధార్‌ కార్డులను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. నేరుగా లబ్ధిదారులకే సబ్సిడీలు అందించేందుకు ఐరీస్‌, బయోమెట్రిక్‌ విధానాలతో అనుసంధానం చేయాలని, ఇందుకోసం పది జిల్లాల్లోని ప్రజల నుంచి ఐరీస్‌, బయోమెట్రిక్‌ విధానంలో వేలి ముద్రలను సేకరించాలని నిర్ణయించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలు, నాయకులకు లబ్ధి చేకూర్చేవిగా మారిపోయిన నేపథ్యంలో తమ ప్రభుత్వం అలాంటి విధానాలకు స్వస్తి పలకనున్నట్లు కేసీఆర్‌ స్పష్టం చేశారు. అవినీతిరహిత పాలన అందించడమే తమ ధ్యేయమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి సాధించాలంటే అవినీతిని కూకటి వేళ్లతో పెగిల్చాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం వల్ల అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి సాధ్యమనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. నగరాన్ని అభివృద్ధి చేసే క్రమంలో కాలుష్యరహితంగా తీర్చిదిద్దడానికి గ్రీన్‌ సిటీ పథకానికి రూపకల్పన చేశామని, రాజధానిలో వచ్చే మూడేళ్లలో లక్షలాది మొక్కలు నాటుతామని తెలిపారు. ఐటీఐఆర్‌తో నగరం మరింతగా విస్తరించనుందని మరో కోటి మందికి ఆవాసయోగ్యంగా నగరాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు లండన్‌ తరహాలో పోలీసింగ్‌ ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం ఇప్పటికే నిధులు విడుదల చేశామని చెప్పారు. నిరుపేదలకు రెండు బెడ్రూంలు, హాల్‌, కిచెన్‌, బాత్రూంలతో కూడిన ఇంటిని నిర్మించి ఇస్తామని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టో తమకు భగవద్ఘీతతో సమానమని ఆయన అన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమకు అధికారాన్ని అప్పగించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయబోమని తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిస్తామని గృహ నిర్మాణ పథకంలో వందలాది కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, పూర్తిస్థాయి విచారణ బాధ్యతను సీబీసీఐడీకి అప్పగించామని తెలిపారు. 1956 ముందు తెలంగాణలో స్థిరపడ్డ వారి పిల్లలందరి ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌పై ఎలాంటి ఆందోళన వద్దని సూచించారు. ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందించేందుకు కృత నిశ్చయంతో ఉందని ఆయన పునరుద్ఘాటించారు.