కేసీఆర్‌.. వెల్‌ కం టూ సింగపూర్‌

COVER 29
మొదటి ఆహ్వానం అందుకున్న తొలి ముఖ్యమంత్రి

వారం రోజుల్లో తెలంగాణ పారిశ్రామిక విధానానికి తుది రూపు : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) :

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన తొలి విదేశీ పర్యటనగా సింగపూర్‌కు వెళ్లనున్నారు. సింగపూర్‌ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆయన ప్రయాణమవుతున్నారు. సింగపూర్‌లో ఇండియయన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ పూర్వ విద్యార్థుల అసోసియేషన్‌ నిర్వహించే సదస్సుకు సీఎంకు ఆహ్వానం అందింది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యంత్రిగా, దేశంలోనే విభిన్నమైన, వినూత్నమైన నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించడంలో నిమగ్నమైన ముఖ్యమంత్రిని వాళ్ళు ప్రత్యేకంగా ఆహ్వానించారు. విఐపి గెస్ట్‌గా హాజరవడమే కాకుండా వివిధ దేశాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఐఐఎం పూర్వ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాలని కోరారు. సంగపూర్‌లోని రాఫెల్స్‌ సిటీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆగస్ట్‌ 22-23వ తేదీన నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సింగపూర్‌ ప్రధాని థర్మన్‌షణ్ముగరత్నం, మంత్రి ఎస్‌.ఈశ్వరన్‌ కూడా హాజరుకానున్నారు. ఐఐఎం అలుమ్ని సింగపూర్‌ నుంచి ఆహ్వానం అందుకున్న తొలి ముఖ్యమంత్రి కూడా కెసిఆరే. సదస్సుకు ఆహ్వానిస్తూ నిర్మాహకులు ఓ లేఖను కూడా ముఖ్యమంత్రికి పంపారు. తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించడం మొదలు కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు తీయించడంలో శక్తివంచన లేకుండా కృషిచేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఐఐఎం అలుమ్నీ శుభాకాంక్షలు తెలిపింది. కొత్త రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక విధానాలతోపాటు ఐఐఎం అలుమ్నీ ఎలాంటి పాత్ర పోషించాలనే అంశంపై ప్రధానంగా ప్రసంగించాలని వాళ్ళు కోరారు. సింగపూర్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతున్న పారిశ్రామిక విధానంపై ఆసక్తిగా, ఉత్సాహంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణకు అవసరమైన సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నమని భరోసా ఇచ్చారు. సింగపూర్‌ పర్యటనలో ముఖ్యమంత్రితో చర్చించేందుకు సిఇఓల బృందం కూడా సిద్ధంగా ఉంటుందని వారు కేసీఆర్‌కు వివరించారు. ఇంపాక్ట్‌ 2014పేరుతో జరుగుతున్న ఈ రెండు రోజుల కార్యక్రమానికి సింగపూర్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐఐఎం సభ్యులు, కార్పొరేట్‌ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు హాజరుకాబోతున్నారు. సింగపూర్‌తోపాటు ఆసియాలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, వివిధ రంగాల్లో నూతన ఒరవడులు, బిజినెస్‌ ఐడియాస్‌ను ఇక్కడ చర్చించబోతున్నారు. 2013లో ఏర్పాటు చేసిన సమావేశాలకు అనూహ్యమైన స్పందన రావడంతో ఈసారి రెట్టించిన ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు నిర్వాహకులు వించారు.  ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయించుకున్నారు. నూతన పారిశ్రామిక విధానాన్ని సంగపూర్‌ తరహాలో రూపొందిస్తామని ఇప్పటికే పలు సందర్భాలో కేసీఆర్‌ పారిశ్రామిక వేత్తలకు భరోసా ఇచ్చారు. అక్కడి మోడల్‌ను పరిశీలించడంతోపాటు అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ముఖ్యంత్రి సింగపూర్‌ వెళ్తున్నారు. ఆలోపుగానే తెలంగాణ పారిశ్రామిక విధానం కూడా ఖరారు అవుతుంది. కాబట్టి అక్కడ దాన్ని వివరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే అవినీతిరహిత, పారదర్శక పారిశ్రామిక విధానాన్ని బాగా ప్రచారం చేయడనాకి కూడా ఈ సదస్సు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ముఖ్యమంత్రి వెంట సిఎంఓ అధికారులు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు కూడా సింగపూర్‌ వెళ్లనున్నారు.  రెండుమూడు రోజులపాటు సింగపూర్‌లో ఉండి పూర్తిగా అక్కడి పారిశ్రామిక విధానాన్ని అధ్యయనం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారు. బంగారు తెలంగాణ కల సాకారం చేసేందుకు నూతన పారిశ్రామికాభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఓ అవకాశంగా మార్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది.

వారం రోజుల్లో తెలంగాణ పారిశ్రామిక విధానానికి తుదిరూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి పారిశ్రామిక విధాన రూపకల్పనపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు బివి పాపారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, తెలంగాణ ఐఐసి ఎండి జయేశ్‌రంజన్‌, సిఎంఓ అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్‌ ఈ సమీక్షలో పాల్గొన్నారు. పరిశ్రమల కోసం అందుబాటులో ఉన్న భూమిని సేకరించి ముందుగానే టిఎస్‌ ఐఐసికి అప్పగించాలని పరిశ్రమలకు కావాల్సిన అన్ని అనుమతులు ప్రభుత్వమే ముందస్తుగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. అన్ని పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండల అనుమతి అవసరంలేదని తేల్చారు. పిఓబి అనుమతి కావాల్సిన పరిశ్రమలేవో, అనుమతి అవసరంలేని పరిశ్రమలేవో తేల్చాలని కూడా చెప్పారు. టిఎస్‌ ఐఐసికి కేటాయించిన భూమికి కావాల్సిన మౌలిక వసతులన్నీ సమకూర్చి వాటిని పారిశ్రామిక వాడలుగా మార్చాలని చెప్పారు. పరిశ్రమలకు కావాల్సిన నీరు, కరెంటు ఇతర మౌలిక సదుపాయాలను వివరించడంతోపాటు, సదరు భూమి ఏ ప్రాంతంలో ఉన్నది? రైల్వేట్రాక్‌, విమానాశ్రయం, నేషనల్‌ హైవే, స్టేట్‌ హైవే ఎంత దూరంలో ఉన్నవి? అనే సంగతులు కూడా తెలిపేవిధంగా మ్యాపులు, ఫొటోలు, వీడియోలతో సహ అన్ని విషయాలను వెబ్‌సైట్లో పెట్టాలని చెప్పారు. ప్రపంచంలోని పెట్టుబడిదారులంతా గూగుల్‌లో వెక్కునే విధంగా కో-ఆర్డినేటర్స్‌ కూడా ఇచ్చి పారిశ్రామిక వాడలను ఆన్‌లైన్లో పరిచయం చేయానలి సూచించారు. పరిశ్రమల స్థాపనతోపాటు అందులో పనిచేసే ఉద్యోగులకు కూడా అక్కడే నివాసయోగ్యమైన టౌన్‌షిప్‌ నిర్మించాలని, ఇందుకోసం పరిశ్రమలకు కేటాయించిన భూమిలోంచి కొంతశాతాన్ని ఇవ్వాలని చెప్పారు. పారిశ్రామిక విధానం ఎలా ఉండాలి? సింగిల్‌విండో సిస్టమ్‌ ఎలా పనిచేయాలి? చేజించ్‌ సెల్‌ చేయాల్సిన పనులేమిటి? కొత్తగా చేయాల్సిన చట్టాలేమిటి? విధానపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలేంటి? తదితర విషయాలన్నింటిపై వారంలోగా స్పష్టత రావాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటికే దేశ, విదేశాలకు చెందిన పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నందున ప్రపంచలో మరెక్కడాలేనంత గొప్పగా తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలని చెప్పారు.