మన కౌన్సెలింగ్‌ మనమే నిర్వహించుకుందాం

COVER31
ఆంధ్రా సర్కార్‌ కౌన్సెలింగ్‌కు వెళ్లొద్దు

ఎవరి బిడ్డలకో మనం ఫీజు కట్టాలనడం అర్థరహితం

విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌, జూలై 30(జనంసాక్షి) : మన కౌన్సెలింగ్‌ మనమే నిర్వహించుకుందామని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. ఏపీఎస్‌సీహెచ్‌ఈ ఏర్పాటుచేసిన ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో తెలంగాణ విద్యార్థులెవరూ పాల్గొనొద్దని స్పష్టంచేశారు. ఇవాళ ఏపీఎస్‌సీహెచ్‌ఈ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన నోటిఫికేషన్‌తో తెలంగాణ సర్కారుకు ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెప్పారు. తెలంగాణకు సంబంధించి ఏ విద్యార్థి కూడా కౌన్సెలింగ్‌కు వెళ్లొద్దని మన కౌన్సెలింగ్‌ మనమే నిర్వహించుకుందామని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురికావొద్దన్నారు. కొంత ఆలస్యమైనా మన విద్యార్థులకు మనమే సీట్లు ఇచ్చుకుందామన్నారు. గతంలో కూడా ఎన్నోసార్లు అక్టోబర్‌లో క్లాస్‌లు ప్రారంభమైన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. కౌన్సెలింగ్‌ విషయంలో సమయం కావాలని సుప్రీంకోర్టును కూడా కోరామన్నారు. రాష్ట్రంలోని అన్ని సాంకేతిక కాలేజీల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేసేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. కాలేజీల్లో విద్యా ఫీజులు ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. విద్యార్థులను గందరగోళం సృష్టించేందుకే ఆంధ్రా సర్కారు కుట్రలు చేస్తుందన్నారు. ఇదంతా చంద్రబాబు, ఏపీఎస్‌సీహెచ్‌ఈ ఛైర్మన్‌ కలిసి ఆడుతున్న నాటకమని మండిపడ్డారు. చంద్రబాబు ఒక్క తెలంగాణ విద్యార్థులనే కాదు, ఆంధ్రా విద్యార్థులను వారి తల్లిదండ్రులను కూడా మోసం చేస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు అజ్ఞానిలా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు.