కార్పొరేట్ కళాశాలల కోసమే బాబు పాట్లు
ఆంధ్ర కౌన్సెలింగ్‌తో మాకు సంబంధం లేదు
చాలాసార్లు ఆగస్టు మాసాంతంలోనే ఎంసెట్
మంత్రులు హరీశ్, కేటీఆర్
హైదరాబాద్, జులై 31(జనంసాక్షి) : కార్పొరేట్ కళాశాలల బాగు కోసమే చంద్రబాబు పాట్లు పడుతున్నారని మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ విమర్శించారు. ప్రస్తుత ఎంసెట్ కౌన్సిలింగ్‌తో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. వ్యవహారం కోర్టులో ఉండగానే కొంపలు అంటుకుపోయాన్న రీతిలో సీమాంధ్ర మంత్రులు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. గతంలో ఎప్పుడైనా ఇంత త్వరగా కౌన్సెలింగ్ జరిగిందా అని ప్రశ్నించారు. ఫీజుల చెల్లింపులపై నానాయాగీ చేస్తున్న వారు తమ పిల్లలకు తామే చెల్లించుకుంటామని ఎందుకు చెప్పలేకపోతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలను ఏ విధంగా ఏడిపించాలా అని ఆంధప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చూస్తున్నారని తెలంగాణ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చంద్రబాబుది అనవసర రాద్ధాంతమని అన్నారు. తమ సొమ్మును పక్క రాష్టాల్ర విద్యార్థులకు ఎలా ఇస్తామని ఆయన ప్రశ్నించారు. ఏ కోర్టు కూడా వారి వాదనలను ఒప్పుకోదని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొన్ని బోగస్ కాలేజీలు ఉన్నాయని, వాటి నుంచి మా విద్యార్థులను కాపాడుకుంటామని హరీష్‌రావు తెలిపారు. తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీజురీయింబర్స్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. గతంలోనూ ఎంసెట్ ప్రవేశాలు ఆగస్టు చివర్లోనే జరిగేవని, కొంప మునిగినట్లు ఇప్పుడే గోల చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. స్థానికత నిర్దారించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని సుప్రీంకోర్టు కూడా చెప్పిందన్నారు. ప్రతి తెలంగాణ విద్యార్థి ప్రయోజనాన్ని ప్రభుత్వం కాపాడుతుందని, ఇతర రాష్టాల్ర విద్యార్థుల ఫీజులు కట్టాలని ఏ ప్రభుత్వమూ అనుకోదని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనేదే తమ ప్రయత్నమన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై బురదజల్లేందుకే ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా ఎంసెట్ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తుందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఏపీ కౌన్సెలింగ్‌తో తెలంగాణకు సంబంధంలేదని, తెలంగాణ విద్యార్థులెవరూ కౌన్సెలింగ్‌లో పాల్గొనొద్దని కేటీఆర్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులెవరూ అయోమయానికి గురికావొద్దని కోరారు. త్వరలోనే ఎంసెట్ కౌన్సెలింగ్‌కు కార్యాచరణను వెల్లడిస్తామన్నారు. వారికి ఫీజులతో పాటు అన్ని విషయాల్లోనూ అండగా ఉంటామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీలనన్నింటినీ కంప్యూటరీకరిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 500 గోదాములను నిర్మించి రైతులకు అందుబాటులోకి తెస్తామని హావిూ ఇచ్చారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ను తరిమికొట్టేందుకు గ్రావిూణ నీటి సరఫరా శాఖలో ట్రాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.