-->

ఉన్నత విద్యామండలికి ఆ హక్కు లేదు

COVER03
సర్కార్‌తో సంబంధం లేకుండా కౌన్సెలింగ్‌ ఎలా నిర్వహిస్తారు ?

ఆదివాసీ దినోత్సవాన్ని పోలవరం వ్యతిరేక దినంగా పాటిద్దాం

టిజెఎసి ఛైర్మన్‌ కోదండరాం

హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : ఉన్నత విద్యామండలి తన పరిధి దాటి వ్యవహరిస్తోందని, కౌన్సెలింగ్‌ నిర్వహించే హక్కు దానికి లేదని టిజెఎసి ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. సర్కార్‌తో సంబంధం లేకుండా కౌన్సెలింగ్‌ ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఉన్నత విద్యామండలికి ప్రభుత్వానికి సూచనలు ఇచ్చే అధికారం మాత్రమే ఉందని ఆయన స్పష్టంచేశారు. ఈ నెల 9న ఆదివాసీల దినోత్సవాన్ని పోలవరం వ్యతిరేక దినంగా పాటించాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. శనివారం జేఏసీ స్టీరింగ్‌ కమిటీ హైదరాబాద్‌లో జరిగింది. హైకోర్టు విభజన, పోలవరం, ఎంసెట్‌ వివాదం తదితర అంశాలపై జేఏసీ చర్చించింది. అనంతరం కోదండరాం విూడియాతో మాట్లాడారు. ఉన్నత విద్యామండలి తన పరిధి దాటి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వాలను ధిక్కరించేలా వ్యవహరించడం సరికాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొంత సమయం కావాలని కోరుతున్నా.. ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ముందుకెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉన్నత విద్యామండలికి కేవలం సూచనలు చేసే అధికారం మాత్రమే ఉందన్నారు. ప్రస్తుతం అది వ్యవహరిస్తున్న తీరు రాజ్యంగ విరుద్ధం, ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకమని విమర్శించారు. సుప్రీంకోర్టులో కేసు ఉండగా కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. కౌన్సెలింగ్‌లో గందరగోళానికి మండలిదే బాధ్యత అని అన్నారు. కోర్టు ఆదేశాలు వచ్చే వరకూ కౌన్సెలింగ్‌పై ముందుకెళ్లొద్దని సూచించారు.

రాష్ట్ర హైకోర్టును వెంటనే విభజించాలని కోదండరాం డిమాండ్‌ చేశారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తక్షణమే రెండు రాష్టాల్రకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. న్యాయవాదుల ఆందోళనకు జేఏసీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ నెల 9న ఆదివాసీల దినోత్సవాన్ని పోలవరం వ్యతిరేకంగా దినంగా చేపడతామన్నారు. పక్క రాష్టాల్ర అభ్యంతరాలను పట్టించుకోకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మించడం సరికాదన్నారు. ఉద్యోగుల విభజనపై కమలనాథన్‌ కమిటీ మార్గదర్శకాలపై కోదండరాం అసంతృప్తి వ్యక్తంచేశారు. కమిటీ విధివిధానాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ఉద్యోగుల విభజనపై సోమవారం కమలనాథన్‌ కమిటీని కలవనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ విభజనకు కార్మికులు చేస్తున్న ఆందోళనలకు జేఏసీ మద్దతు ఉంటుందని చెప్పారు. తెలంగాణలో వస్తున్న లాభాలను ఆంధ్రలో నష్టాలను పూడ్చుకుంటున్నారని విమర్శించారు. ఆచార్య జయశంకర్‌ జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.