గోల్కొండలో పంద్రాగస్టు

COVER04
మన సంస్కృతిని పదిలపర్చాలి

తెలంగాణ గత వైభవాన్ని చాటాలి

సిఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : చారిత్రక కట్టడం గోల్కొండ కోట వద్ద పంద్రాగస్టు వేడుకలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను చరిత్రలో నిలిచేపోయేలా నిర్వహించాలని, ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్‌, డీజీపీలను  సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. మన సంస్కృతి పదిలపర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైభవాలను ప్రదర్శించే విధంగా ఏర్పాట్లు ఉండాలని అధికారులకు కేసీఆర్‌ సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకలను సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో ఇప్పటివరకు నిర్వహిస్తూ వస్తున్నారు. గోల్కోండ కోట వద్ద నిర్వహించనున్న పంద్రాగస్టు వేడుకల్లో ప్రదర్శించేందుకు తెలంగాణ శకటాలు సిద్ధం అవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా గోల్కొండ కోటలో ఆగస్టు 15 వేడుకలు నిర్వహించాలని కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.