మన నవాబుల ఘనకీర్తే గోల్కొండ
ఏర్పాట్లపై సూచనలు
కోటను సందర్శించిన కేసీఆర్
హైదరాబాద్, ఆగస్ట్ 4 (జనంసాక్షి) : మన నవాబుల ఘనకీర్తే గోల్కొండ కోట అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం గోల్కొండ కోటకు వెళ్లి పంద్రాగస్టు వేడుకలకు స్థల పరిశీలన జరిపారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగనున్న తొలి స్వాతంత్ర వేడుకలకు గోల్కొండ కోట వేదికకానుంది. జెండాను ఎగురవేసే స్థలం, శకటాల ప్రదర్శన, పార్కింగ్, భద్రతా అంశాలు తదితరాలపై అధికారులతో మాట్లాడారు. అంతకుముందు అధికారులు వెళ్లి పరిశీలించారు. సిఎస్ రాజీవ్ శర్మ,డిజిపి అనురాగ్ శర్మ, కమిషనర్ మహేందర్ రెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషన్ర సోమేశ్ కుమార్‌లు ముందుగా సందర్శించారు. తదుపరి సిఎం కెసిఆర్ స్వయంగా పరిశీలించారు. గోల్కొండలోనే పంద్రాగస్ట్ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే పలు సూచనలు చేశారు. స్వాతంత్య దినోత్సవం అనగానే చాలామందికి గుర్తొచ్చేది.. ఢిల్లీలోని ఎర్రకోట పై భారత ప్రధాని జాతీయ జెండా ఎగురవేసి, ప్రసంగించడం. ఆ వేడుకను గుర్తు తెచ్చేలా.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కూడా అదే బాటలో నడవనున్నారు. పంద్రాగస్టు వేడుకలను ఇంతకు ముందు జరిగిన ఉత్సవాలకు భిన్నంగా గోల్కొండ కోట వద్ద నిర్వహించాలని.. ఆ కోటపై మువ్వన్నెల జెండా ఎగురవేయాలని ఆయన నిర్ణయించారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్ శర్మలను కేసీఆర్‌ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే.. సీఎస్, డీజీపీ సోమవారం గోల్కొండ కోటను సందర్శించి భద్రతాపరమైన ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా అనే అంశంపై అధ్యయనం చేసారు. తరవాత వారు విషయాలను సిఎంకు వివరించారు. అనంతరం సిఎం కూడా వచ్చి సందర్శించారు. ఇన్నాళ్లుగా.. ఏటా ఆగస్టు 15న స్వాతంత్య దిన వేడుకలను సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. కానీ.. ఈసారి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న తొలి స్వాతంత్ర దినోత్సవం కావడంతో.. వేడుకలకు మరింత వన్నె తెచ్చేందుకు, చరిత్రలో నిలిచిపోయేలా వాటిని ఘనంగా నిర్వహించేందుకు టీ-సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. తెలంగాణ సంస్కృతిని, ఆచారాలను ప్రతిబింబించేలా పలు శకటాలను కూడా ఈ వేడుకల్లో ప్రదర్శించనున్నారు. మొత్తవ్మిూద.. ఇప్పటికే బోనాల జాతరకు వేదికయిన గోల్కొండ కోట.. పంద్రాగస్టు వేడుకలతో సరికొత్త శోభ సంతరించుకోనున్నది.