తెలంగాణలో తాగునీటి వాటర్‌గ్రిడ్
160టీఎంసీల నీటి సేకరణ
25వేల కోట్ల నుంచి 30వేల కోట్లతో బృహత్‌పథకం
కరీంనగర్‌కు వరాల జల్లు
కరెంటు పాపం సీమాంధ్ర సర్కారుదే
మూడేళ్లు విద్యుత్ కష్టాలు తప్పవు
19న ఇండ్లకాడే ఉండుండ్రి
జర్నలిస్టులకు యూనిక్ కార్డులు
పర్యాటక కేంద్రంగా కరీంనగర్
ముఖ్యమంత్రి కేసీఆర్
కరీంనగర్ పర్యటన సక్సెస్
హైదరాబాద్/కరీంనగర్, ఆగస్టు 5 (జనంసాక్షి) : వచ్చే నాలుగేళ్లలో తెలంగాణలో మంచినీటి సమస్యే లేకుండా చేస్తామని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. మంచినీటి సమస్యను తీర్చేందుకు ఒక డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా పర్యటనలో ఆయన జిల్లాపై వరాలజల్లు కురిపించారు. కరెంటు పాపం సీమాంధ్ర సర్కారుదేనని, మూడేళ్ళలో తెలంగాణలో విద్యుత్ కష్టాలు తీరుస్తానని చెప్పారు. ఈ నెల 19న నిర్వహించే సమగ్ర సర్వేకు ప్రజలందరూ సహకరించాలని ఆ రోజు అందరూ ఇంటివద్దే ఉండాలన్నారు. జర్నలిస్టులందరికీ యూనిక్‌కార్డులు అందజేస్తామన్నారు. కరీంనగర్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధిచేసేందుక అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారంతోపాటు అన్ని మంచినీటి పథకాలను ఒకే గొడుగు కిందకు తేవడమే డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఉద్దేశమని తెలిపారు. పర్యటనలో భాగంగా ఆయన జిల్లా అధికారులతో సవిూక్ష నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు కోసం 160 టీఎంసీల నీరు అవసరమని అందుకు కృష్ణా నుంచి 80 టీఎంసీల నీళ్లు, గోదావరి నుంచి 80 టీఎంసీల నీటిని రప్పిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.25 వేల నుంచి రూ.30వేల కోట్ల వరకు అవసరమవుతుందని పేర్కొన్నారు. లక్ష కిలో విూటర్ల నిడివితో వాటర్ పైప్‌లైన్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. తెలంగాణలో తాగునీటి సమస్యే లేకుండా చర్యలు చేపడతామన్నారు. అయితే ఈ ప్రాజెక్టు నల్లగొండ నుంచి మొదలవుతుందని వెల్లడించారు.
సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కరీంనగర్ జిల్లాకు వరాల జల్లు కురిపించారు. జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీఇచ్చారు. ‘జిల్లాకు టూరిజం ప్రాజెక్టు కేటాయిస్తున్నామని, లోయర్ మానేరు డ్యాం దిగువన 300 ఎకరాలలో బృందావన్ గార్డెన్‌లా మంచి గార్డెన్‌ను ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఎల్‌ఎండీలో బోటింగ్ ఏర్పాటు చేస్తామని, జిల్లాలోని దేవాలయాలను అభివృద్ధికి కృషిచేస్తామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా కడెం మండలంలో గోదావరి నదిపై బ్రిడ్జిని నిర్మిస్తామన్నారు. కాకతీయ కెనాల్ పరిధిని పెంచుతామన్నారు. కరీంనగర్ పట్టణంలో ఎల్‌ఇడీ స్ట్రీట్ లైట్లను ఏర్పాటుచేస్తాం. కరీంనగర్ కలెక్టరేట్‌లో మల్టీస్టోరీడ్ ఆఫీస్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తామని హామీనిచ్చారు.
వచ్చే నాలుగేళ్లపాటు రాష్ట్రంలో విద్యుత్ కోతలు తప్పవని సీఎం చెప్పారు. విద్యుత్ కోతలు తప్పవనే విషయాన్ని తమ పార్టీ మేనిఫెస్టోలోనే పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సమస్యపై ఎవరూ ఏవిూచేయలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. మనమిప్పుడు విద్యుత్ విషయంలో హెల్ప్‌లెస్ కండిషన్‌లో ఉన్నామన్నారు. ఎవరిని తిట్టేట్టు లేదని తెలిపారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సమస్య వచ్చే సంవత్సరం కొంత మెరుగవుతుందని, ఆ తర్వాత కాలంలో పూర్తి సమస్యను అధిగమిస్తామని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న తదుపరే 24 గంటలపాటు విద్యుత్ సరఫరా అందిస్తామని గంటాపథంగా చెప్పారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో కావాల్సినంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందని కానీ దాన్ని ఇక్కడకు తీసుకొచ్చేందుకు విద్యుత్ లైన్లు లేవని పేర్కొన్నారు. లైన్లు వేయాలన్నా కనీసం ఒక సంవత్సరం పడుతుందని వివరించారు. అందుకే సంవత్సరం తర్వాత విద్యుత్ పరిస్థితి కొంత మెరుగవుతుందని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్రంలోని కుటుంబాలను ప్రభుత్వం సర్వే చేయిస్తుందని సీఎం అన్నారు. 19వ తేదీన ప్రతిష్టాత్మకంగా సర్వే నిర్వహిస్తున్నామని ఇందుకు ప్రజలంతా ప్రభుత్వంతో సహకరించాలని కోరారు. సర్వే నిర్వహించే 19వ తారీఖున ప్రజలంతా ఇళ్ల వద్దే ఉండాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సంక్షేమ పథకాలకు దూరమవుతారని హెచ్చరించారు. ఆరోజు పెళ్లిల్లు ఉన్నా వాయిదా వేసుకోవాలని అన్నారు. అసలు ఆ రోజు బస్సులు, ఆటోలు, ప్రైవేట్ రవాణా వ్యవస్థ ఏదీ ఉండదని తెలిపారు. సర్వేపై ప్రజల్లో అవగాహన కల్పించేందుక జర్నలిస్టు మిత్రులు సహకరించాలని, ప్రచారం చేయాలని కోరారు. రుణమాఫీ విషయంలో రైతులెవరూ ఆందోళన చెందొద్దని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కోరారు. రైతులకు ప్రభుత్వం ఇవ్వాలనుకున్న రుణమాఫీ విషయంలో కేబినెట్ నిర్ణయం జరిగిపోయిందని స్పష్టం చేశారు. త్వరలో పథకం అమలవుతుందని వెల్లడించారు. రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
కరీంనగర్ పట్టణాన్ని తమ ప్రభుత్వం అద్దపు తునకలా తయారు చేస్తుందని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. జిల్లాకు మంచి భవిష్యత్ ఉందని అన్నారు. లండన్ న్యూయార్కు మోడల్‌లో పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. జిల్లాకు నేనే ఇన్‌ఛార్జీగా ఉంటున్నానని కరీంనగర్‌ను ఎలా చేస్తానో విూరే చూస్తారని అన్నారు. కరీంనగర్‌కు టూరిజం ప్యాకేజీ ఇస్తున్నామని వెల్లడించారు. పట్టణంలోని లోయర్ మానేర్ డ్యాంను గొప్ప పర్యాటక కేంద్రంగా చేస్తామన్నారు. డ్యాంలో విహార యాత్రకు క్రూజింగ్ బోట్లు ఏర్పాటు చేస్తామని, వాటిలో చిన్నచిన్న ఫంక్షన్లు కూడా నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. డ్యాం కింద 300 ఎకరాలతో బృందావన్ గార్డెన్‌ను నిర్మిస్తామని అన్నారు. తెలంగాణ కొంగు బంగరాం సింగరేణి అని సీఎం కొనియాడారు. ఇవాళ జిల్లా అధికారులతో సవిూక్షా సమావేశం తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. లక్ష మందికి ఉద్యోగాలిచ్చి బతుకుదెరువునిచ్చిన తల్లి సింగరేణి అని ఉద్వేగంగా మాట్లాడారు. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో సింగరేణి బొగ్గు గనులు కొనబోతోందని వివరించారు. విదేశాల్లో కూడా ఉద్యోగాలిచ్చే స్థాయికి సింగరేణి ఎదుగుతుందని పేర్కొన్నారు. సమైక్య పాలనలో పాలకులు సింగరేణిని సక్రమంగా వినియోగించుకోలేదని విమర్శించారు. వారి పాలనలో సింగరేణి సంస్థలో ఎప్పుడూ ఉద్యోగుల డిస్మిస్, రిట్రెంచ్‌మెంట్‌లే ఉండేవన్నారు. తీసుకోమని కార్మికులు, వద్దని మేనేజ్‌మెంట్ ఇదే తతంగం నడిచిందన్నారు. అందుకే ఇప్పుడు మనం సింగరేణిని సద్వినియోగం చేసుకుందామని పిలుపునిచ్చారు. సింగరేణి రూపు రేఖలు త్వరలో మారబోతున్నాయి. త్వరలో ఎన్టీపీసీలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపడతాం. రోళ్ల వాగు ప్రాజెక్టు కోసం సర్వే చేస్తున్నాం. కరీంనగర్ జనరల్ ఆస్పత్రిని నిమ్స్ తరహాలో రూపొందిస్తాం. సింగరేణి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తాం. మిడ్ మానేరు, ఎల్లంపల్లి బాధితులకు వెంటనే ప్యాకేజీలు విడుదల చేస్తాం. కరీంనగర్ అర్బన్ మండలం ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. కరీంనగర్ పట్టణానికి వెంటనే అదనపు ట్రాఫిక్ సీఐని కేటాయిస్తున్నాం. రామగుండం పట్టణాన్ని పోలీసు కమిషనరేట్ పరిధి చేయాలని, ఒక మహిళా పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. పెద్దపల్లి, మంథనిలో వంద పడకల ఆస్పత్రులు, హుస్నాబాద్‌కు 50 పడకల ఆస్పత్రి నిర్మింపజేస్తాం. కరీంనగర్ చుట్టూ రింగ్‌రోడ్డుకు మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నాం’అని తెలిపారు
రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ యూనిక్ కార్డులు ఇస్తామని సీఎం స్పష్టంచేశారు. ఇవాళ జిల్లా అధికారులతో ఆయన సవిూక్ష జరిపిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. జర్నలిస్టులకు వైట్ రేషన్ కార్డులు మంజూరు చేస్తారా? అని ఒక విలేకరి ప్రశ్నించగా కేసీఆర్ మండిపడ్డారు. జర్నలిస్టులకు వైట్ కార్డు ఎందుకిస్తారని తిరిగి ప్రశ్నించారు. జర్నలిస్టులైనా, ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా వైట్ కార్డు కలిగి ఉంటే పీకిపడేస్తామన్నారు. అర్హులకు మాత్రమే వైట్ కార్డులుంటాయని పేర్కొన్నారు. అయితే జర్నలిస్టుకు మాత్రం ఒక యూనిక్ కార్డు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఈమేరకు తాను ప్రెస్ అకాడవిూ ఛైర్మన్ అల్లం నారాయణతో మాట్లాడానని తెలిపారు. జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు కూడా ఇప్పిస్తామన్నారు. జిల్లాస్థాయిలో ప్రతీ జిల్లాలో ప్రెస్‌భవన్‌లను నిర్మించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్‌లను అంతర్జాతీయ స్థాయి నగరాలుగా మారుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ ప్రాంతాల అభివృద్దిపై త్వరలోనే సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. తెలంగాణలో ఉన్న ప్రధాన పట్టణాలను అన్నిరంగాల్లో అభివృద్ది చేస్తామన్నారు. కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎల్‌ఎండీలోని మానేరు గార్డెన్‌ను బృందావన్ గార్డెన్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రస్థాయిలో వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేస్తామన్నారు. నాలుగేళ్లలో గ్రావిూణ ప్రాంతాలకు తాగునీటి సరఫరా కార్యక్రమం మెరుగుపరుస్తామని కేసీఆర్ హావిూ ఇచ్చారు. కలెక్టరేట్‌లో ఆయన అధికారులతో సవిూక్షించారు. ఇందులో మంత్రులు ఈటెల తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ రమేష్ బదిలీ అయ్యారు. రమేష్ స్థానంలో బాలాజీరావు కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాలాజీరావు ప్రస్తుతం జగిత్యాల సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.
కరీంనగర్ పర్యటకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇక్కడ పట్టణంలో ఘనంగా స్వాగతం దక్కింది. తెలంగాణ ఏర్పడ్డ తరవాత తొలిసారిగా కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆయన పట్టణంలో ప్రత్యేక బస్సులో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. దారిపొడవునా ఆయనకు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. కోలాటాలు, డప్పులతో దారిపొడవునా ఘనంగా స్వగతం పలికారు. మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ తదితరులు సిఎం కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. కలెక్టరేట్‌లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో జిల్లా అభివృద్ధిపై సవిూక్షా సమావేశం నిర్వహించారు. సవిూక్షా సమావేశం ముగిసిన అనంతరం సీఎం విూడియాతో మాట్లాడనున్నారు. ఉదయం జిల్లాకు చేరుకున్న సీఎం గాంధీ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి కార్పొరేషన్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పర్యటన మధ్యలో ఒకచోట బస్సు దిగి ఆయన, అక్కడ ఉన్న స్వాతంత్య సమరయోధుడిని పరామర్శించారు.