దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడండి

COVER07
కాదంటే పోరాటానికి సిద్ధం

పోరాటాలు తెలంగాణకు కొత్తకాదు

విత్తనోత్పత్తికి తెలంగాణే చిరునామా కావాలి

మా పిల్లల ఫీజులే మేము కడుతాం

అలుపెరుగని యోధుడు, రాజీపడని ఉద్యమ పితామహుడు

వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ‘సార్‌’ పేరు

జయశంకర్‌ సార్‌ పేరు మా వర్సిటీకి పెట్టుకుంటే మీకేం అభ్యంతరం

మీ బతుకు మీది.. మా బతుకు మాది

ప్రొఫెసర్‌ జయశంకర్‌ యూనివర్సిటీలో కేసీఆర్‌ ఘన నివాళి

హైదరాబాద్‌, ఆగస్టు 6 ( జనంసాక్షి) : దమ్ముంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తమతో  అభివృద్ధిలో పోటీపడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు సవాలు విసిరారు. ఎవరి బతుకు వారు బతుకుదామని, అలా కాదు కొట్లాటకు సిద్ధమంటే తాము కూడా రెడీ అని అన్నారు. బుధవారం జయశంకర్‌ జయంత్యుత్సవాల్లో భాగంగా ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే, జయశంకర్‌ పోస్టల్‌ కవర్‌ను ఆవిష్కరించారు. ‘మన ఊరు-మన కూరగాయలు’ పథకాన్ని ప్రారంభించారు. విత్తనోత్పత్తికి తెలంగాణే చిరునామా కావాలన్నారు. తెలంగాణ విద్యార్థులు తాము చెల్లించుకుంటామని ఆంధ్రా విద్యార్థుల ఫీజులు ఎపి ప్రభుత్వమే చెల్లించుకోవాలన్నారు. అలుపెరుగని యోధుడు, రాజీపడని ఉద్యమ పితామహుడు జయశంకర్‌ అని కొనియాడారు. జయశంకర్‌ సార్‌ పేరు మా వర్సిటీకి పెట్టుకుంటే మీకేం అభ్యంతరం అని ఎపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ యూనివర్సిటీలో ‘సార్‌’కు కేసీఆర్‌ ఘన నివాళ్లు అర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. పిచ్చి పిచ్చి ప్రేలాపనలు వద్దని ఏపీ మంత్రులకు, ప్రతిపక్ష నాయకులకు హితవు పలికారు. విద్యుత్‌ సమస్యపై ఇప్పటికిప్పుడు చేయడానికి ఏవిూలేదని స్పష్టంచేశారు. మూడేళ్ల నాటికి విద్యుత్‌ సమస్య ఉండదని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 60 రోజులే గడించిందని, కేవలం 40 మంది అధికారులతో పాలన కొనసాగిస్తున్నామన్న కేసీఆర్‌ విపక్షాలు విమర్శలు చేయడం అర్ధరహితమన్నారు. విద్యుత్‌ సమస్యకు కారణం కాంగ్రెస్‌, టీడీపీలేనని, ఈ విషయంపై మాట్లాడేందుకు వారికి సిగ్గుండాలన్నారు.

పోరాట యోధుడు జయశంకర్‌

ఆచార్య జయశంకర్‌ సార్‌ మడమ తిప్పని గొప్ప పోరాట యోధుడు అని కేసీఆర్‌ అభివర్ణించారు. చాలా మంది పోరాటాలు ప్రారంభిస్తారని, కానీ మధ్యలోనే వదిలెస్తారన్నారు. కానీ మొదటి నుంచి చివరివరకూ పోరాటాన్ని కొనసాగించిన మహనీయుడు జయశంకర్‌ సార్‌ అని కొనియాడారు. ఇంటర్‌ విద్యార్థిగా ఉద్యమాన్ని ప్రారంభించిన ఆయన 70 ఏళ్లు పైబడినా ఉద్యమాన్ని వీడలేదని గుర్తుచేశారు. తెలంగాణను ఆంధ్రలో విలీనం చేయొద్దని కొట్లడిన వారిలో, తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని చెప్పిన వారిలో ఆయన ఉన్నారని తెలిపారు. ఐదు దశాబ్దాలకుపైగా ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. 1969 ఉద్యమం తర్వాత కొంత మంది నాయకులు పదవులు తీసుకొని వేర్వేరు పార్టీల్లో చేరారని, కానీ జయశంకర్‌సార్‌ మాత్రం ఉద్యమాన్ని వీడలేదన్నారు. పదవులు తీసుకోకుండా, ఏ పార్టీలో చేరకుండా పోరాటం చేశారని తెలిపారు. ఉద్యమాన్ని బతికించాలనే ఉద్దేశంతోనే తాను పోరాటం చేస్తున్నానని చెప్పారన్నారు. ఆయన చెప్పడం వల్లే తాను తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించానని పేర్కొన్నారు. అధికారికంగా తెలంగాణ వచ్చిన రోజున ఆయన లేకపోవడం బాధాకరమన్నారు.ఆయన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొనే తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరుపెట్టామన్నారు.

ఆంధ్ర నేతలకు కుళ్లు

తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి జయశంకర్‌ సార్‌ పేరు పెట్టడంపై ఆంధ్ర నేతలకు కుళ్లుగా ఉందని విమర్శించారు. తెలంగాణకు జయశంకర్‌ సార్‌ను మించిన గొప్పోడు ఇంకొడు ఉన్నాడా? అని ప్రశ్నించారు. మా నాయకుడి పేరు మేం పెట్టుకుంటే వాళ్లకెందుకు కడుపు మంట అని మండిపడ్డారు. ఇది ప్రారంభం మాత్రమే.. హైదరాబాద్‌లో చాలా మార్చేటివి ఉన్నాయని స్పష్టంచేశారు. మాకు అక్కర్లేని, మాకు తెలియని పేర్లు, విగ్రహాలు చాలా ఉన్నాయని, వాటిని మారుస్తామని తెలిపారు. విూ బతకు విూరు బతకండి.. విూ బతుకు మేం బతుకుతామని ఆంధ్ర ముఖ్యమంత్రికి, మంత్రులకు, మేధావులకు సూచించారు. అలా కాదు.. కొట్లాటకు సిద్ధమంటే తాము రెడీ అని సవాలు విసిరారు. తెలంగాణ బతుకే పోరాటం.. యాందాక అంటే గాందాక అని వ్యాఖ్యానించారు. కానీ టైం వేస్టు.. మధ్యలో ప్రజలు నలిగిపోతారు.. చట్టం ప్రకారం ఎవరి పరిధిలో వారు మెలిగితే మంచిదని స్పష్టంచేశారు.

ఎవరి ఫీజు వాళ్లే కట్టుకోవాలి

పదో షెడ్యూల్‌ ప్రకారం రంగా వర్సిటీని విభజించామని కేసీఆర్‌ తేల్చిచెప్పారు. ఇక్కడ విూ పిల్లలు (ఆంధ్ర) చదువతామంటే 15 శాతం సీట్లిస్తామని, ఇక్కడే ఉండొచ్చని చెప్పారు. అయితే, ఎవరి పిల్లల ఫీజులను వారే కట్టుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సింగపూర్‌ కడతామంటున్న వారు.. పిల్లల ఫీజులు కట్టలేరా? అని ప్రశ్నించారు. రూ.1.50 లక్షల కోట్లతో రాజధాని కడతామని చెబుతారు.. పిల్లల బడి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారా? అని ఎద్దేవా చేశారు. ‘ఆంధ్ర నాయకులారా.. విూ పిచ్చి పనులు బంద్‌ చేసుకోండి.. విూ రాష్టాన్న్రి విూరు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోండి.. దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడండి.. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి విూ రైతాంగాన్ని అభివృద్ధి చేయండి.. మందిది వద్దు మాది మాకు చాలు.. విూకేమో మందిది కావాలనే దురాశ ఉందని’ వ్యాఖ్యానించారు.

గ్రీన్‌హౌస్‌ కల్టివేషన్‌కు ప్రాధాన్యం

గ్రీన్‌హౌస్‌ సాగుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని కేసీఆర్‌ చెప్పారు. వెయ్యి ఎకరాల్లో గ్రీన్‌హౌస్‌ ఫార్మింగ్‌ను పైలట్‌ ప్రాజెక్టుకు చేపడతామని తెలిపారు. అలాగే గ్రీన్‌హౌస్‌ కల్టివేషన్‌కు ఇస్తున్న సబ్సిడీని పెంచుతామని వెల్లడించారు. గ్రీన్‌హౌస్‌కు ఇస్తున్న కరెంట్‌ను వ్యవసాయయానికి ఇచ్చే కరెంట్‌లాగే చూస్తామని.. అందుకయ్యే కరెంట్‌ చార్జీలను మాఫీ చేస్తామని ప్రకటించారు.

కూరల సాగుకు ప్రోత్సాహం

తెలంగాణలో కూరగాయల సాగు అత్యంత తక్కువగా ఉందని కేసీఆర్‌ చెప్పారు. జాతీయ సగటు ప్రకారం తెలంగాణకు 110 లక్షల మెట్రిక్‌ టన్నుల కూరగాయలు అవసరం ఉందన్నారు. కానీ ఉత్పత్తి అవుతున్నది మూడు నుంచి నాలుగు లక్షల టన్నులలోపేని తెలిపారు. బోయిన్‌పల్లి మార్కెట్‌కు వచ్చేది 50-60 లక్షల టన్నులు కాగా.. తెలంగాణలో పండిస్తున్నది మూడు నాలుగు లక్షల టన్నులు మాత్రమేనని వివరించారు. ఇక నుంచి ఈ పరిస్థితి మారాలని, కూరగాయల సాగును ప్రోత్సహిస్తామన్నారు. కూరగాయలు, ఇతర పంటలు అశాస్త్రీయంగా పండిస్తున్నామని చెప్పారు. ఇక నుంచి ఆ పద్ధతి మారాలని అభిప్రాయపడ్డారు. త్వరలోనే జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీకి వీసీని నియమిస్తామని తెలిపారు. వర్సిటీలో పరిశోధనలు మృగ్యమై పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనుంచైనా నవీన పద్ధతులలో పరిశోధనలు చేపట్టాలని, వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాలని అభిప్రాయపడ్డారు. పంటల దిగుబడి పెరిగేలా చూడాలని శాస్త్రవేత్తలను కోరారు.

విత్తన భాండగారంగా తెలంగాణ

విత్తన కంపెనీలు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో పంటలు పండించే విధానంలో సమూల మార్పులు చేసుకోవాలన్నారు. వ్యవసాయం దండగ కాదు.. పండగ అన్న రీతిలో చేసుకుందామన్నారు. వర్సిటీ కూడా విత్తనాలు ఉత్పత్తి చేయాలని స్పష్టం చేశారు. కులమతాలకు అతీతంగా రైతులందరికీ 90 శాతం సబ్సిడీతో డ్రిప్‌ ఇరిగేషన్‌ అందేలా చూస్తామన్నారు. తెలంగాణలో ఉండే ప్రతి ఎకరా భూసారాన్ని, భూగర్భ జలాలను పరీక్షిస్తామని.. వాటిని కంప్యూటరైజ్‌ చేస్తామని తెలిపారు. ఏ జిల్లాలు ఏయే పంటలకు అనుకూలమో గుర్తించి, క్రాప్‌ కాలనీస్‌గా గుర్తిస్తామని చెప్పారు. ఏయే భూముల్లో ఏవి అనుకూలమో నిర్ణయించి రైతులను ఆ దిశగా ప్రోత్సహిస్తామన్నారు. తెలంగాణ భూమి విత్తనాలు ఉత్పత్తికి అనుకూలంగా ఉన్నాయన్న కేసీఆర్‌.. విత్తన కంపెనీలతో కలిసి విత్తన ఉత్పత్తిని చేపడతామన్నారు. తెలంగాణ రైతు దేశానికే కాదు.. ప్రపంచ దేశాలకు విత్తనాలు సరఫరా చేసే స్థాయికి ఎదగాలని, ప్రతి రైతు కూడా కోటీశ్వరుడు కావాలని ఆకాంక్షించారు.

మూడేళ్ల పాటు విద్యుత్‌ సమస్య

విద్యుత్‌ సమస్యపై ఇప్పటికిప్పుడు చేయడానికి ఏవిూ లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో విద్యుత్‌ విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. కరెంట్‌ విషయంలో చేసేదేవిూ లేదని ఎన్నికల సమయంలోనే తాను చెప్పానని గుర్తు చేశారు. అయినా సమస్యను అధిగమించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని, చత్తీస్‌గఢ్‌ నుంచి కరెంట్‌ కొనుగోలు చేసుకుందుకు యత్నిస్తున్నామని వివరించారు. ఆంధ్ర ప్రభుత్వం నుంచి రకరకాల ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. అయినా నాణ్యమైన కరెంట్‌ ఇచ్చేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం కంటే వచ్చే ఏడాది పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుందని, రెండేళ్ల నాటికి మరింత మెరుగుపడుతుందని, మూడేళ్లు అయ్యేసరికి మిగులు విద్యుత్‌ సాధిస్తామన్నారు.

ప్రతిపక్షాలపై విసుర్లు

విద్యుత్‌ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని కేసీఆర్‌ మండిపడ్డారు. ‘రైతులు..మీరు ఆవేశపడి రోడ్ల విూదకు వచ్చి అనవసరంగా ఇబ్బందులు పడవద్దు. రాజకీయ పార్టీలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తుంటాయి. వాటి ఉచ్చులో చిక్కుకోవద్దని’ కోరారు. విద్యుత్‌పై మాట్లాడుతున్న పొన్నాలకు సిగ్గుండాలా.. అని విమర్శించారు. పదేండ్లు విూ పార్టీయే కదా అధికారంలో ఉన్నదిజ కరెంట్‌ లేకపోవడానికి ఎవరు బాధ్యులు.. విూరు కాదా? విూరు చేసిన వంకర్లు సరిచేయడానికే చాలా సమయం పడుతుందన్నారు. అయినా సిగ్గులేకుండా సోయిలేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తప్పులు చేసే ప్రభుత్వాలకు భయమని, తమకు ఆ భయం లేదన్నారు. వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతున్నామని చెప్పారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని కేసీఆర్‌ మండిపడ్డారు. 60 రోజులైనా ఏం చేయలేదని తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కిషన్‌రెడ్డి.. విూ ప్రధానమంత్రియే ఇంకా ఏం చేయడంలేదని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. తెలంగాణకు అధికారులను కేటాయించాలని ప్రధానికి 20 ఉత్తరాలు రాశానని, ఇప్పటికీ సమాధానం రాలేదన్నారు. కేవలం 40 మంది అధికారులతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని చెప్పారు. దమ్ముంటే ముందు ఢిల్లీకి వెళ్లి అధికారులను కేటాయించేలా చూడాలని కిషన్‌రెడ్డికి సవాలు విసిరారు. అధికారులు వస్తే పాలనను విస్తృతం చేయాలని సూచించారు. 60 రోజులు కాదు.. మరో 30 రోజులు అయినా తాము చేసేదేవిూ లేదని స్పష్టం చేశారు. ‘విూరు ఆగం చేస్తే మేము ఆగమాగం కాము.. తెలంగాణకు ఏం కావాలో మాకు తెలుసు. పక్కా విధానాలతో ప్రజల ముందుకు పోతాం.. పిచ్చి ప్రయత్నాలు, ప్రేలాపనలు మానుకోవాలి’ అని హెచ్చరించారు.