నిజాం చక్కెర పరిశ్రమ పునరుద్ధరణ

cover 08

ఆగస్టు 15 నుంచి దళితులకు భూపంపిణీ

ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తా

రైతుల రుణాలు మాఫీ అయినట్టే

దీపావళిలోపు పెన్షన్లు

అంకాపూర్‌ రైతులకు డ్రిప్‌ ఇరిగేషన్‌కు పూర్తి సబ్సిడీ

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజామాబాద్‌ టూర్‌ సక్సెక్‌

నిజామాబాద్‌, ఆగస్టు7 (జనంసాక్షి) : నిజాం చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆగస్టు 15 నుంచి దళితులకు భూపంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. గురువారం నిజామాబాద్‌ జిల్లాలో ముఖ్యమంత్రి  పర్యటించారు. ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తానని పునరుద్ఘాటించారు. రైతుల రుణాలు మాఫీ అయినట్టేనని, దీపావళిలోపు పెన్షన్లు అందజేస్తామని అన్నారు. అంకాపూర్‌ రైతులకు డ్రిప్‌ ఇరిగేషన్‌కు పూర్తి సబ్సిడీ ఇస్తామని హామీనిచ్చారు. రుణమాఫీ పథకం కింద 39 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు.  హైదరాబాద్‌ నుంచి నేరుగా ఆర్మూర్‌కు చేరుకున్న సిఎం రూ.114కోట్లతో చేపట్టనున్న రక్షిత మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటుచేసిన  బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు.

నిజాం చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తామని, జిల్లాకు విమానాశ్రయం తీసుకువస్తామని హామీనిచ్చారు. నిజామాబాద్‌ ఆస్పత్రిని నిమ్స్‌ స్థాయికి పెంచుతామని హామీనిచ్చారు. ప్రతి నియోజకవర్గానికి 100 పడకట ఆస్పత్రిని మంజూరుచేస్తామన్నారు.

డాదిలోపు మంచినీటి పథకాన్ని పూర్తి చేస్తామన్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎర్రజొన్నల బకాయిలు మాఫీ చేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వాలు మాటలు చెప్పాయి డబ్బులు మాత్రం రాలేదన్నారు. టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం తరఫున ఆ డబ్బు చెల్లిస్తామని గత ఎన్నికల ప్రచారంలో చెప్పానని.. ఇప్పుడు ఆ హావిూని నిలబెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రూ.11.50 కోట్ల మంజూరు చేస్తున్నామని తెలిపారు. డబ్బు కోసం విూరు (రైతులు) కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, మంత్రులు, అధికారులే ఇంటికి వచ్చి ఇస్తారని తెలిపారు. గుత్ప ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని, అన్ని గ్రామాలకు తాగునీటిని అందజేస్తామన్నారు.

ఎన్నికల హామీలు నిలబెట్టుకున్నాం

ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రుణమాఫీతోపాటు ఆటోలు, ట్రాక్టర్ల రవాణా పన్ను రద్దు చేశామన్నారు. రైతు రుణాలు మాఫీ చేస్తామని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. రుణాల మాఫీకి, రీషెడ్యూల్‌కు రిజర్వ్‌బ్యాంకు వారు చిన్న చిన్న ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. అయినా రుణాలు మాఫీ చేస్తామన్నారు. దీనిపై క్యాబినెట్‌లో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. త్వరలోనే రుణాలన్నీ మాఫీ అయిపోతాయన్నారు. రూ.19 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని, తద్వారా 39లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. దీనిపై అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, మార్గదర్శకాలు ఖరారయ్యాక, త్వరలోనే రుణమాఫీ అమల్లోకి వస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆటోలు, ట్రాక్టర్‌, ట్రాలీలకు రవాణా పన్ను రద్దు చేశామని చెప్పారు.

దీపావళిలోపు పింఛన్ల పెంపు

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హావిూ మేరకు సామాజిక పింఛన్లను పెంచుతామన్నారు. వృద్ధులు, వికలాంగులకు, వితంతులు అన్ని రకాల పెన్షన్లను పెంచుతామని ఎన్నికల సమయంలో హావిూ ఇచ్చామన్నారు. ఈ హావిూని నిలబెట్టుకుంటామని దసరా నుంచి దీపావళి మధ్య కొత్త కార్డులు ఇచ్చి

పెంచిన పింఛన్లు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతి నెలా వృద్ధులు, వితంతులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 అందజేస్తామన్నారు. బీడి కార్మికులకు వెయ్యి భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించామని.. ఎంత మంది బీడి కార్మికులు ఉన్నారనే దానికి సంబంధించిన సర్వే జరుగుతోందన్నారు. సర్వే పూర్తి కాగానే భృతి అందజేస్తామన్నారు.

గత ప్రభుత్వాల వల్లే అవినీతి

బలహీనవర్గాల గృహ నిర్మాణ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తామని సీఎం తెలిపారు. బలహీనవర్గాల వారికి రెండు పడక గదులు, కిచెన్‌, హాల్‌ కూడిన ఇంటిని నిర్మించి ఇస్తామన్నారు. గత ప్రభుత్వాలు అవలంబించిన తప్పుడు విధానాల వల్ల గృహనిర్మాణ పథకంలో రూ.వేల కోట్ల దుర్వినియోగం జరిగిందని విమర్శించారు. పైరవీకారులు, దళారులు ఒక్కొక్కడే ఎనిమిది పది ఇళ్లు సొంతం చేసుకొని బిల్లులు లేపుకొన్నారని విమర్శించారు. అక్రమార్కులు ఎవరైనా వదిలి పెట్టేది లేదని, అందుకే ఈ అవినీతిపై సీఐడీ విచారణకు ఆదేశించామన్నారు. సీఐడీ విచారణ పూర్తయిన తర్వాత బలహీనవర్గాలకు గృహాలు కట్టించి ఇస్తామన్నారు. రూ.3 లక్షలు కాదు.. రూ.3.50 లక్షల ఖర్చుతో ఇళ్లు నిర్మించి ఇస్తామని పునరుద్ఘాటించారు. ఆర్మూర్‌లోనే మొట్టమొదటి మోడల్‌ కాలనీ నిర్మిస్తామని పేర్కొన్నారు.

ప్రతి గ్రామానికి తాగునీరు

గ్రావిూణ మంచినీటి సరఫరాను పునర్‌వ్యవస్థీకరిస్తామని తెలిపారు. ఏ పల్లెకు కూడా తాగునీటి సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. తెలంగాణ డ్రింకింగ్‌ వాటర్‌గ్రిడ్‌ ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి, తండాకు మంచినీటి సరఫరా చేస్తామని తెలిపారు. నాలుగేళ్లలోపు దీన్ని పూర్తిచేస్తామని, ఆ తర్వాత నల్లా కనెక్షన్‌ లేని ఇళ్లు ఉండదన్నారు. దళిత, గిరిజన పిల్లలు పెళ్లి సమయంలో ఇబ్బంది పడుతుంటారని, అందుకే తమ ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చిందన్నారు. దళిత, ఆదివాసీ బిడ్డల కోసం కల్యాణలక్ష్మి పతకం తీసుకొచ్చామన్నారు. ఈ పథకం కింద రూ.50 వేలు అందిస్తామని తెలిపారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని తెలిపారు. ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. మొత్తం భూమి లేని వారికి మూడెకరాలు ఇస్తామని, బోర్‌ వేయించడంతో పాటు మోటార్‌కు అయ్యే ఖర్చుతో పాటు కరెంట్‌ లైన్‌ ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అలాగే ఆ భూమి సాగుకు సంవత్సరానికయ్యే పెట్టుబడిని ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు.

సర్వేకు సహకరించాలి..

ఈ నెల 19న నిర్వహించ తలపెట్టిన సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. చాలా తప్పుడు లెక్కల వల్ల వేల కోట్ల దుర్వినియోగమవుతున్నాయని, విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది పైరవీకారులు, దుర్మార్గుల వల్లే ఇబ్బందులు వస్తున్నాయని… నిజమైన పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదని చెప్పారు. అక్రమాలను నివారించేందుకే 19న సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ రోజు బస్సులు, ఆటోలు, స్కూళ్లు అన్ని బంద్‌ ఉంటాయన్నారు. గ్రామగ్రామాన అధికారులు సర్వే నిర్వహిస్తారని చెప్పారు. ఆ రోజు పెళ్లిళ్లు పెట్టుకున్న వారు రద్దు చేసుకోవాలని, ప్రయాణాలు ఉంటే మానుకోవాలని కోరారు. ప్రజలంతా 19న తేదీన ఇంటి వద్దే ఉండి సర్వేను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమ సందర్భంలో కన్న కలలను అమలు చేస్తామన్నారు.

అంకాపూర్‌ రైతులకు డ్రిప్‌ ఇరిగేషన్‌కు పూర్తి సబ్సిడీ

అంకాపూర్‌ రైతులకు వందశాతం సబ్సిడీతో డ్రిప్‌ ఇరిగేషన్‌ సౌకర్యం కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ హావిూనిచ్చారు. జిల్లాలోని అంకాపూర్‌ గ్రామంలో ఆయన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం అంకాపూర్‌ గ్రామానికి వరాల జల్లు కురిపించారు. ఇక్కడి రైతుల వ్యవసాయ విధానం అద్భుతమన్నారు. అంకాపూర్‌లోని ప్రతి రైతు భూమిలో నిపుణులతో భూసార పరీక్షలు, నీటి పరీక్షలు చేయిస్తమని పేర్కొన్నారు. భూసార పరీక్షలను ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. నెటాజెట్‌ సిస్టమ్‌ ద్వారా పంట దిగుబడి పెంచుకోవాలని సూచించారు. అంకాపూర్‌.. ఇజ్రాయెల్‌ తరహాలో పంటలు పండించాలని , అవసరమైతే అధ్యయనం కోసం రైతులను ఇజ్రాయెల్‌ పంపిస్తామని అన్నారు. అంకాపూర్‌లో మొదటగా ఆరుగురు రైతులతో గ్రీన్‌హౌస్‌ కల్టివేషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. అంకాపూర్‌లో ఆరుగురు రైతులకు పైలట్‌ ప్రాజెక్టు కింద గ్రీన్‌హౌస్‌లను మంజూరు చేస్తున్నామన్నారు. అడవి పందులు బెడదను నివారించేందుకు రూ. 1.5 కోట్లతో సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తామని, రైతులకు రూ. 1.25 కోట్లతో పసుపు తీసే యంత్రాలను మంజూరు చేస్తామని తెలిపారు. అంకాపూర్‌కు ముఖ్యమంత్రి గెస్ట్‌హౌస్‌ మంజూరు చేశారు. అంకాపూర్‌ వ్యవసాయాన్ని నేర్పే ఊరుగా మారాలని కోరారు. అంకాపూర్‌లో అగ్రికల్చర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు.అడవి పందుల బెడద నుంచి తప్పించేందుకు సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటుచేస్తమని హావిూనిచ్చారు. దళిత పేదలకు పట్టాలను ఆగస్టు 15న అందజేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. అంకాపూర్‌లో ఇల్లు లేని కుటుంబం ఉండకూడదన్నారు. లక్ష్మీపూర్‌ తండా నుంచి అంకాపూర్‌ వరకు కోటి 70 లక్షలతో రోడ్డు నిర్మాణం చేపడతామని తెలిపారు. ఈ రోడ్డు మూడు నెలల్లో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. అంకాపూర్‌ మార్కెట్‌ యార్డు కోసం రూ. 75 లక్షలు మంజూరు చేశారు.

పిల్లలను రోడ్లపైకి తేవొద్దు..

ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు పాఠశాలల విద్యార్థులను పెద్దమొత్తంలో సవిూకరించారు. రోడ్డుకు ఇరువైపులా వారిని మోహరించారు. దీన్ని గమనించిన ముఖ్యమంత్రి అధికారులపై సున్నితంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు వస్తున్నారని పిల్లలను రోడ్లపై తీసుకురావడం సరికాదన్నారు. స్కూలు పిల్లలను రోడ్లపై తీసుకురావొద్దని, ఎండలో నిలబెట్టొద్దని స్పష్టం చేశారు. ఈ పద్ధతిని ఈ రోజు నుంచి నిషేధిస్తున్నామని తెలిపారు. ఇక నుంచి తాను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పర్యటన చేసినా పిల్లలను రోడ్లవిూదకు తీసుకురావొద్దని కోరారు.