తెలంగాణపై కేంద్రం మళ్లీ కుట్ర

COVER09

అధికారాల దురాక్రమణకు లేఖ

ఆ లేఖను తిప్పి పంపండి

ముమ్మాటికీ ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధం

ప్రజాస్వామ్యానికి అవమానం

అంతర్గత భద్రత రాష్ట్రానిదే

కేంద్రం ఎలా పెత్తనం చేస్తుంది?

ముఖ్యమంత్రుల్ని ఏకం చేస్తాం

ఢిల్లీపై యుద్ధం చేస్తాం

గవర్నర్‌ అధికారాలను ఆమోదించం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి) :

తెలంగాణపై కేంద్రం మరో కుట్రకు పూనుకుంది. అధికారాల దురాక్రమణకు కేంద్ర ¬ంశాఖ నుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శుక్రవారం లేఖ పంపింది. ఈ లేఖ ముమ్మాటికీ ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి అవమానమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. రాష్ట్ర అంతర్గత భద్రతపై రాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుందని కేంద్రం ఎలా పెత్తనం చేస్తుందని ఆయన ఘాటుగా విమర్శించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రుల్ని ఏకం చేస్తామని చెప్పారు. గవర్నర్‌ అధికారాలను ఆమోదించేదిలేదని, ఢిల్లీపై యుద్ధం చేస్తానని సిఎం ప్రకటించారు. లేఖలో ఉన్న అంశాలను పరిశీలిస్తే.. జిహెచ్‌ఎంసి నివేదికలు పరిశీలించే అధికారం గవర్నర్‌కు కట్టబెట్టింది. పోలీసు అధికారులు ఎసిపి, డిసిపి, స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్స్‌ బదిలీ అధికారం గవర్నర్‌కు ఇచ్చింది. అదనపు బలగాల మోహరింపు అధికారం కూడా గవర్నర్‌కు ఇచ్చింది.

ఉమ్మడి రాజధానిలో హైదరాబాద్‌ పై అధికారాలు గవర్నర్‌కు ఉండాల్సిందేనని కేంద్రం రాసిన లేఖపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామికంగా ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వ అధికారాలను కబళించడానికి ప్రయత్నిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ ఫాసిస్టు చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. రాజ్యాంగ మౌళిక సూత్రాలకు వ్యతిరేకంగా తెలంగాణ సీఎస్‌కు కేంద్ర¬ంశాఖ నుంచి అందిన లేఖను సీఎం తిప్పికొట్టారు. ¬ంశాఖ నియంతృత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ కేంద్రప్రభుత్వానికి లేఖరాయాలని సీఎస్‌ను ఆదేశించారు. లేఖలో పేర్కొన్న అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక అంశాలను పట్టించుకోబోమని, అమలు చేయబోమని విస్పష్టంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్ని కబళిస్తూ కేంద్రం పంపించిన రాజ్యాంగవ్యతిరేక లేఖను దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలకు పంపించాలని అధికారులను ఆదేశించారు. ఈ వ్యవహారంపై త్వరలోనే ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. కేంద్రప్రభుత్వ ఫాసిస్ట్‌ ధోరణిని ప్రతిఘటించడానికి ప్రజాఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సన్నద్ధమవుతున్నారు. సీమాంధ్ర నాయకుల ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం శోచనీయమని పలువురు రాజకీయ నిపుణులు విమర్శిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అడుగడుగునా తెలంగాణను నిలువెల్లా దోచుకున్న సీమాంధ్ర పాలకులు హైదరాబాద్‌పై అధికారాలను గవర్నర్‌చేతికి ఇచ్చి మరోసారి తెలంగాణపై ఆధిపత్యం చెలాయించేందుకు  కేంద్రంపై ఒత్తిడి తెచ్చినట్లుగా అర్థమవుతోంది.