‘పెత్తనం’పై పార్లమెంట్‌లో పోరాటం

COVER11

టిఆర్‌ఎస్‌ ఎంపీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం

వాయిదా తీర్మానం ఇవ్వండి

అనుమతివ్వకపోతే వెల్‌లోకి వెళ్లండి

మూడు రాష్ట్రాల సిఎంలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఫోన్‌

హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి) : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ పెత్తనంపై పార్లమెంట్‌లో పోరాడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు టీఆర్‌ఎస్‌ ఎంపీలకు సూచించారు. మొదట వాయిదా తీర్మానం ఇవ్వాలని, అనుమతివ్వని పక్షంలో వెల్‌లోకి వెళ్ళి సమస్యను వివరించాలని సూచించారు. ఇప్పటికే మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఆదివారం సీఎం కేసీఆర్‌తో తెరాస ఎంపీలు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో గవర్నర్‌కు శాంతి భద్రతల అంశమై కేంద్రం పంపిన ఆదేశాలపై విస్తృతంగా చర్చించారు. సోమవారం పార్లమెంటు సమావేశాల్లో దీనిపై వాయిదా తీర్మానం ఇస్తామని టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. జేడీయూ, టీఎంసీల ఎంపీల మద్దతుపై ఆ పార్టీల నేతలతో మాట్లాడినట్టు వెల్లడించారు. అన్నాడీఎంకే పార్టీ నేతలతోనూ కేసీఆర్‌ చర్చలు జరిపినట్టు ఆయన చెప్పారు. అలాగే ఈ సమావేశంలో   గవర్నర్‌ అధికారాలపై పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. గవర్నర్‌ అధికారాలను నిరసిస్తూ రేపు లోక్‌సభ స్పీకర్‌కు టీఆర్‌ఎస్‌ ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. జేడీయూ, తృణముల్‌ మద్దతును టీఆర్‌ఎస్‌ పార్టీ కోరింది. రేపు సభలో చర్చకు రాకుంటే పోడియం ముందు నిరసన తెలపాలని నిర్ణయించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాక్‌తో ఈ విషయంపై మాట్లాడానని ముఖ్యమంత్రి ఎంపీలకు తెలిపారు. గవర్నర్‌కు అధికారాలు ఇవ్వడమంటే రాష్ట్ర హక్కులను హరించడమేనని పేర్కొన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుచేద్దామని ఎంపీలతో కేసీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టడం విూద సోమవారం పార్లమెంట్‌ ఉభయ సభల్లో అభ్యంతరాలు లేవనెత్తాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో ఇతర పార్టీల మద్దతు కూడగట్టాలని కేసీఆర్‌ వారికి సూచించారు. ప్రాంతీయ పార్టీల ఎంపీలతో మాట్లాడడంతోపాటు, ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులతో చర్చించే బాధ్యతను కే.కేవవరావుకు కేసీఆర్‌ అప్పగించారు. అవసరమైతే వారితో సమావేశం ఏర్పాటుచేద్దామని ఆయన ఎంపీలకు సూచించినట్లు తెలిసింది. రెండున్నర జిల్లాలు గవర్నర్‌ కిందకు వెళ్లిపోతే ఇక తెలంగాణ ప్రభుత్వ అజమాయిషీలో ఏముంటుదని కేసీఆర్‌ ప్రశ్నించినట్లు సమాచారం. పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 8ని వక్రీకరిస్తున్నారని, దీనిపై కిందిస్థాయి నుంచి మూడు దశల్లో పోరాటం చేద్దామని కేసీఆర్‌ ఎంపీలతో చెప్పినట్లు సమాచారం. ఈ విషయంపై  న్యాయపోరాటానికి సైతం కేసీఆర్‌ సిద్ధమవుతున్నారు.

ఇదే విషయంపై మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో శనివారం నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌ పరిధిలో శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల వెనుక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుల కుట్ర ఉన్నదని ఆరోపించారు.  హైదరాబాద్‌పై కేంద్రం పెత్తనాన్ని సహించేది లేదన్నారు. గతంలో తాము లేఖలు రాసినా పట్టించుకోకుండా ఉత్తర్వులు పంపించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కేంద్ర నిర్ణయం రాజ్యాంగాన్ని పట్టపగలు ఖూనీ చేయడమేనన్నారు. చంద్రబాబు, వెంకయ్యల ప్రోద్బలంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోందన్నారు. గుజరాత్‌లో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర అధికారాలపై అప్పట్లో యూపీఏ ప్రభుత్వంతో గొడవపడిన విషయం మరిచిపోయారన్నారు. హైదరాబాద్‌పై గవర్నర్‌ పెత్తనం ఎందుకు ఉండాలి? ఎవరినైనా వెళ్లిపొమ్మన్నామా? ఎవరిపైనయినా కేసులు పెట్టామా? అని అడిగారు. గతంలో బీహార్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు విడిపోయినపుడు గవర్నర్లకు ఇలాగే అధికారాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై తమ వైఖరేంటో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పాలన్నారు. ఆయనకు, ఆ పార్టీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చూడాలన్నారు. లేకపోతే వారు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. హైదరాబాద్‌లో ఏమైనా అల్లర్లు జరిగితే కేంద్రం బాధ్యత తీసుకుంటుందా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఇతర రాష్ట్రాల వారు కూడా ఉన్నారని, వారికి లేని ఇబ్బంది సీమాంధ్రులకు ఎందుకన్నారు. హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. చంద్రబాబుది పక్కింటివారు చెడిపోవాలనే మనస్తత్వమని, ఏపీని అభివృద్ధి చేయలేక తెలంగాణ ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. టీ-టీడీపీ నేతలు అలాంటి చంద్రబాబు వెనుక ఉంటారా, పార్టీని వీడి వస్తారా తేల్చుకోవాలన్నారు.