గవర్నర్‌ అధికారాలపై దద్దరిల్లిన లోక్‌సభ

COVER12
29వ రాష్ట్ర అధికారాలు లాక్కుంటారా ?

ఆదుకొమ్మంటే హక్కులు హరిస్తారా ? : ఎంపీ జితేందర్‌రెడ్డి

సమర్థించుకున్న ¬ంమంత్రి

తాత్కాలికంగా నిలిపివేతకు రాజ్‌నాథ్‌సింగ్‌ హామీ : ఎంపీ వినోద్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 11 (జనంసాక్షి) : ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు అధికారాల అప్పగింతపై లోక్‌సభ సోమవారం దద్దరిల్లింది. తక్షణమే అధికారాల బదలాయింపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ సభ్యులు సభా కార్యకలాపాలకు అడ్డుకున్నారు. 29వ రాష్ట్ర అధికారాలు లాక్కుంటారా ? అని ఎంపీ జితేందర్‌రెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. ఆంధ్రా పాలకుల దోపిడీతో నష్టపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సింది పోయి తమ హక్కులు హరిస్తారా? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే గవర్నర్‌ అధికారాలపై కేంద్రం పంపిన లేకను ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సమర్థించుకున్నారు. గవర్నర్‌ అధికారాలను తాత్కాలికంగా నిలిపివేతకు రాజ్‌నాథ్‌సింగ్‌ హామీనిచ్చారని ఎంపీ వినోద్‌ తెలిపారు. రాష్ట్రాల అధికారాలలో జోక్యం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని టిఆర్‌ఎస్‌ ఎంపీలు మండిపడ్డారు. మరోవైపు పునర్విభన చట్టంలో ఉన్న దానినే అమలు చేయాలని తాము కోరుతున్నామని, ఇందులో ఎలాంటి రాజ్యాంగ ఉల్లంఘనలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. రాష్టాల్ర హక్కుల్లో జోక్యం చేసుకోవడం తమ లక్ష్యం కాదని.. చట్టాల అమలుకు మాత్రమే యత్నిస్తున్నామని తెలిపింది. అందరికీ న్యాయం చేస్తామని పేర్కొంది. సోమవారం లోక్‌సభ ప్రారంభం కాగానే టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళనకు దిగారు. గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలపై నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల బాధ్యతలను గవర్నర్‌కు అప్పగించాలన్న ¬ం శాఖ ప్రతిపాదనలను నిరసిస్తూ వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. అయితే, ఆందోళన విరమించాలని, ఈ అంశంపై చర్చకు సమయమిస్తానని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీలకు సూచించారు. కానీ వారు అదేదీ పట్టించుకోకుండా నిరసన కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే ఆమె వారి ఆందోళనల నడుమే ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. మరోవైపు, హైదరాబాద్‌పై గవర్నర్‌ అధికారాల విషయంలో ¬ం మంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్‌ చేశారు. చివరకు జీరో అవర్‌లో లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పక్ష నేత జితేందర్‌రెడ్డి ప్రసంగిస్తూ.. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై తీవ్రంగా మండిపడ్డారు.

60  ఏళ్ల పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణపై గవర్నర్‌ పేరుతో పెత్తనం సాగించాలని యత్నించడం సరికాదన్నారు. కేంద్రం కావాలనే తెలంగాణకు అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. ఇప్పటికే కేంద్రం తెలంగాణకు వ్యతిరేకంగా పోలవరం ఆర్డినెన్స్‌, పునర్విభజన చట్టం తెచ్చారని మండిపడ్డారు. ఎన్నికైన ప్రజా ప్రభుత్వం ఉండగా.. ఏసీపీలు, డీసీపీల నియామకాలు, బదిలీలు గవర్నర్‌కు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. శాంతిభద్రతల రక్షణ ప్రభుత్వ బాధ్యత అని, అలా కాకుంటే ఇక ముఖ్యమంత్రి, మంత్రులు ఎందుకని అడిగారు. తక్షణమే గవర్నర్‌కు అధికారాల బదలాయింపుపై నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గవర్నర్‌కు అధికారాలు అప్పగిస్తే ఇక తెలంగాణ ఇచ్చిన ప్రయోజనం ఉండదన్నారు. ¬ం శాఖ నుంచి గత జూలైలో వచ్చిన లేఖపై తాము తీవ్ర అభ్యంతరం తెలుపుతూ బదులిచ్చామని, అయినా ¬ం శాఖ కచ్చితంగా అమలు చేయాలని సూచించడం సరికాదన్నారు. రాష్టాల్ర అధికారాల్లో కేంద్ర జోక్యం రాజ్యాంగ విరుద్ధమన్నారు. తెలంగాణపై కేంద్ర పెత్తనం సరికాదన్నారు. తెలంగాణకు న్యాయం చేయాలని కోరారు. గవర్నర్‌కు అధికారాలు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అందరికీ న్యాయం చేస్తామని ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఇప్పుడే చెప్పారని.. ¬ం మంత్రి చెప్పిన మేరకు తెలంగాణకు కూడా న్యాయం చేయాలని కోరారు. మరోవైపు, జితేందర్‌రెడ్డి ప్రసంగానికి సీమాంధ్ర ఎంపీలు అడ్డుతగిలారు. ఎంపీలు మురళీమోహన్‌ తదితరులు తమ స్థానాల నుంచి లేచి నినాదాలు చేశారు.

అనంతరం ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ.. అందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. రాష్టాల్ర అధికారాలను కాపాడడమే తమ లక్ష్యమన్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలను దెబ్బ తీయడం తమ ఉద్దేశ్యం కాదని స్పష్టం చేశారు. రాష్టాల్ల్రో శాంతిభద్రతలను సవ్యంగా ఉంచాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టాన్ని తయారు చేసింది యూపీఏ ప్రభుత్వమని, ఇందులో తాము చేసిందేవిూ లేదన్నారు. గవర్నర్‌ అధికారాలు అప్పగింతపై తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదన్నారు. గవర్నర్‌కు అధికారాలు చట్టంలో ఉన్నదేనని గుర్తు చేశారు. పునర్విభజన చట్టం సెక్షన్‌ 8లో గవర్నర్‌కు ప్రత్యేక అధికారుల గురించి చట్టంలో స్పష్టంగా చెప్పారని తెలిపారు. విభజన చట్టం ప్రకారమే గవర్నర్‌కు ఇద్దరు సలహాదారులను కేంద్రం నియమించిందన్నారు. ప్రజల రక్షణ, ఆస్తులు, శాంతిభద్రతలు రక్షణ గవర్నర్‌ బాధ్యత అని వివరించారు. ఉమ్మడి రాజధానిలో సెటిలర్స్‌ భద్రత గవర్నర్‌ బాధ్యత అని చట్టంలోనే ఉందన్నారు. అపాయింటేడ్‌ డే నుంచే గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు వర్తిస్తాయన్నారు. తెలంగాణ కేబినెట్‌ అభిప్రాయాన్ని తీసుకొని గవర్నర్‌ స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఇందులో ఎలాంటి నిబంధనల ఉల్లంఘనలు లేవన్నారు. చట్టంలోని అంశాలను అమలు చేయాలని కోరడం రాజ్యాంగ విరుద్ధం కాదని స్పష్టం చేశారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రసంగానికి టీఆర్‌ఎస్‌ ఎంపీలు అడ్డుతగిలారు. రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ మధ్యాహ్నం రెండు గంటల వరకు సభను వాయిదా వేశారు.