నూతన పారిశ్రామిక విధానంతో బంగారు తెలంగాణ

1
మెట్రో రైలు పనులు త్వరితగతిన పూర్తిచేయండి

ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 13 (జనంసాక్షి) : నూతన పారిశ్రామిక విధానంతో బంగారు తెలంగాణ సాధిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మెట్రో రైలు పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. నగరం శరవేగంగా అభివృద్ధి చెందడంతోపాటు బాగా విస్తరిస్తోందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మెట్రో రైలు మార్గాన్ని కూడా పొడిగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు కోరారు. సచివాలయంలో బుధవారం మెట్రో రైలు పనులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మహముద్‌ అలీ, ¬ంమంత్రి నాయిని నర్సిహరెడ్డి, ఎక్సైజు శాఖ మంత్రి పద్మారావు , మెట్రో ప్రాజెక్టు చైర్మన్‌ దేశస్థలి , డైరెక్టర్‌ ఎస్‌విఎస్‌ రెడ్డి, జిహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌ కుమార్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ మహిందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అనుసరించబోయో నూతన పారిశ్రామిక విధానం ఫలితంగా తెలంగాణలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయని ఇప్పటికే చాలా మంది పెట్టుబడిదారులు సంప్రదింపులు జరుపుతున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. పరిశ్రమలతో పాటు ఐటిఆర్‌ ప్రాజెక్ట్‌ కూడా నగరంలో వస్తోందని మొత్తంగా రాబోయో కాలంలో హైదరాబాద్‌ నగరం బాగా విస్తరిస్తుందని చెప్పారు. రాబోయో కాలంలో అవసరాలు కూడా ఎక్కువవుతాయన్నారు. జనాభా కూడా నగరంలో రెండు కోట్లు దాటుతుందని వెల్లడించారు. నగర ప్రణాళిక కూడా విస్తరించే నగరానికి అనుకూలంగా ఉండాలని తాము నిర్ణయించుకున్నామని అందుకోసం త్వరలోనే మాస్టర్‌ ప్లాన్‌ రూపోందిస్తున్నామని అందులో మెట్రో రైలు అంతర్భాగం కావాలని ముఖ్యమంత్రి సూచించారు. గత పాలకులు మెట్రోలైను రూపకల్పన సందర్భంగా అవగాహనా రాహిత్యంతో వ్యవహరించారని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. శాశ్వత ప్రాతిపదికన ఏ పనిచేసిన భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోవాలని కాని గత పాలకులకు ఆ విజన్‌ లేకుండాపోయిందని చెప్పారు. అందుకే మెట్రో లైను ప్రాజెక్టును ప్రస్తుతం నగరం వున్న వరకే డిజైన్‌ చేశారని చెప్పారు. 72కిలోమీటర్ల వరకే ఉన్న మెట్రో లైను ప్రాజెక్టును 200కి.మీ.లకుపైగా విస్తరించాలని ముఖ్యమంత్రి సూచించారు. వచ్చే ఏడాది ఉగాది నుండి నాగోలు నుండి మెట్టుగూడ వరకు మెట్రో రైలును నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నందున పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. అవసరమైన చోట్ల ట్రాఫిక్‌ను దారిమళ్లించి అయినా, పూర్తిగా ట్రాఫిక్‌ అంక్షలు విధించి అయినా పనులు పూర్తి చేయాలని కోరారు. మెట్రోలైను నిర్మాణంలో తలెత్తిన కోర్టు వివాదాలను కూడా వెంటనే పరిష్కరించాలని సూచించారు. అవసరమైన వారికి వెంటనే నష్టపరిహరం కూడా చెల్లించాలని ఆదేశించారు. త్వరలోనే మున్సిపల్‌, పోలీస్‌ , రెవెన్యూ , ఇతర సంబంధిత అధికారులతో మరో సమావేశం నిర్వహించి పనులు త్వరగా పూర్తియ్యేటట్లు చూస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.