మన నవాబుల ఘనకీర్తి గోల్కొండ
నేడు జెండా ఊంచా రహే హమారా
హైదరాబాద్, ఆగస్ట్ 14 (జనంసాక్షి) : మన నవాబుల ఘనకీర్తి చారిత్రక గోల్కొడ కోట మరోమారు చరిత్ర పుటల్లోకి ఎక్కబోతోంది. ఎర్రకోట తరహాలో ఇక్కడ మువ్వన్నెల జెండా తొలిసారిగా ఎగురబోతోంది. తెలంగాణ ఏర్పడ్డ తరవాత తొలి తెలంగాణ సిఎం కెసిఆర్ గోల్కొండ కోటనుంచి భారత పతాకను ఎగురవేస్తున్నారు. ఇదో అద్భుతమైన చారిత్రక ఘట్టంగా నిలవనుంది. గతానికి భిన్నంగా ఇప్పుడు గోల్కొండ కోట స్వాంత్య్ర వేడుకలకు ముస్తాబయ్యింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికులకు స్వస్తిపలికి గోల్కొండకు సిఎం కెసిఆర్ జెండా ఊపారు. దీంతో హమారా గోల్కొండ అన్న నానుడి బలపడనుంది. వారసత్వ సంపదను ఘనంగా చాటిచెప్పుకునే అవకాశాన్ని సిఎం కెసిఆర్ తనసొంతం చేసుకున్నారు. ఇదిలావుంటే ఇక్కడి నుంచే ఆయన తన సర్కార్ గమ్యాన్ని, చేపట్టబోయే కార్యక్రమాలను ప్రకటించనున్నారు. అలాగే తీసుకున్న నిర్ణయాలను, వాటి లక్ష్యాలను కూడా ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణ ఏర్పాటుతో సహా గత 14ఏళ్ల ఉద్యమం, దాని నేపథ్యం తదితర అంశాలను కూడా వివరించే అవకాశాలు ఉన్నాయి. 19న జరిగే సర్వేతో సహా వివిధ పథకాలను, లక్ష్యాలను సిఎం వెల్లడిస్తారు. అలాగే తెలంగాణ సర్వతో ముఖాభివృద్దికి తీసుకోబోయే చర్యలకు సంబంధించి భవిష్యత్ దార్శనికతను వెల్లడిస్తారు. ఇక సిఎం కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళితులకు మూడెకరాల భూ పంపిణీని నల్లగొండ జిల్లాలో కాకుండా గోల్కొండ కోట నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. చారిత్రక గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహిస్తున్న వేదికపైనే దళితులకు భూమి పట్టాలను అందజేయనున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తొలుత నల్లగొండ జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు భావించారు. కానీ పరిపాలనపరమైన కారణాలతో దానిని ఖరారు చేయలేదు. వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చిన భూమిలేని నిరుపేద దళిత మహిళలకు మూడు ఎకరాల భూమిని ఇస్తూ పట్టాలను అందజేయనున్నారు. ఈ మేరకు జిల్లాల్లోని కలెక్టర్లు భూమిలేని దళిత మహిళలను గుర్తించి జిల్లాకు 6 నుంచి 8 మందిని గోల్కొండ కోటకు తీసుకుని రానున్నారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు స్వాతంత్య దినోత్సవ కార్యక్రమంలోనే ఎంపిక చేసిన దళితులకు భూమి పట్టాలు అందజేస్తారు. దళితులకు అందజేసే పట్టాలపై కలెక్టర్ సంతకాలు చేస్తారని తెలుస్తున్నది. గతంలో భూ పంపిణీ కార్యక్రమం ఎస్సీ సంక్షేమశాఖ సహకార సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. అప్పుడు సదరు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆ పట్టాలపై సంతకాలు చేసేవారు. దీన్ని మార్చేందుకు తెలంగాణ ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. పట్టాలు అందజేసిన తరువాత భూమి సర్వే చేసిన అనంతరం అందుబాటులో ఉన్న దాన్ని బట్టి కొత్త పహాణీలను సిద్ధం చేస్తామని అంటున్నారు. ప్రభుత్వం పంపిణీచేసిన పట్టాపై కేవలం ఆ ఇంటి మహిళ ఫోటోను మాత్రమే పెట్టాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం వర్తింపజేసే ఏ పథకంలోనైనా మహిళల పేరునే తీసుకోవాలని గతంలోనే ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి గోల్కొండ కోట చరిత్రకు ఎక్కబోతోంది. సగర్వంగా హైదరాబాద్ షాన్ చాటబోతోంది.