జెండా ఊంచా రహే హమారా
తొలి తెలంగాణ పంద్రాగస్టు పండుగ
గోల్కొండ ఖిలాపై మువ్వన్నెల వేడు
వలసవాద కబంధ హస్తాల్లో నుంచి అహింసా మార్గంలోనే భారత్ విముక్తం
అదే మార్గంలోనే తెలంగాణ స్వరాష్ట్రం
సంక్షేమమే తెలంగాణ ఎజెండా
దళితుల మూడెకరాల భూమికి ఖిలా సాక్షిగా శ్రీకారం
ముస్లిం మైనార్టీలకు, ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్‌కు కమిటీ వేశాం
నివేదిక రాగానే అమలుచేస్తాం
50 వేల ఉద్యోగాల భర్తీ
క్రీడాకారులకు సత్కారం
సర్వేపై సీమాంధ్రుల దుష్ప్రచారం
ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, ఆగస్టు 15 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తొలి స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం చారిత్రక గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కేసీఆర్ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వలసవాద చేతుల్లో కబంధ హస్తాల్లో నుంచి అహింసా మార్గంలోనే భారత్ విముక్తం అయ్యిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అదే మార్గంలోనే తెలంగాణ స్వరాష్ట్రం సాధించామన్నారు. సంక్షేమమే తెలంగాణ ఎజెండా అని, దళితుల మూడెకరాల భూ పంపిణీకి ఖిలా సాక్షిగా శ్రీకారం చుట్టామన్నారు. ముస్లిం మైనార్టీలకు, ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కమిటీ వేశామని, నివేదిక రాగానే అమలుచేస్తామని సీఎం చెప్పారు. సర్వేపై సీమాంధ్రుల దుష్ప్రచారం తగదని అన్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలే కేంద్ర బిందువుగా తమ పరిపాలన ఉంటుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలన్నీ నెరవేరుస్తామని స్పష్టంచేశారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, బడుగు బలహీనవర్గాలకు ఇళ్లు కట్టిస్తామన్నారు. రైతులకు రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు.
స్వరాష్ట్రంలో తొలి వేడుకలు
అంతకుముందు మహాత్మాగాంధీ పోరాట పటిమను గుర్తుచేసిన కేసీఆర్ మహాత్ముడి చూపిన మార్గంలో శాంతియుత పద్ధతిలో, అహింసా మార్గంలో తెలంగాణ రాష్టాన్న్రి సాధించుకున్నామని చెప్పారు. చారిత్రక గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవాలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్వేచ్ఛా తెలంగాణలో జెండా ఎగురవేయడం ఆనందంగా ఉందన్నారు. గోల్కొండకు ఎంతో చారిత్రక నేపథ్యముందని, ప్రపంచ వర్తక వాణిజ్య కేంద్రంగా గోల్కొండ విలసిల్లిందని గుర్తు చేశారు. శాస్త్ర విజ్ఞానానికి, వాస్తు కళా నైపుణ్యానికి ప్రతీక గోల్కొండ కోట అని కొనియాడారు. 50వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నట్లు యువతపై వరాల జల్లు కురిపించారు.
గిరిజన, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు
దళితులు, గిరిజనులు, మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేసీఆర్ స్పష్టంచేశారు. గిరిజనులు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. ఇందుకోసం తమ ప్రభుత్వం ఇప్పటికే కమిటీని ఏర్పాటుకు చర్యలు తీసుకుందని, కమిటీ నివేదిక రాగానే 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. టీఆర్‌ఎస్ సర్కారు దళితు, గిరిజన యువతుల వివాహాల కోసం కల్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. దసరా నుంచి ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ. 50 వేలు అందిస్తామని చెప్పారు. గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలను పంచాయతీలుగా మారుస్తామన్నారు. మైనార్టీల అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఈ పథకాన్ని గోల్కొండ కోట నుంచే ప్రారంభిస్తున్నామన్నారు. మైనార్టీల అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. దళిత, కైస్త్రవుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామని చెప్పారు. కలెక్టర్ల అనుమతి లేకుండానే ఇకపై చర్చిల నిర్మాణం చేసుకోవచ్చని సీఎం తెలిపారు. ఇప్పటివరకు చర్చి నిర్మించాలంటే కలెక్టర్ల అనుమతి తీసుకోవాల్సి ఉండేదని, త్వరలోనే ఈ నిబంధనను మారుస్తామన్నారు. గ్రామపంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలోనే అనుమతులు వచ్చేలా చూస్తామని ప్రకటించారు.
దసరా నుంచి పెంచిన పింఛన్లు..
సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీ సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఇందుకోసం లక్ష కోట్ల రూపాయలు వెచ్చిస్తామని.. ఇందులో రూ.50 వేల కోట్లు ఎస్సీ సంక్షేమానికి కేటాయిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హావిూని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. వృద్ధులకు, వితంతువులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛన్ తప్పకుండా ఇస్తామన్నారు. దసరా, దీపావళి మధ్యలో ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. బలహీనవర్గాలకు డబుల్‌బెడ్‌రూం ఫ్లాట్‌లు కట్టించి ఇస్తామని తెలిపారు. రూ.3.50 లక్షల వ్యయంతో ఒక హాల్, రెండు బెడ్‌రూంలు, కిచెన్ కట్టిస్తామని చెప్పారు. బీడీ కార్మికులకు రూ.వెయ్యి పింఛన్ అందజేస్తామని తెలిపారు.
హావిూలన్నీ అమలు చేస్తాం.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలన్నీ నెరవేరుస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ చేస్తామని ఉద్ఘాటించారు. రైతులకు రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని, రూ.18 వేల కోట్ల రుణభారాన్ని ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఈ ప్రయోజనం రైతులకు త్వరలోనే అందుతుందన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీతోపాటు ఎర్రజొన్నల బకాయిలను విడుదల చేశామన్నారు. రైతుల ఇబ్బందులను గుర్తించే అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇచ్చిన హావిూ మేరకు ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మన గ్రామం-మన ప్రణాళిక, మన మండలం-మన ప్రణాళిక, మన జిల్లా – మన ప్రణాళిక, మన రాష్ట్రం-మన ప్రణాళికపథకం ద్వారా రాష్ట్ర ప్రణాళిక రూపుదిద్దుకుంటుందన్నారు. స్థానిక సంస్థలకు అధికారాలు అప్పగించి జవాబుదారీతనం పెంచుతామని చెప్పారు.
పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహం..
పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామని సీఎం తెలిపారు. పరిశ్రమలకు అందుబాటులో 30 లక్షల ఎకరాల భూమి ఉందన్నారు. సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. నిజాం ప్రభుత్వులు ఇచ్చిన భూములు చాలా ఉన్నాయని, పది లక్షల ఎకరాలు పరిశ్రమలకు అనువుగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ స్థలాల్లో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసి పరిశ్రమలను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఆటో, ట్రాక్టర్ ట్రాలీలకు రవాణా పన్నును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఉద్యోగాల భర్తీ
కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్న హావిూ మేరకు చర్యలు తీసుకుంటున్నామని కేసీఆర్ వివరించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరించాలని ఉత్తర్వులు జారీచేశామని తెలిపారు. నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. త్వరలోనే టీపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు జారీ చేసి 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్స్ నిర్మించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో కల్లు దుకణాలను దసరా పండుగ నుంచి ప్రారంబించనున్నట్లు చెప్పారు. తెలంగాణలో హరితహారం పేరుతో ఓ పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. 3.50 కోట్ల మొక్కలను నాటనున్నట్లు వివరించారు.
సర్వేపై దుష్పచ్రారం
ఈ నెల 19న దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగని రీతిలో ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న కొందరు దుష్పచ్రారం చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందడం లేదని, అర్హులకే ప్రయోజనం చేకూర్చడానికి, నిధులు అక్రమ మార్గం పట్టకుండా చూడడానికే సమగ్ర సర్వే చేపట్టామన్నారు. ఈ విషయంలో దుష్టశక్తులు రాద్దాంతం చేస్తున్నాయని, ఎవరినీ ఇబ్బంది పెట్టడానికికాదని స్పష్టంచేశారు. ఈ సర్వేకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే నాలుగేళ్లలో తెలంగాణ ప్రజలకు తాగునీటి సమస్య తీరుస్తామన్నారు. రూ.30 వేల కోట్లతో తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో క్రీడాకారులను తగు రీతిలో ప్రోత్సహిస్తామన్నారు. ఒలింపిక్స్, ఆసియన్, కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులకు రూ.3 లక్షలు అందిస్తామని చెప్పారు. స్వర్ణం గెలిస్తే రూ.50 లక్షలు, రజత పతకానికి రూ.25 లక్షలు, కాంస్యం గెలిస్తే రూ.15 లక్షల ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. పోలీసు శాఖలో అతిత్వరలోనే 3,600 ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఉద్యోగులను కడుపులో పెట్టి చూసుకుంటామని తెలిపారు. అందుకు అనుగుణంగానే స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేశామన్నారు.