‘చంద్రులు’ చర్చించుకుంటారు
సమన్వయ కర్తగా గవర్నర్ నర్సింహన్
నేడు భేటీకానున్న ముఖ్యమంత్రులు
హైదరాబాద్, ఆగస్టు 16 (జనంసాక్షి) : ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకుంటారని గవర్నర్ నర్సింహన్ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య సయోధ్యకు మరో అడుగు ముందుకు పడింది. రెండు రాష్ట్రాల మైత్రికి గవర్నర్ నరసింహన్ దౌత్యం ఫలించింది. ఇరువురు ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖరరావు, చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. ఆదివారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. గవర్నర్ చొరవతో ముఖాముఖి సమావేశానికి ఇరువురు నేతలు అంగీకరించారు. విభజన తర్వాత తలెత్తిన సమస్యలపై ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. ఉద్యోగుల విభజన, నీటి పంపకాలు, పీపీఏలు, ఎంసెట్ ప్రవేశాలు, బోధన ఫీజులు తదితర అంశాలపై చర్చకు వచ్చే అవకాశముంది. కీలకమైన ఈ భేటీకి ఇరు రాష్టాల్ర శాసనసభ స్పీకర్లు మధుసూదనాచారి, కోడెల శివప్రసాదరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావు హాజరుకానున్నారు. శాసనసభ, సచివాలయంలో భవనాల కేటాయింపుపై కొంత వివాదం నెలకొంది. దీనిపై ఇప్పటికే ఇరు రాష్టాల్ర స్పీకర్లు సమావేశమై చర్చించారు. కొన్ని అంశాలపై ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ముఖ్యమంత్రుల సమావేశంలోనూ వీరు పాల్గొనడంతో మిగతా సమస్యలు కూడా పరిష్కారం కానున్నాయని భావిస్తున్నారు.విభజన తర్వాత రెండు రాష్టాల్ర మధ్య పలు అంశాలపై వివాదాలు నెలకొన్నాయి. హైదరాబాద్‌లో గవర్నర్‌కు విశేష అధికారాలు, విద్యుత్ పీపీఏలు, జల వనరులు, ఉద్యోగుల విభజన, భవనాల కేటాయింపు, ఇంజినీరింగ్ కౌన్సెలింగ్, బోధనా ఫీజులు వంటి అంశాలపై భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ప్రధానంగా హైదరాబాద్‌లో గవర్నర్‌కు విశేషాధాకారాలు కల్పించాలని ఏపీ ఒత్తిడి తేవడంపై టీ-సర్కారు గుర్రుగా ఉంది. చంద్రబాబు వల్లే కేంద్రం తమపై ఒత్తిడి తెస్తోందని కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారు. విద్యుత్ పీపీఏలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయడంతో వివాదం మొదలైంది. పునర్విభజన చట్టం ప్రకారం విద్యుత్ కేటాయింపులు జరగాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. మరోవైపు, ఎంసెట్ కౌన్సెలింగ్‌పైనా రెండు రాష్టాల్ర మధ్య వివాదం ఏర్పడింది. కౌన్సెలింగ్‌కు సమయం కావాలని టీ-సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఏపీ ఉన్నతవిద్యామండలి కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయడం రెండు రాష్టాల్ర మధ్య అగాధం పెంచింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కొంత మేరకు సమస్య సర్దుమణిగింది. అయితే, బోధనా ఫీజులపై సమస్య ఏర్పడింది. తెలంగాణకు చెందిన వారికే ఫీజులు చెల్లిస్తామని, సీమాంద్ర విద్యార్థులకు చెల్లించే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు బోధనా ఫీజుల పథకాన్ని రద్దు చేసి, దాని స్థానంలో ‘ఫాస్ట్’ పథకం తీసుకొచ్చారు. దీని ప్రకారం 1956కు ముందున్న వారినే స్థానికులుగా గుర్తించి, వారి పిల్లలకు మాత్రమే బోధనా ఫీజులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయాన్ని ఏపీ సర్కారు తీవ్రంగా తప్పుబట్టింది. జనాభా ప్రాతిపదికన 52:48 నిష్పత్తిలో బోధనా ఫీజులు చెల్లించేందుకు సిద్ధమని చంద్రబాబు ప్రతిపాదించారు. అందుకు తెలంగాణ సర్కారు అంగీకరించలేదు. దీంతో కౌన్సెలింగ్ ప్రారంభమైనా ఫీజులపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు, ఉద్యోగుల విభజన విషయంలోనూ ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. స్థానికత ఆధారంగా కేటాయించాలని రెండు రాష్ట్రాలు కోరుతున్నా రెండింటి మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. ఇక, ఉమ్మడి రాజధానిలో భవనాల కేటాయింపు కూడా రెండు రాష్టాల్ర మధ్య వివాదానికి కారణమైంది. సచివాలయం, శాసనసభలలో కొన్ని చాంబర్లపై తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌ల మధ్య సమస్య ఏర్పడింది. దీనిపై ఇరు రాష్టాల్ర స్పీకర్లు సమావేశమై చర్చించారు. మరోవైపు, కృష్ణా జలాల విడుదలపైనా ఇరురాష్టాల్ర మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాగునీటి అవసరాల కోసం పది టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఏపీ కోరగా.. తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది.
ఇన్ని వివాదాల నేపథ్యంలో ఇరుప్రాంతాల ప్రజల్లో తీవ్ర ఆందోళన, గందరగోళం నెలకొంది. దీనిపై పలువురు నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రులను సమావేశపరిచి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో గవర్నర్ చొరవ తీసుకొని సీఎంల భేటీకి యత్నించారు. ఇటీవల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్‌కు వచ్చిన నేపథ్యంలో కేసీఆర్, చంద్రబాబులు సీఎం ¬దాలో తొలిసారిగా తారసపడ్డారు. ఇరువురు పరస్పరం అభివాదం చేసుకొని పలకరించుకొన్నారు. అలాగే శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చిన తేనీటి విందులోనూ చంద్రులిద్దరూ పాల్గొన్నారు. ఆప్యాయంగా పలకరించుకొన్నారు. ఈ సందర్భంగానే గవర్నర్ నరసింహన్ వివాదాస్ప అంశాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇద్దర్ని కోరారు. ఇరువురు సమావేశమై చర్చలు జరపాలని కోరారు. ఇందుకు ముఖ్యమంత్రులు అంగీకరించడంతో సీఎంల భేటీకి అడుగు ముందుకు పడింది. ఆదివారం మధ్యాహ్నం రాజ్‌భవన్ వేదికగా ఈ సమావేశం జరగనుంది.