సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి

COVER18

అర్హుల గుర్తింపు కోసమే సర్వే

సర్వేలో పాల్గొనడం స్వచ్ఛందమే

ఆంధ్రావాళ్ళు మా లక్ష్యం కాదు

సింగపూర్‌ పర్యటన తర్వాత కేబినేట్‌ విస్తరణ

మెట్రోరైల్‌ అలైన్‌మెంట్‌ మారుతుంది

ఇంజినీరింగ్‌ కళాశాల రద్దు సర్కారుకు సంబంధంలేదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 17 (జనంసాక్షి): సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సమక్షంలో భేటీ అయ్యారు. మొదట అరగంటపాటు కె.చంద్రశేఖరరావు,  చంద్రబాబునాయుడుతో ప్రత్యేకంగా సమావేశమైన గవర్నర్‌ అనంతరం ఇరు రాష్ట్రాలకు చెందిన శాసనసభ, మండలి ఛైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. అర్హుల గుర్తింపు కోసమే సమగ్ర సర్వే నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. సర్వేలో పాల్గొనడం స్వచ్ఛందమేనని, బలవంతమేమీ లేదని అన్నారు. ఆంధ్రావాళ్ళు తమ లక్ష్యంకాదని స్పష్టంచేశారు. సింగపూర్‌ పర్యటన తర్వాత కేబినేట్‌ విస్తరణ ఉంటుందని సంకేతాలిచ్చారు. మెట్రోరైల్‌ అలైన్‌మెంట్‌ మారుతుందన్నారు. మెట్రో అలైన్‌మెంట్‌ మారుతుందని కేసీఆర్‌ తెలిపారు. అసెంబ్లీ ముందు నుంచి కాకుండా వెనుకనుంచి మెట్రో వెళుతుందని ఆయన తెలిపారు. అలాగే సుల్తాన్‌బజార్‌ మీదుగా కాకుండా ఉమెన్స్‌కాలేజీ మీదుగా వెళ్లనుందని ఆయన వెల్లడించారు. ఇంజినీరింగ్‌ కళాశాల రద్దుతో సర్కారుకు సంబంధంలేదని ప్రకటించారు. సుహృద్భావ వాతావరణంలో చర్చల ఫలవంతమయ్యాయన్నారు. ఇలాగే మున్ముందు కూడా ఇద్దరం ఇలాగే సమావేశమై చర్చించి సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్ర విభజన కూడా ఇలాంటి సుహృద్భావ వాతావరణంలో జరిగితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఆంధ్ర బడ్జెట్‌ సమావేశాలు ముగిశాక తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు పెట్టుకుందామని, సెప్టెంబర్‌ 7వ తేదీలోగా ఎపి బడ్జెట్‌ సమావేశాలు ముగించేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు కేసీఆర్‌ చెప్పారు. ఉద్యోగుల విషయంలోగానీ, మరే ఇతర విషయాల్లోగానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమన్వయంతో చర్చించుకుని వాటి పరిష్కారానికి కృషిచేయాలని, అనివార్య పరిస్థితుల్లో తాము రాజకీయ జోక్యం చేసుకోవాలని నిర్ణయించినటుట్లు చెప్పారు. కమలనాథన్‌ కమిటీ సిఫారసుల ప్రకారం 67వేల మంది ఉద్యోగుల పంపిణీ జరగాల్సి ఉందని, ఇందులో 22వేలు ఖాళీ ఉన్నాయని, మిగిలిన 45వేల మందినే పంచుకోవాల్సి వస్తుందని, ఇది పెద్ద సమస్య కాదన్నారు. ఉద్యోగుల పంపిణీలో ఒకవేళ తెలంగాణ డిజిపి ఆంధ్రాకు వెళితే తిరిగి అతన్ని తెలంగాణాలో నియమించుకోవడానికి ఇద్దరి మధ్య అవగాహన కుదిరిందన్నారు. తెలంగాణాకు ఓడరేవులేదు. రేపు అవసరమవుతుంది. సమీపంలోని బందరుపోర్టును వాడుకుంటాం, అలాగే సీమాంధ్రులకు హైదరాబాద్‌తో అవసరం ఉంటుంది వాడుకుంటారన్నారు. ముఖ్యంగా 9, 10వ షెడ్యూల్‌పై చర్చ జరిగిందన్నారు. 10లో 107 సంస్థలు ఉన్నాయని, ఇందులో పిలో 11, తెలంగాణాలో 96 ఉన్నాయని, వీటిని పరస్పర సహకారంతో కలిసి ముదుకువెళతామన్నారు. తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాం సాధించుకున్నామన్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైతే ఇద్దరం కలిసి ఢిల్లీ వెళ్తామన్నారు. హెచ్‌ఆర్‌డిలాంటి సంస్థల సేవలను ఇరు ప్రాంతాలు వినియోగించుకోవాల్సి ఉందన్నారు. అన్యాయాలను అరికట్టడానికి కఠిన నిర్ణయాలు తప్పవన్నారు. తాము తీసుకుంటున్న నిర్ణయాలు చూసి తనను కొందరు హిట్లర్లతో పోల్చారని, దొంగలపాలిట, ఆస్తులు కాజేసేవారికి పైరవీలు చేసేవారికి తాను హిట్లర్‌నేనని, అవసరమైతే హిట్లర్‌ తాతను అవుతానని హెచ్చరించారు. నిజమైన అర్హులకు, లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 1956 స్థానికత అన్నాం.. దానికి కట్టుబడి ఉన్నాం. జీవోను కూడా తీసిన విషయాన్ని కేసీఆర్‌ గుర్తుచేశారు. తామేడో చేయరాని పనులు చేశామని, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నామని విమర్శలు చేయడం సరికాదన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు మాత్రమే, ఇంకా ఐదేళ్ళ కాలం ఉంది. ఏంచేయాలన్నది ఇంకా నిర్ణయించాల్సి ఉందన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేసే విమర్శలు కోడిగుడ్డుపై ఈకలు పీకిన చందంలా ఉందని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. గతంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా ఆరు నెలలకుగానీ పనులు ప్రారంభమయ్యేవి కాదన్నారు. కేసీఆర్‌ ఎవ్వరికీ భయపడడన్నారు. ఉద్యమం నుంచి వచ్చాను, ఉద్యమన్ని నడిపించానని, ప్రజల సాధక బాధకాలేమిటో తెలిసిన వాడినని అన్నారు. మీరుచేసే తాటాకు చప్పుళ్ళకు భయపడుతానని అనుకోవడం భ్రమేనన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తాము పెట్టలేదని, దాన్ని అలా ఉంచామన్నారు. తాము ప్రవేశపెట్టింది ఫాస్ట్‌ పథకం ఒక్కటేనని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. కేంద్రం తమతో సభ్యతతో ఉంటే మేము వారితో సభ్యతతో ఉంటామన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేపై కేంద్రం లేఖ రాసిందని వచ్చిన వార్తలను ఖండించారు. లేఖలేదు గీకలేదు అన్నీ గాలి వార్తలేనన్నారు. సర్వేలో అన్ని వివరాలు తెలిపితే వారికి లాభం, ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదన్నారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పులకు, అసమర్థ నిర్ణయాలకు తాము బలికాకుండా ప్రజలకు మేలు జరగడానికే ఈ సర్వే తప్ప ఇందులో వేరే దురుద్దేశం లేదన్నారు. రాష్ట్రంలో 85 లక్షల కుటుంబాలు ఉంటే 110 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయని, కొందరు అర్హులకు ఇంకా రేషన్‌కార్డులు లేవన్నారు. ప్రజల వివరాలు, బాగోగులు తెలుసుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని కేసీఆర్‌ ప్రశ్నించారు. మీడియా ప్రతినిధులు కూడా ఇట్టి విషయాన్ని అర్థం చేసుకుని ప్రజలకు ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియజేయాలన్నారు. మీరు కూడా సమాజంలో భాగస్వాములేనని, నేడు ఒక పేదకు అన్యాయం జరిగింది, రేపు మీకు జరగదన్నది ఎలా అనుకుంటారని అన్నారు. అనర్హులను తొలగించి అర్హులను చేర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలపై ప్రభుత్వానికి ఒక దృక్పథం, అభిప్రాయం ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. చీకట్లో ఉండి తాము బాణం వేయదలచుకోలేదన్నారు. సీమాంధ్రులను ఏరివేయడానికే సర్వే చేస్తున్నారన్నది శుద్ధ తప్పన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును తాను దగ్గరుండి చేయించానన్నారు. మీడియా మాత్రం ఎపికి అన్యాయం జరిగిందని దుష్ప్రచారం చేసిందన్నారు. రాజ్యాంగ అధికరణ 168కింద గవర్నర్‌ అధికారాలను బిల్లులో పొందుపర్చారన్నారు. ఇవికాకుండా గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ కేంద్రం నుంచి వచ్చిన లేఖను తిప్పి పంపామని, కేంద్రం ఫాసిస్టుగా వ్యవహరిస్తుంది తప్ప మోడీని అనలేదన్నారు. ఏదేమైనా తమ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటుందన్నారు. కొన్ని పత్రికలు రాసే గాలివార్తలు నమ్మొద్దన్నారు. గతంలో ఇంజనీరింగ్‌ కళాశాలలను తనిఖీ చేయాలంటే అధికారులు గేటుదాటి లోపలికి వెళ్ళేవారు కాదన్నారు. నేడు హోంగార్డు, ఆటోడ్రైవర్‌, పోలీస్‌ కానిస్టేబుల్‌ ఇంజనీరింగేనన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణాలో 635 కళాశాలలు ఉన్నాయని, ఇవి ఎవరిని ఉద్దరించడానికో అర్థం కావడం లేదన్నారు. ఇవి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం పుట్టుకొచ్చాయని పత్రికలే రాస్తున్నాయన్నారు. 174 ఇంజనీరింగ్‌ కళాశాలలను రద్దుచేస్తున్నట్లు నేడు పత్రికల్లో చూసి నవుకున్నానని అన్నారు. కళాశాలలను రద్దుచేయడం అనుమతివ్వడం జెఎన్‌టియు చూసుకుంటుంది తప్ప ప్రభుత్వానికి అవసరమేమిటన్నారు. ఢిల్లీ తరహాలో పోలీస్‌శాఖను తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు.

ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల్లో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం నేతలు చర్చించి ఓ కొలిక్కి వచ్చారు. విడిపోయింది రాష్ట్రాలే తప్ప తెలుగు ప్రజలు కాదని, సమస్యలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రజలకు ఏ విధమైన మేలైన పాలన అందించాలి, సమస్యలను ఏ విధంగా అధిగమించాలన్న దానిపై గవర్నర్‌ ఇద్దరు సిఎంలకు ఉద్బోధించారు. వీటి విషయంలో సయోధ్య కుదుర్చుకోవడానికి నేతలు సుహృద్భావ శాంతిపూరిత వాతావరణంలో చర్చలు కొనసాగించారు. మొదట గంట సమయం కేటాయించుకున్నా అది రెండు గంటల వరకు సాగటం శుభపరిణామంగా చెప్పొచ్చు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉద్యోగుల విభజన, విద్యుత్‌, నదీజలాల పంపిణీ, అసెంబ్లీ, సచివాలయాల భవనాల కేటాయింపు, భవిష్యత్‌లో తలెత్తే సమస్యలను ఉమ్మడిగా ఎలా ఎదుర్కోవాలి, అవసరమైతే ఇద్దరం కలిసి వాటి పరిష్కారం కోసం ఢిల్లీవెళ్ళే విషయాలను కూడా నేతలు చర్చించుకున్నారు. అంతే కాకుండా సమస్యలు ఎదురైనప్పుడు పట్టువిడుపులు పాటించాలని కూడా నిర్ణయించుకున్నారు. ప్రతి సమస్యను రాజకీయ కోణంలో చూడకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ద్వారానే పరిష్కారమయ్యేలా చూడాలని నిర్ణయించుకున్నారు. సమస్య జటిలమై పరిష్కారం కష్టతరమైనపుడు ముఖ్యమంత్రులు భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకోవడం శుభపరిణామమని చెప్పవచ్చు.