సమగ్ర సర్వేకు సర్వం సిద్ధం
పట్నం నుంచి పల్లెకు పరుగులు
కేసీఆర్ చెప్పిండు.. మేం పోతున్నాం..
ఖాళీ అయిన హైదరాబాద్
అష్టకష్టాలు పడి పల్లెలకు పాలమూరు వలస జీవులు
హైదరాబాద్, ఆగస్టు18 (జనంసాక్షి) :
సమగ్ర సర్వేకు సర్వం సిద్ధమైంది. కేసీఆర్ చెప్పిండు.. మేం పోతున్నాం.. అంటూ గ్రామీణులు పట్నం నుంచి పల్లెకు పరుగులు తీశారు. దీంతో హైదరాబాద్ ఖాళీ అయ్యింది. అష్టకష్టాలు పడి పాలమూరు వలస కూలీలు పల్లెలకు చేరుకున్నారు. తెలంగాణలోని 10 జిల్లాల్లో సర్వే జాతర మొదలయ్యింది. అందరూ పెట్టాబేడా సర్దుకుని ఊళ్లకు చేరుకుంటున్నారు. మంగళవారం ఒక్కరోజు సర్వే కోసం దూర ప్రాంతాల్లో ఉన్నవారు ఇప్పటికే గ్రామాలకు చేరుకున్నారు. ఇక చుట్టుపక్కల ఉన్నవారు సోమవారం సాయంత్రానికి చేరుకున్నారు. దీంతో పల్లెల్లో సందడి కనిపిస్తోంది. సహజంగా దసరాకు మాత్రమే ఇలా పెద్ద ఎత్తున ఊళ్లకు చేరుకుంటారు. కానీ సర్వే కారణంగా ఇప్పుడు అందరూ పల్లెలకు చేరడంతో గ్రామాలు సందడిగా మారాయి. ప్రయాణికుల రద్దీ కారణంగా బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. సమగ్ర సర్వేలో పాల్గొనడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో సొంతూళ్లకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, రైళ్లు ప్రయాణీకులతో కిటకిటలాడు తున్నాయి. రైల్వేస్టేషన్‌లు, బస్సుస్టాండ్‌లు జనంతో పోటెత్తుతున్నాయి. బస్సులు సరిపోకపోవడంతో ప్రజలు ప్రైవేటు వాహనాలనూ ఆశ్రయిస్తున్నారు. పండుగలకు, పెండ్లిలకు మాత్ర మే ఊళ్లకు పెద్దసంఖ్యలో తరలివెళ్లే జనాలు సర్వే కోసం ఉత్సాహంగా ఉరుకులు పెడుతున్నారు. ఇక పల్లెల్లో డప్పు చాటింపులు వేసి సర్వే గురించి ప్రజలకు చాటుతున్నారు. ఇటు హైదరాబాద్‌లో సర్వేను సమగ్రంగా చేపట్టేందుకు అధికారులు ముందస్తు చర్యల్లో తలమునకలయ్యారు. ఇల్లిల్లూ తిరుగుతూ కరపత్రాల పంపిణీ జోరుగా చేపట్టారు. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకోవడానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఇంటింటా సమగ్ర కుటుంబ సర్వేకు సర్వత్రా ఏర్పాట్లు ముమ్మరంగా చేపట్టారు. కొత్త రాష్ట్రంలో తమ భవిష్యత్తుకు ఈ సర్వే తప్పనిసరని చెప్పడంతో అంతా సొంతూళ్లకు చేరుకున్నారు. దీంతో నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దుల్లో టోల్‌గేట్‌లు, చెక్‌పోస్టుల వద్ద వాహనాల రద్దీ పెరిగింది.
ఇక గ్రామాల్లోనైతే బొడ్డురాయి పండుగ వాతావరణం కనిపిస్తున్నది. సొంతూళ్లకు తరలివస్తుండటంతో పల్లెసీమల్లో పండుగ వాతావరణం కనిపిస్తున్నది. మహారాష్ట్రలోని భీవండి, ముంబై, గుజరాత్‌లోని సూరత్ వంటి ప్రాంతాలకు ఉపాధి కోసం వలసపోయిన వారు కూడా వేలసంఖ్యలో ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఉన్న ఊరిలో పనిలేక బతుకుభారమై పొట్టచేత పట్టుకుని పొరుగు రాష్టాల్రకు వలస వెళ్లి.. అక్కడే స్థిరపడిన చేనేత, భవన నిర్మాణ కార్మికులు, వృత్తి పనుల కుటుంబాలు ఇప్పటికే సొంతూళ్లకు చేరుకున్నారు. సర్వేపై గ్రామాల్లో చర్చలు కూడా మొదలయ్యాయి. గత మూడు రోజులుగా సూరత్, భీమండి నుంచి దాదాపు 15వేల కుటుంబాలు తెలంగాణలోని సొంత గ్రామాలకు చేరుకున్నట్లు అంచనా. సర్వేను విజయవంతం చేయడానికి రాజధాని హైదరాబాద్‌లో విస్తృత ప్రాతిపదికన గ్రేటర్ మున్సిపల్ అధికారుల, సిబ్బంది వాడవాడల్లో ప్రీవిజిట్ నిర్వహించారు. కాలనీలు, బస్తీలను చుట్టివచ్చారు. పాత బస్తీలోని గల్లీగల్లీలోనూ పర్యటించారు. దాదాపు అన్ని ఇండ్లకు స్టిక్కర్లు అంటించారు. సర్వే నమూన పత్రాలను ఇచ్చి కరపత్రాల ద్వారా సర్వే ఆవశ్యకతను వివరించారు. అయితే నగర శివారుల్లో ఇండ్ల సంఖ్య అనూహ్యంగా పెరిగినట్లు గుర్తించారు. సర్వే కోసం 2011జనాభా లెక్కలను ప్రాతిపదిక తీసుకొని.. మరో 15శాతం కుటుంబాలు అదనంగా పెరిగే అవకాశముందని అంచనాతో ప్రివిజిట్ ఏర్పాట్లుచేశారు.అయితే, ఊహించినదానికంటే ఎక్కువగానే ఇండ్లు, కుటుంబాలు పెరుగడంతో అధికారులు, సిబ్బంది అయోమయంలో పడ్డారు. నగర శివార్లలో దాదాపు 20నుంచి 30శాతం వరకు ఇండ్లు పెరిగాయని గుర్తించారు. సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా మంగళవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రైవేట్ సంస్థలు, దుకాణాలు, ¬టళ్లు.. అన్ని మూసి ఉంటాయని అధికారులు చెప్పారు. సర్వే సందర్భంగా సమగ్ర ఏర్పాట్లుచేసిన నేపథ్యంలో ఆ రోజు ఆర్టీసీ బస్సులు, ఆటోలు కూడా సాయంత్రం వరకు నడవవని అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 86,85,000 కుటుంబాల సర్వే కోసం 3,69,729 మంది ఎన్యూమరేటర్లను కేటాయించింది. సర్వేకు జిల్లాల వారిగా ఎన్యూమరేటర్లు రంగంలోకి దిగారు. నల్లగొండలో 9.52 లక్షల కుటుంబాలు- 35 వేల మంది ఎన్యూమరేటర్లు పనిచేస్తున్నారు. నిజామాబాద్‌లో 5.94లక్షల కుటుంబాలు- 28వేల మంది ఎన్యూమరేటర్లు రంగంలోకి దిగారు. ఖమ్మంలో 7.50 లక్షల కుటుంబాలు- 29,300 మంది ఎన్యూమరేటర్లు, కరీంనగర్‌లో 9.76 లక్షల కుటుంబాలు- 33,900 మంది ఎన్యూమరేటర్లు, వరంగల్‌లో 8.86 లక్షల కుటుంబాలు- 43వేల మంది ఎన్యూమరేటర్లు,హబూబ్‌నగర్‌లో 8.69 లక్షల కుటుంబాలు- 39,436 మంది ఎన్యూమరేటర్లు, సిఎం సొంత జిల్లా మెదక్‌లో 6.68 లక్షల కుటుంబాలు- 27,933 మంది ఎన్యూమరేటర్లు, ఆదిలాబాద్‌లో 6.49 లక్షల కుటుంబాలు- 30,160 మంది ఎన్యూమరేటర్లు, సంగారెడ్డిలో 7.41లక్షల కుటుంబాలు- 28వేల మంది ఎన్యూమరేటర్లు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 16లక్షల కుటుంబాలు- 75వేల మంది ఎన్యూమరేటర్లు శిక్షణ పొందారు. వీరంతా మంగళవారం ఇల్లిల్లూ తిరుగుతూ ఇచ్చిన ప్రొఫార్మాతో ఉందుకు సాగుతారు. ఇందుకోసం గ్రామాల్లో ఇప్పటికే చాటింపు వేశారు. కలెక్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇది సాగుతుంది.
ముంపు మండలాల్లో సర్వే ఉపసంహరణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే పోలవరం ముంపు మండలాల్లో నిలిచిపోయింది. ఖమ్మం జిల్లాలోని కూనవరం, వరరామచంద్రాపురం, చింతూరు, వేలేరుపాడు, కుక్కునూరు, భద్రాచలం (పట్టణం మినహా)మండలాలు ఆంధప్రదేశ్‌కు బదలాయించడంతో ఈ సర్వే నిలిపివేసినట్లు అధికారిక సమాచారం. దీంతో ముంపు మండలాల్లో నెలకొన్న గందరగోళానికి తెరపడింది.
ఆర్టీసీ బస్సులు నడుస్తాయి : సమగ్ర కుటుంబ సర్వే కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ఆగస్టు 19న ఆర్టీసీ సేవలు అందిస్తుందని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. బస్సులు గ్రామాలకు వెల్లే వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేశామన్నారు.
కిటకిటలాడిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహించ తలపెట్టిన సమగ్ర సర్వే కోసం ప్రజలు తమ స్వస్థలాలకు తరలివెళ్తున్నారు. దీంతో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో ప్రయాణికులు రద్దీ అధికంగా ఉంది. జంటనగరాల్లోని ప్రధాన బస్టాండ్లన్నీ ప్రయాణికులతో రద్దీగా మారాయి. ప్రయాణికుల కోసం ప్రభుత్వం జిల్లాకు 70 బస్సులను ఏర్పాటుచేసినప్పటికీ అవి సరిపోక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. సర్వేకు వెళ్లకపోతే సర్వం కోల్పోతామనే ఆందోళనతో, వారంతా బారులు కడుతున్నారు. అదీగాక సర్వే రోజున రోడ్డు రవాణా వ్యవస్థని బంద్ పెడతామన్న సర్కారు ప్రకటనతో వారం రోజులుగా హైదరాబాద్‌కు, తెలంగాణకు దారితీసే అన్ని దారులూ, వాహనాలూ కిక్కిరిసిపోతున్నాయి. అనూహ్యంగా పెరిగిన ఈ రద్దీని ప్రైవేట్ ట్రావెల్స్ కాష్ చేసుకుంటున్నాయి. మామూలు రోజుల్లో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ఆపరేటర్లు రూ.700 వసూలు చేస్తారు. ఇప్పుడు ఇదే రూటులో రెండు వేల నుంచి రూ.మూడు వేలు గుంజుతున్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు ప్రాంతాల నుంచి వస్తున్న బస్సుల్లో వాస్తవ టికెట్ ధరకు మూడు రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు. మూటలు వేసుకొని.. తినీతినక, పిల్లలతో సతమతం అవుతున్న జనం హైదరాబాద్‌లోని బస్టాండ్‌ల్లో కనిపిస్తున్నారు. అడ్డంగా పెరిగిన టికెట్ ధరలు చూసి ఆశ్చర్యపోతున్నారు. సాధారణ టికెట్‌పై ఒకటిన్నర రెట్లు బస్సులో వసూలు చేస్తున్నారు. ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే, ప్రైవేటు వాహనాల్లా తాము మూడు రెట్లు పెంచలేదని చెబుతున్నారు. వంద రూపాయల టికెట్‌ను రూ.150కి పెంచామని వివరిస్తున్నారు. స్పెషల్ బస్సులు వేసినప్పుడు ధర ఆ మాత్రం ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మంగళవారం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే.. ఎక్కడెక్కడి తెలంగాణ ప్రజలను స్వస్థలాలకు తీసుకొస్తున్నది. వీరిలో ఎక్కువమంది కూలీనాలీ పనుల కోసం ఊరు వదిలిపెట్టారు. ఎక్కడెక్కడో బతుకుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దరిమిలా, తమకు వలస కష్టాలు తప్పుతాయని ఆశ పడుతున్నారు. వారి ఆశలన్నింటినీ ప్రభుత్వం సర్వేతో ముడిపెట్టింది. దాంతో ప్రైవేట్ ట్రావెల్స్‌ని కాదని ఆర్టీసీ బస్సులు ఎక్కుతున్నవారి పరిస్థితి.. పెనంపైనుంచి పొయ్యిలో పడినట్టుంది. రైళన్నీ కిక్కిరిసిపోతుండటంతో.. ఎర్రబస్సే దిక్కవుతోంది. /ూజధానిలో సర్వే తాకిడి తారస్థాయికి చేరింది. ఇప్పటికే చాలావరకూ ఊళ్లకు చేరిపోగా, సెలవులు దొరకకపోవడం వల్ల, పిల్లల చదువుల వల్ల ఆగిపోయిన వాళ్లు కూడా పెద్ద ఎత్తున ప్రయాణం కడుతున్నారు. బస్తీలు, కాలనీలు దాదాపుగా ఖాళీ అయిపోతున్నాయి. ఒక అంచనా ప్రకారం, సర్వే నాటికి నగరం సగం ఖాళీ కానున్నది. దీంతో పలు స్టేషన్లు, రైల్వే స్టేషన్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఇదే అదునుగా ప్రైవేట్ ఆపరేటర్లు, ఆర్టీసీ బస్సులు పోటీపడి, జనా న్ని కుదేలు చేస్తున్నాయి. కాగా, సోమవారం తెలంగాణ జిల్లాలకు మరో 420 ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపారు.