ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం

C

పెట్టుబడిదారులకు కేసీఆర్‌ ఆహ్వానం

హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి) : ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. సింగపూర్‌లో జరిగిన సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం అవినీతిరహితంగా వుంటుందని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు. అవినీతి ఏ స్థాయిలో వున్నా సహించే ప్రసక్తే లేదన్నారు. సింగపూర్‌ పర్యటనలో భాగంగా ఇంపాక్ట్‌-2014 సదస్సులో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అవకాశాలు – సవాళ్లు అనే అంశంపై కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని సీఎం కేసీఆర్‌ వివరించారు. ఏదో భూములు కేటాయించాం.. విూరే పరిశ్రమలను నెలకొల్పుకోండి అనేది మా విధానం కాదని, గత పాలకులు ఆ విధానాన్ని అనుసరించారు. కానీ మేం ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంగా ఇండస్టియ్రల్‌ జోన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా సింగిల్‌ విండో విధానంలో అనుమతులు ఇస్తామని అన్నారు.  ఫార్మా, ఎలక్టాన్రిక్‌, ఆటోమొబైల్‌, డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ తదితర అన్ని రంగాలకూ ఇదే పద్ధతి ఉంటుందన్నారు. పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైతే చాలు. స్థలాన్ని చూపి వెంటనే పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉత్పత్తులు ఆరంభించేటట్లుగా తెలంగాణ పారిశ్రామిక విధానం ఉంటుంది అని ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. ప్రతి పెట్టుబడిదారుడికి విశ్వాసాన్ని చూపిస్తామన్నారు. జీరో కరప్షన్‌ ఉంటుంది అని సీఎం హావిూ ఇచ్చారు. తెలంగాణకు దేశంలోని అన్ని ప్రాంతాలతో అద్భుతమైన కనెక్టివిటీ ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు కూడా జాతీయ రహదారులతో అనుసంధానమై ఉన్నాయి. అందుకే అభివృద్ధి, పారిశ్రావిూకరణ ఒకే దగ్గర కేంద్రీకృతం కాకుండా చర్యలు చేపట్టాం. జిల్లాల్లోనూ సమాన అభివృద్ధికి బాటలు వేస్తున్నాం. పారిశ్రామికవాడలు కూడా అన్ని ప్రాంతాల్లోనూ ఉంటాయని వివరించారు.  ఫార్మాతో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు కూడా తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఇలాంటి సిటీలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే ఆలోచన ఉందన్న సీఎం ఈ రంగంలో పారిశ్రామికవేత్తలకు స్వాగతం పలికారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ పటిష్ట పరుస్తున్నామని సీఎం చెప్పారు. హైదరాబాద్‌లో రూ.300కోట్లతో ఆధునిక వాహనాలు, ఇతర పరికరాలను సమకూర్చి భద్రతను ఆధునీకరించినట్లు చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, సింగపూర్‌లో ఆచరణలో ఉన్న చట్టాలను తెలంగాణలోనూ అమలు చేస్తామని ప్రకటించారు.