పోరు ఫలించింది.. కేంద్రం వెనక్కి తగ్గింది
హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనం ఉండదు
‘సుప్రీం’ మార్గదర్శకాల మేరకే నడుచుకోండి
గవర్నర్‌కు మోడీ స్పష్టమైన ఆదేశాలు
న్యూఢిల్లీ, ఆగస్టు 23 (జనంసాక్షి) : తెలంగాణ ప్రభుత్వం పోరు ఫలించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖ, లోక్‌సభ లోపల, బయట టిఆర్‌ఎస్ ఎంపీలు చేసిన పోరాటంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ‘నాయుళ్ళ’ కుట్రకు తలొగ్గి హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనానికి కేంద్ర హోంశాఖ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ అందిన విషయం తెలిసిందే. ఈ కుట్రను టిఆర్‌ఎస్ ప్రభుత్వం సమర్థంగా తిప్పికొట్టింది. ఈమేరకు ప్రధాని మోడీ నుంచి గవర్నర్‌కు నర్సింహన్‌కు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర జోక్యం ఎట్టిపరిస్థితుల్లో ఉండబోదని, కేంద్ర హోంశాఖ రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు స్పష్టంచేసింది. హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు అప్పగిస్తూ.. కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గరవ్నర్ నరసింహన్ ఢిల్లీ వెళ్ళడం ఆసక్తికరంగా మారింది. గత మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన గవర్నర్ హోంశాఖ అధికారులు.. ప్రధానిని కూడా కలుసుకున్నారు. అయితే ప్రధాని నరేంద్రమోడీని కలుసుకున్న సందర్భంలో నరసింహన్‌కు ప్రధాని నరేంద్రమోడీ పలుసూచనలు చేసినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కార్యక్రమాలలో గవర్నర్ కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసినట్లు తెలిసింది. పోలీసు బదిలీలకు సంబంధించి పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ కమిటీయే చూసుకుంటుందని ప్రధాని నరేంద్రమోడీ చెప్పినట్లు తెలుస్తోంది. శాంతిభద్రతలపై గవర్నర్‌కు అధికారాలంటూ వస్తున్న వార్తలు కేవలం అపోహలేనని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ఆదేశాలకు అనుగుణంగానే గవర్నర్ అధికారాలు ఉంటాయి తప్ప తెలంగాణ రాష్ట్ర వ్యవహరాలలో గవర్నర్ జోక్యం కానీ.. కేంద్ర జోక్యం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉండబోదని హోంశాఖ అధికారులు గవర్నర్‌కు స్పష్టంచేసినట్లు సమాచారం. హైదరాబాద్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదని, ఏ నిర్ణయం తీసుకున్నా.. తెలంగాణ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలే తప్ప, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు ఉండబోవన్న విషయం కూడా కేంద్రం స్పష్టం చేసినట్లు సమాచారం. కేసిఆర్ జూన్ 2న అధికారం చేపట్టిన తరువాత కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించారు. పోలీవరం ముంపు పేర ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కలపడాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ తీవ్రంగా ఖండించడమే కాకుండా ఈ విషయంపై పార్లమెంటులో టిఆర్‌ఎస్ ఎంపీలు కేంద్రాన్ని నిలదీశారు. హైదరాబాద్ శాంతిభద్రతల వ్యవహారాన్ని గవర్నర్‌కు అప్పగిస్తామంటూ.. కేంద్ర హోంశాఖ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. గవర్నర్ అధికారాలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమంటూ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఆ తరువాత ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్రమోడీపై పెద్దఎత్తున విమర్శలు గుప్పించారు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. అనంతరం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సామరస్య వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను చర్చలకు ఆహ్వానించారు. చర్చల ద్వారా ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతారవరణానికి ఫుల్‌స్టాప్ పెట్టగలిగారు. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని, పరస్పరం సహకరించుకోవాలని ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ వ్యవహార శైలిలో కూడా తీవ్రమైన మార్పు కనిపించింది. కేంద్రంపై స్వరం మారింది. కేంద్రంతో సైతం సంధికి దిగివచ్చారు. దీంతో కేంద్రం కూడా ఒకింత శాంతియుతంగా మారింది. దీంతో తెలంగాణ శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్‌కు అప్పగించాలన్న కేంద్ర నిర్ణయంలో కొంత తీవ్రతరం తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగనున్నందున ఇక్కడ సీమాంధ్రుల భద్రతకై హైదరాబాద్‌పై అధికారాన్ని గవర్నర్‌కు అప్పగించాలని, విభజన బిల్లులోనే అప్పటి కేంద్రంలో యూపిఏ ప్రభుత్వం పొందుపరిచింది. దానికి అనుగుణంగానే తాము నిర్ణయం తీసుకుంటున్నాము తప్ప, ఎన్డీయే ప్రభుత్వ కొత్తగా చేసిందేమీ లేదంటూ.. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అటు పార్లమెంటులోనూ.. ఇటు బయట ఇప్పటికే పలుసార్లు స్పష్టంచేశారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ స్వరంలో మార్పు రావడంతో కేంద్రం సైతం చట్టం అమలులో కొంత వెసులుబాటు కల్పించాలనే యోచనలో ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వ ఆగ్రహాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సైతం ఒకడుగు దిగివచ్చినట్లు తెలుస్తోంది.