సింగపూర్ భూతల స్వర్గం
సింగపూర్, మలేషియాలు మనకు ఆదర్శం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
హైదరాబాద్, ఆగస్టు 25 (జనంసాక్షి) : సింగపూర్ భూతల స్వర్గమని, ఈ పర్యటన తనకు అద్భుతమైన అనుభూతిని కలిగించిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. సింగపూర్, మలేషియాలు అభివృద్ధిలో మనకు ఆదర్శమని చెప్పారు. తొలి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన సోమవారం విూడియాతో మాట్లాడారు. ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఎలా అభివృద్ధి చెందవచ్చో సింగపూర్ నిరూపించిందన్నారు. ఆర్థికాభివృద్ధిలో అగ్రరాజ్యమైన అమెరికా సరసన సింగపూర్ నిలిచిందని కేసీఆర్ పేర్కొన్నారు. మంచినీరు సహా ప్రతి వస్తువును సింగపూర్ దిగుమతి చేసుకోవాల్సిందేనని చెప్పిన ఆయన సింగపూర్ ప్రభుత్వ విధానాలు, ప్రజల భాగస్వామ్యం అద్భుతమన్నారు. భూ సమస్యను సింగపూర్ చాలా తెలివిగా పరిష్కరించిందన్నారు. వారి పనితీరు తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. అక్కడ అభివృద్దిని అధ్యయనం చేసేందుకు ప్రతిఒక్కరూ వెళ్లాల్సి ఉందన్నారు. త్వరలో ప్రజాప్రతినిధులందరినీ సింగపూర్ పంపాలనే ఆలోచన ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అభివృద్ధి విషయంలో మన నేతలకు శిక్షణ ఇవ్వాలని సింగపూర్ ప్రధానిని కోరినట్లు ఆయన తెలిపారు. సింగపూర్ తొలి ప్రధాని లీక్‌వాన్ యూ రాసిన పుస్తకం తెలుగులోకి అనువదించాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సింగపూర్‌లోని అన్ని రంగాల ప్రగతిపై అధ్యయనం చేశానని కేసీఆర్ చెప్పారు. సింగపూర్‌లోని ఐఐఎం పూర్వ విద్యార్థుల ఆహ్వానం మేరకు కెసిఆర్ ఈ నెల 19న బయలుదేరి వెళ్ళిన విషయం తెలిసిందే. ఆయన తనతోపాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, సీఎంఓ ఉన్నతాధికారుల బృందాన్ని తీసుకెళ్లారు. పర్యటనను పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించటానికి వినియోగించుకున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఇప్పటికే ప్రకటించిన ఆయన పనిలోపనిగా వివిధ రంగాల్లో అభివృద్ధి చెందిన సింగపూర్, మలేషియా దేశాల్లోని క్షేత్ర స్థాయి స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇందులో భాగంగా ఆయన తన పర్యటన మొదటి రోజైన ఈ నెల 20న సింగపూర్‌లో అక్కడి జేటీసీ కార్యాలయాన్ని సందర్శించారు. 21న పెట్టుబడిదారులతో సమావేశమయ్యారు. 22న ఐఐఎం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. 23న సింగపూర్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు కారులో ప్రయాణించి మార్గమధ్యన ఉన్న శాటిలైట్ టౌన్‌షిప్స్‌ను పరిశీలించారు. పర్యటనలో చివరి రోజు ఆదివారం మలేషియా మోనో రైల్ ప్రాజెక్టు, పుత్రజయ ప్రాంతాన్ని పరిశీలించారు. క్షేత్రస్థాయి పరిస్థితుల అధ్యయనాన్ని పక్కన పెడితే, సీఎం కేసీఆర్ పర్యటనలో పెట్టుబడిదారులతో సమావేశం, ఐఐఎం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న కార్యక్రమాలే కీలకమైనవి. పెట్టుబడులు ఆకర్షించటానికి తాము అమలు చేయబోయే కొత్త పారిశ్రామిక విధానాన్ని కేసీఆర్ సింగపూర్, మలేసియా దేశాల్లోని పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఏమాత్రం అవినీతి, జాప్యం లేకుండా ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతామన్నారు. శాంతిభద్రతలకు కూడా అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, తమ పారిశ్రామిక విధానం దేశంలోనే అత్యుత్తమంగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, ప్రత్యేకించి హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని తలపోస్తున్న సీఎం కేసీఆర్‌కు సింగపూర్, మలేసియా దేశాల పర్యటన బాగా ఉపయోగపడుతుందని విశ్లేషిస్తున్నారు.