మహారాష్ట్ర గవర్నర్‌గా సిహెచ్.విద్యాసాగర్‌రావు
రాజ్యాంగబద్ధ పదవికి వన్నె తెస్తా
నిష్పక్షపాతంగా నడుచుకుంటా : చెన్నమనేని
హైదరాబాద్, ఆగస్టు 26 (జనంసాక్షి) : మహారాష్ట్ర గవర్నర్‌గా సిహెచ్.విద్యాసాగర్‌రావు నియమితులయ్యారు. వివాదాలకు దూరంగా, సౌమ్యుడిగా పేరొందిన ఆయనకు కీలక పదవి లభించింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన చెన్నమనేని విద్యాసాగర్‌రావు మహారాష్ట్ర గవర్నరుగా నియమితులైన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం బిజెపి పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనసన్మానం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి, పలువురు నేతలు విద్యాసాగర్‌రావును సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవర్నరుగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తానన్నారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు ఆయన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో సీనిర్లకు, కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందని ఈ నియామకంతో పార్టీ రుజువు చేసిందని కిషన్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బద్దం బాల్‌రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన ఆయనకు బీజేపీ రాజ్యాంగ బద్ద పదవిని కట్టబెట్టింది. మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించింది. ఎవరూ ఊహించని రీతిలో ఆయనకు పదవి లభించింది. గవర్నర్లుగా నియమితులవుతారని చాలామంది పేర్లు ప్రచారంలోకి వచ్చినా.. ఎక్కడా చెన్నమనేని పేరు వినబడలేదు. అసలు ఆయన పేరు కూడా పరిశీలనలో ఉందని ఎవరికీ తెలియదు. అనూహ్యంగా విద్యాసాగరరావుకు కేంద్రం గవర్నర్‌గిరి కట్టబెట్టింది. మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న ముచ్చటగా మూడో తెలుగు వ్యక్తి విద్యాసాగరరావు. ఇప్పటికే ఇద్దరు తెలుగు వారు మహారాష్ట్ర గవర్నర్లుగా పని చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత., బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన ప్రభాకరరావు మహారాష్ట్ర గవర్నర్ పదవిని చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి. దాదాపు ఏడాది కాలం ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఆ పదవిని అలంకరించిన రెండో వ్యక్తి. రెండేళ్ల పాటు ఆయన గవర్నర్‌గా కొనసాగారు. దాదాపు రెండు దశాబ్దాల అనంతరం మరాఠా ప్రాంతంలో గవర్నర్ సీటుపై అధిష్టించబోతున్న వ్యక్తి చెన్నమనేని.
కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో ఫిబ్రవరి 4, 1942లో విద్యాసాగరరావు జన్మించారు. శ్రీనివాసరావు, చంద్రమ్మల దంపతులకు పెద్ద కుమారుడైన ఆయన వేమలువాడలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. హైదరాబాద్‌లో పీయూసీ, నాందెడ్‌లో బీఎస్సీ చదివారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన చెన్నమనేని.. 1973 నుంచి లా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ కాలంలో ఆయన జైలుకు వెళ్లారు. జనసంఘ్‌లో చేరిన ఆయన బీజేపీ తరఫున మెట్‌పల్లి నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985 నుంచి 1998 వరకు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 1998లో తొలిసారిగా ఎంపీగా కరీంనగర్ నియోజకవర్గం నుంచి గెలిచారు. కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రిగా, వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా వ్యవహరించారు. విద్యాసాగరరావు సోదరులలో చెన్నమనేని రాజేశ్వరరావు మాజీ కమ్యూనిస్టు నేత కాగా, మరో సోదరుడు చెన్నమనేని హనుమంతరావు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చాన్సలర్‌గా పనిచేశారు. మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగరరావుకు అభినందనలు వెల్లువెత్తాయి. విద్యాసాగర్‌ను గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించడంతో కరీంనగర్‌లో బీజేపీ నాయకులు, పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకొన్నాయి. తెలంగాణ చౌక్‌లో టపాసులు పేల్చి, మిఠాయిలు పంచి సందడి చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యాసాగరరావు నిజాయతీని గుర్తించి మహారాష్ట్రకు గవర్నర్‌గా నియమించిడం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. ఆయనను అభినందించేందుకు పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలు విద్యాసాగరరావు నివాసానికి తరలివచ్చారు. తెలుగు బిడ్డకు సముచిత స్థానం దక్కడంపై పార్టీ నేతలు హర్షం వ్యక్తంచేశారు.