కళంకిత మంత్రులపై మీ ఇష్టం

2

ప్రధాని, ముఖ్యమంత్రుల విచక్షణకు వదిలిన ‘సుప్రీం’

న్యూఢిల్లీ, ఆగస్టు 27 (జనంసాక్షి) : కళంకిత మంత్రుల కొనసాగింపుపై నిర్ణయాన్ని ప్రధాని, ముఖ్యమంత్రులకే సుప్రీంకోర్టు వదిలేసింది. అవినీతి, ఆరోపణలు, నేరాభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రులపై అనర్హత వేటు వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు నేరచరిత కలిగిన వాళ్లను మంత్రివర్గంలోకి తీసుకోవడం సరికాదని న్యాయస్థానం సూచించింది. ప్రధాని, ముఖ్యమంత్రులపై రాజ్యాంగపరంగా గురుతర బాధ్యతలు ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నేరచరిత ఉన్న వాళ్లు మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించడం సరికాదని పేర్కొంది. క్యాబినెట్‌లో నేర చరితులను తప్పించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం బుధవారం దాన్ని కొట్టివేసింది. నేరాభియోగాలు ఉన్న మంత్రులు బాధ్యతలు నిర్వర్తించడం సరికాదన్న కోర్టు.. వారిని తొలగించాలంటూ తీర్పునివ్వడం రాజ్యాంగ వ్యతిరేకమని వ్యాఖ్యానించింది. అందువల్ల నేరాభియోగాలు ఉన్న మంత్రులపై అనర్హత వేటు వేయడం కుదరదని స్పష్టం చేసింది. నేర చరితులు మంత్రివర్గంలో ఉండాలా.. లేదా? అనేది ప్రధాని, ముఖ్యమంత్రుల విచక్షణకే వదిలివేస్తున్నామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ప్రధాని, ముఖ్యమంత్రులపై రాజ్యాంగ పరంగా గురుతర బాధ్యతలు ఉన్నాయని కోర్టు గుర్తుచేసింది. ప్రధాని రాజ్యాంగానికి ట్రస్టీ లాంటి వారని.. ఆయన రాజ్యాంగబద్దంగానే వ్యవహరిస్తారని భావిస్తున్నట్లు చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎం లోధాతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. నేరచరిత కలిగిన వాళ్లను మంత్రులుగా నియమించవద్దని ప్రధానికి సూచించింది. ఆర్టికల్‌ 75 ప్రకారం మంత్రి మండలిలో ఎవరు ఉండాలి.. ఎవరు ఉండకూడదనే దానిపై ఎలాంటి పరిమితులు లేవని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రులుగా నేరచరితులపై అనర్హత వేటు వేయలేమని తెలిపారు. రాజకీయాలను నేరమయం చేయడం వల్ల ప్రజాస్వామ్యం పట్ల, వ్యక్తుల పట్ల ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రధాని నుంచి రాజ్యాంగ నిబద్దత, మంచి పాలన ఆశిస్తున్నట్లు తెలిపింది. నేరచరితులను మంత్రులుగా నియమించుకోవడంపై విచక్షణాధికారాన్ని ప్రధానికే వదిలేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. ప్రజాస్వామ్యంపై ప్రజలు నమ్మకం కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రధానిదేనని.. జాతి ప్రయోజనాల కోసం నేరచరితులను దూరంగా ఉంచాలని సూచించింది. అవినీతి, నేర చరిత ఉన్న వారిని మంత్రివర్గం నుంచి తప్పించాలని 2005లో మనోజ్‌ నరులా అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పటి క్యాబినెట్‌ నుంచి లాలూప్రసాద్‌ యాదవ్‌, మహమ్మద్‌ తస్లీముద్దీన్‌, ఎంఏఏ ఫాత్మీ, జైప్రాకశ్‌ యాదవ్‌లను తప్పించాలని తన పిటిషన్‌లో కోరారు. అయితే, ఆర్టికల్‌ 75 ప్రకారం ఒక మంత్రిని అనర్హతకు గురిచేసే అవకాశం లేదని కేంద్రం వాదించింది. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న రాజ్యాంగ ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. రాజకీయాలను నేరమయం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని పేర్కొంది. చార్జిషీట్‌లో ఉన్న వారిని మంత్రులుగా తీసుకోవద్దని ప్రధాని, సీఎంలకు సూచించింది.