పాక్‌కు చెక్‌..

చీనాబ్‌పై భారీ జలవిద్యుత్తు ప్రాజెక్టు ‘సావల్‌కోట్‌’ పునరుద్ధరణ
శ్రీనగర్‌(జనంసాక్షి): సింధూ జలాల ఒప్పందం నిలిపివేత తర్వాత జమ్మూ కశ్మీర్‌లో పలు కీలక ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన భారత ప్రభుత్వం భారీ జలవిద్యుత్తు ప్రాజెక్టు పునరుద్ధరణకు సిద్ధమవుతోంది.చీనాబ్‌ నదిపై గతంలో నిలిపివేసిన సావల్‌కోట్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి నేషనల్‌ హైడ్రోఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఇటీవల అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించింది. ఇటీవలే తుల్‌బుల్‌ ప్రాజెక్టు పునరుద్ధరణ చర్యలు చేపట్టగా, తాజాగా భారీ జలవిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం నడుం బిగించింది. కశ్మీర్‌లోని చీనాబ్‌ నదిపై సావల్‌కోట్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదన 1980ల నుంచే ఉంది. దీనిపై పాకిస్థాన్‌ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో దాదాపు 40 ఏళ్లుగా పక్కన పెట్టాల్సి వచ్చింది. అయితే, ఇటీవల సింధూ జలాల ఒప్పందం అమలు నిలిపివేయడం.. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు లేకపోవడంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. 1856 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ.22 వేల కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. రెండు దశల్లో దీన్ని నిర్మించనున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టును జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం దశాబ్దం క్రితమే మొదలుపెట్టగా.. కొంత ఖర్చు కూడా చేసినట్లు సమాచారం. 2021లో కేంద్రం జోక్యం చేసుకుని ఎన్‌హెచ్‌పీసీని భాగస్వామ్యం చేయడంతోపాటు పలు కీలక ఒప్పందాలను చేసుకుంది. అంతర్జాతీయ బిడ్డింగ్‌కు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు చర్యలు చేపట్టింది. చివరగా పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి అనుమతులు కూడా రావడంతో ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. సింధూ జలాల ఒప్పందం ప్రకారం.. పశ్చిమదిశగా పాకిస్థాన్‌ వైపు ప్రవహించే సింధూతోపాటు చీనాబ్‌, జీలం వంటి ప్రధాన ఉప నదులపై భారత్‌కు పరిమిత అధికారాలు ఉన్నాయి. దీంతో భారీ స్థాయిలో నీరు నిల్వ చేసే అవకాశం లేకుండా పోయింది. ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించాలన్నా.. పాక్‌కు ముందస్తు నోటీసు ఇవ్వాలి. తాజాగా ఆ ఒప్పందం నిలిచిపోవడంతో ఎటువంటి అనుమతులు, సమాచారం పంచుకోవడం అవసరం లేదు.