పాక్ నుంచి భారత్ చమురుకొనే రోజులొస్తాయ్
` అందుకు అమెరికా సాయం చేస్తుంది
` భారత్`రష్యాలు తమ డెడ్ ఏకానమీలను మరింత పతనం చేసుకుంటున్నాయి
` ఆ రెండు దేశాలు ఏ వ్యాపారం చేసుకున్నా నాకు అవసరం లేదు
` మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్(జనంసాక్షి): పహల్గామ్ ఉగ్ర ఘటన తరువాత భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఇప్పుడు వీటికి ఆజ్యం పోసేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్నారు.తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు భారత్‌కు ఆగ్రహాన్ని తెప్పించేలా ఉన్నాయి. ఏదో ఒకరోజు భారత్‌కు పాకిస్తాన్ చమురు అమ్ముతుందని, అందుకు తాము పాక్‌కు సాయం చేస్తామని ట్రంప్ వ్యాఖ్యానించారు.భారత్‌పై 25శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించిన కొన్ని గంటలకు ట్రంప్ మరోమారు భారత్- పాక్ మధ్య చిచ్పుపెట్టే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చమురు నిల్వలను భారీగా అభివృద్ధి చేసేందుకు పాకిస్తాన్ తాజాగా అమెరికాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుక్నునదని, అయితే ఈ భాగస్వామ్యానికి ఏ కంపెనీ సారధ్యం వహించాలనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదని ట్రంప్ పేర్కొన్నారు. బహుశా పాకిస్తాన్ ఏదో ఒక రోజు భారతదేశానికి చమురు అమ్మే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ ద్వారా ఈ ప్రకటన చేశారు. తాము పాకిస్తాన్‌తో ఒక ఒప్పందాన్ని ముగించామని, ఈ మేరకు పాకిస్తాన్- యునైటెడ్ స్టేట్స్ సంయుక్తంగా చమురు నిల్వలను భారీగా అభివృద్ధి చేయడంలో కలిసి పనిచేస్తాయన్నారు. ఇదే పోస్ట్‌లో ట్రంప్.. అమెరికాను చాలా సంతోషపెట్టాలని కోరుకునే పలు దేశాల నేతలతో మాట్లాడానని పేర్కొన్నారు. కొన్ని దేశాలు సుంకాల తగ్గింపు కోసం అమెరికాకు ఆఫర్లు ఇస్తున్నాయని, ఇది దేశ వాణిజ్య లోటును భారీగా తగ్గిస్తుందని పేర్కొన్నారు.తాము వైట్ హౌస్ లో వాణిజ్య ఒప్పందాలపై కసరత్తు చేస్తూ చాలా బిజీగా ఉన్నామని, ఈరోజు మధ్యాహ్నం దక్షిణ కొరియా వాణిజ్య ప్రతినిధి బృందాన్ని కలుస్తానన్నారు. దక్షిణ కొరియా ప్రస్తుతం 25శాతం సుంకాలను కలిగివుందని, అయితే వారు ఆ సుంకాలను తగ్గించే ప్రతిపాదనతో ఉన్నారని, అందుకు వారు ఇచ్చే ఆఫర్ ఏమిటో వినడానికి తాను ఆసక్తిగా ఉన్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారతదేశంపై 25 శాతం సుంకాలు విధించనున్నామని, అయితే ఇరు దేశాల మధ్య ఇంకా చర్చలు నడుస్తున్నాయని, ఈ వారం చివరి నాటికి సుంకాల విషయంలో స్పష్టత వస్తుందని ట్రంప్ వివరించారు.
భారత్`రష్యాలు తమ ఆర్థిక వ్యవస్థలను పతనం చేసుకుంటున్నాయి
మిత్రదేశం అంటూనే భారత దిగుమతులపై 25 శాతం సుంకం విధించిన ట్రంప్.. మరో బాంబ్ పేల్చారు. భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేయడమే అందుకు కారణమని కూడా ఆయన అన్నారు.ఈ తరుణంలో భారత్-రష్యా బంధంపైనా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను మరింత పతనం చేసుకుంటున్నాయని అన్నారాయన. భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. ఆ రెండు దేశాలు ఏ వ్యాపారం చేసుకున్నా నాకు సంబంధం లేదు. కాకుంటే వారి ఆర్థిక వ్యవస్థను ఆ దేశాలు మరింత పతనం చేసుకుంటున్నాయి అని వ్యాఖ్యానించారాయన. న్యూఢల్లీితో చాలా తక్కువ వ్యాపారం చేస్తున్నామన్న ఎందుకంటే భారత్ అత్యధికంగా సుంకాలు విధిస్తుందని, ఇది ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని ఆరోపించారాయన. ఈ సందర్భంగా..రష్యా, యూఎస్‌లు కలిసి ఎలాంటి వ్యాపారం చేయట్లేదని ట్రంప్ స్పష్టంచేశారు. అలాగే రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్‌పై విరుచుకుపడ్డారు. ‘’మెద్వెదేవ్ ఓ విఫల నేత. ఆయన ఇప్పటికీ తానే అధ్యక్షుడిని అనుకుంటున్నారేమో. ఆయన మాటలను చూస్తే అలాగే అనిపిస్తోంది. ఆయన ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నారు’’ అని ట్రంప్ హెచ్చరికలు చేశారు.భారత్ మిత్రదేశమే అయినా.. సుంకాలు ఎక్కువగా ఉన్నందున వారితో పరిమిత స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నాం. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి. ఏ దేశంలో లేని విధంగా వాణిజ్యపరంగా అక్కడ అడ్డంకులున్నాయి. రష్యా నుంచి భారీ స్థాయిలో సైనిక ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్‌పై దాడులను ప్రపంచమంతా ఖండిస్తోంది. భారత్, చైనాలు మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. అందుకే భారత్‌పై 25శాతం సుంకాలు అదనంగా పెనాల్టీ కూడా విధిస్తున్నాం. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి అని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నిర్ణయంపై భారత ప్రభుత్వం స్పందిస్తూ.. ద్వైపాక్షిక వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను గమనించాం. సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నాం. రైతులు, వ్యాపారవేత్తలతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. బ్రిటన్‌తో ఇటీవల కుదుర్చుకున్న ‘ఎఫ్‌టీఏ’ సహా ఇతరత్రా వాణిజ్య ఒప్పందాల మాదిరిగానే.. ఈ వ్యవహారంలోనూ జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం అని ఓ ప్రకటనలో పేర్కొంది.ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో ట్రంప్ రష్యాకు అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. మరో 10, 12 రోజుల్లో శాంతి ఒప్పందానికి పుతిన్ గనుక ముందుకు రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. అయితే ట్రంప్ ‘అల్టిమేటం గేమ్’ యుద్ధానికి దారి తీస్తుందని దిమిత్రి మెద్వెదేవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని అయిన మెద్వెదేవ్.. ప్రస్తుతం రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌కు డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు. ట్రంప్ జారీ చేసే ప్రతీ అల్టిమేటం యుద్ధం వైపునకు అడుగుగా మారుతుంది. ఇది ఉక్రెయిన్ రష్యా మధ్య కాదు.. అమెరికాతోనే అంటూ సోషల్ మీడియాలో ఆయన ఓ ఘాటు పోస్ట్ చేశారు.