ఎవరో చెబితే ఆపరేషన్‌ సిందూర్‌ ఆపలేదు

` ట్రంప్‌ ఒత్తిడి మాపై లేదు
` బుల్లెట్‌కు బుల్లెట్టే సమాధానమని జేడీ వాన్స్‌తో స్పష్టం చేశాం
` పాక్‌కు ఎవరూ సహాయం చేసినా ఊరుకొనేది లేదని చెప్పాం
` కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు
` ఆపరేషన్‌ సిందూర్‌కు 190 దేశాల మద్దతిచ్చాయి
` పాక్‌ను కాంగ్రెస్‌ వెనకేసుకురావడం దౌర్భాగ్యం
` పాక్‌ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా దీటుగా బదులిస్తాం
` ఉగ్రవాదులను మట్టిలో కలిపినందుకు భారత్‌ విజయోత్సవాలు చేసుకుంటోంది
` ‘ఆపరేషన్‌ సిందూర్‌పై లోక్‌సభలో వివరణ ఇచ్చిన ప్రధాని మోదీ
న్యూఢల్లీి(జనంసాక్షి): ఉగ్రవాదులను మట్టిలో కలిపినందుకు భారత్‌ విజయోత్సవాలు చేసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతం కావడం, భారత సేనల శౌర్య, ప్రతాపాల ప్రదర్శన తర్వాత విజయోత్సవాలు చేసుకుంటున్నామన్నారు. 140 కోట్ల భారతీయుల ఐక్యత, ఇచ్ఛాశక్తి ఫలాలతో భారత్‌ విజయోత్సవాలు చేసుకుంటోందని తెలిపారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై లోక్‌సభలో వాడీ వేడిగా జరిగిన చర్చకు సమాధానంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. కాల్పుల విరమణలో అమెరికా పాత్రను మరోసారి తోసిపుచ్చిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్‌, విపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘’ఆపరేషన్‌ సిందూర్‌ ఆపాలని ప్రపంచంలో ఏ నేత కూడా మాకు చెప్పలేదు. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ నాతో ఫోన్‌లో మాట్లాడారు. పాక్‌ భారీగా దాడి చేయబోతోందని ఆయన హెచ్చరించారు. పాక్‌ భారీ మూల్యం చెల్లించుకుంటుందని జేడీ వాన్స్‌కు చెప్పా. పాక్‌కు ఎవరు సాయం చేసినా.. చూస్తూ ఊరుకొనేది లేదని చెప్పాం. పాక్‌ ఎలాంటి దాడి చేసినా మేం చూసుకుంటామని వాన్స్‌కు చెప్పాం. బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే సమాధానం చెప్తామని జేడీ వాన్స్‌కు చెప్పాం. పాక్‌కు ఎవరు సహాయం చేసినా.. చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశాం. పాక్‌కు చిరకాలం గుర్తుండిపోయే సమాధానం ఇచ్చాం. పాక్‌ డీజీఎం అర్ధరాత్రి ఫోన్‌ చేసి దాడులు ఆపాలని బతిమాలితేనే ఆపరేషన్‌ సిందూర్‌ నిలిపివేశాం. ‘’ అన్నారు. ‘’మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే పహల్గాం దాడులు. ఈ దాడి తర్వాత ఉగ్రవాదులను మట్టిలో కలుపుతామని ప్రతినబూనాం. ద్రోహులకు కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తామని చెప్పాం. ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పాలని అఖిలపక్ష భేటీలోనూ చర్చించాం. పాక్‌ భూభాగంలోకి వెళ్లి ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేశాం. పాక్‌ ఎయిర్‌ బేస్‌లు ఇప్పటికీ ఐసీయూలో ఉన్నాయి. అణుబాంబులు బెదిరింపులు చెల్లవని పాక్‌ను హెచ్చరించాం. 193 దేశాల్లో 190 దేశాలు ఆపరేషన్‌ సిందూర్‌ని సమర్థించాయి. పాక్‌కు కేవలం మూడు దేశాలే అండగా నిలిచాయి’’ అన్నారు. ‘’ఆపరేషన్‌ సిందూర్‌ను కాంగ్రెస్‌ మాత్రమే తప్పుపడుతోంది. స్వార్థ రాజకీయాల కోసం సైనికుల పరాక్రమాలను తక్కువ చేస్తోంది. తమ స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్‌ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తద్వారా సైన్యం మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. మీడియా హెడ్‌లైన్లలో వచ్చేందుకు కొందరు నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలు మీడియా హెడ్‌లైన్లలో ఉండొచ్చేమో గానీ.. ప్రజల మనస్సుల్ని గెలవలేరు. పాకిస్థాన్‌ను కాంగ్రెస్‌ వెనకేసుకురావడం దౌర్భాగ్యం. సర్జికల్‌ స్ట్రైక్స్‌ విషయంలోనూ కాంగ్రెస్‌ నేతలు ఇలాగే మాట్లాడారు. పైలట్‌ అభినందన్‌ పాక్‌కు చిక్కినప్పుడూ ఇలాగే మాట్లాడారు. పాక్‌ నుంచి అభినందన్‌ను మోదీ ఎలా తెస్తారో చూస్తామన్నారు. మేం ఆయన్ను సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చాం. విపక్షాల తీరు చూసి దేశమంతా నవ్వుకుంటోంది. భారత రక్షణ దళాల శక్తి, సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉంది. భారత రక్షణ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. నేనెప్పుడూ భారత ప్రజల పక్షమే. భారతీయుల భావనలతో నా స్వరం మిళితం చేసుకొని ముందుకెళ్తున్నా. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో నాపై నమ్మకం ఉంచినందుకు దేశ ప్రజలకు రుణపడి ఉన్నా’’ అన్నారు.‘పాకిస్థాన్‌ మళ్లీ ఎలాంటి కుయుక్తులు చేసినా ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతుంది. పాక్‌ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా దీటుగా బదులిస్తాం’ అని ప్రధాని మోదీ హెచ్చరించారు. పహల్గాం దాడి ఉగ్రవాదులను సైతం మట్టుబెట్టామన్నారు. ఆపరేషన్‌ మహాదేవ్‌ చేపట్టి ఉగ్రవాదుల్ని ఏరివేస్తున్నట్లు చెప్పారు.

 

సైన్యం,యుద్ధ త్యాగాలను రాజకీయాలకు వాడుకుంటున్నారు
` ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో సైన్యం చేతులు కట్టేసి..పాక్‌తో సయోధ్య కుదుర్చుకున్నారు
` ఉగ్రదాడులకు దీటుగా సమాధానం చెప్పడంలో కేంద్రం విఫలమైంది
` మోదీకి ఇందిరా గాంధీలా ధైర్యముంటే.. ట్రంప్‌ వ్యాఖ్యలను ఖండిరచాలి
` పహల్గాం ఉగ్రదాడిని పాకిస్థాన్‌ కుట్రపన్నిన క్రూరమైన ఘటన
` సాయుధ దళాలకు మద్దతుగా నిలిచే విషయంలో ప్రభుత్వానికి రాజకీయ సంకల్పం కొరవడిరది
` ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు ముందు అన్ని పార్టీలు ఏకతాటిపై నిలిచాయి: రాహుల్‌
` అకస్మాత్తుగా యుద్ధాన్ని ఎందుకు ఆపారు?: ప్రియాంక
` పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టడం నిఘా వర్గాల వైఫల్యానికి నిదర్శనం: అఖిలేష్‌
ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో మన సైనికుల చేతులు కట్టేశారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. సాయుధ దళాలకు మద్దతుగా నిలిచే విషయంలో ప్రభుత్వానికి రాజకీయ సంకల్పం కొరవడిరదని విమర్శించారు. తాము యుద్ధం కోరుకోవడం లేదని పాకిస్థాన్‌కు భారత ప్రభుత్వమే తెలియజేసిందన్నారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ సందర్భంగా లోక్‌సభలో రాహుల్‌ ప్రసంగిస్తూ.. పహల్గాం ఉగ్రదాడిని పాకిస్థాన్‌ కుట్రపన్నిన క్రూరమైన ఘటనగా పేర్కొన్నారు. ‘’సాయుధ దళాలను ఉపయోగించాలనుకుంటే.. బలమైన రాజకీయ సంకల్పం ఉండాలి. వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. కానీ.. ఆపరేషన్‌ సిందూర్‌ విషయంలో మన సైనికుల చేతులు కట్టేశారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన సున్నితమైన వివరాలను దాయాదికి వెల్లడిరచారు. అర్ధరాత్రి 1.05 గంటలకు ఆపరేషన్‌ ప్రారంభమైందని.. 1.35కు పాకిస్థాన్‌కు ఫోన్‌ చేసి సైనికేతర లక్ష్యాలను ఛేదించామని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారన్నారు. ఉద్రిక్తతలు పెంచే ఆలోచన లేదని దాయాదితో చెప్పామన్నారు. అంటే.. పాక్‌తో యుద్ధం చేసే ఆలోచన లేదని ఆయన చెప్పకనే చెప్పారు. ‘’ అని రాహుల్‌ గాంధీ విమర్శించారు. ‘’పాక్‌ విజ్ఞప్తి మేరకు యుద్ధాన్ని ఆపామని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు.. భారత్‌-పాక్‌ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటివరకు 29 సార్లు చెప్పుకొన్నారు. ఇందిరా గాంధీలా ధైర్యం ఉంటే.. ట్రంప్‌ ‘అబద్ధాలకోరు’ అని, భారత్‌ యుద్ధవిమానాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని ప్రధాని మోదీ లోక్‌సభలో ప్రకటించాలి’’ అని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు ముందు అన్ని పార్టీలు ఏకతాటిపై నిలిచాయని, తాను పహల్గాం దాడి బాధిత కుటుంబాలను పరామర్శించినట్లు తెలిపారు.
అకస్మాత్తుగా యుద్ధాన్ని ఎందుకు ఆపారు?: ప్రియాంక
నాయకత్వం అంటే క్రెడిట్‌ తీసుకోవడమే కాదని, బాధ్యత కూడా తీసుకోవడమని కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. భారత్‌-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ప్రకటనను అమెరికా అధ్యక్షుడు చేయడం మన ప్రధాన మంత్రి బాధ్యతారాహిత్యాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌పై లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. అమిత్‌ షా ప్రసంగాన్ని లక్ష్యంగా చేసుకుంటూ తనదైన శైలిలో ప్రశ్నలు కురిపించారు.‘’జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీల విషయాలతతోపాటు నా తల్లి కన్నీరు పెట్టిన విషయంపై అమిత్‌ షా మాట్లాడారు. కానీ, శత్రువులు ఎక్కడికీ వెళ్లలేని సమయంలో యుద్ధాన్ని ఎందుకు ఆపారో అమిత్‌ షా సమాధానం చెప్పలేదు. నాయకత్వం అంటే క్రెడిట్‌ తీసుకోవడమే కాదు బాధ్యత కూడా తీసుకోవాలి. ఇలా ఆకస్మికంగా యుద్ధాన్ని ఆపడం దేశ చరిత్రలోనే మొదటిసారి. ఆ ప్రకటన కూడా అమెరికా అధ్యక్షుడు చేశారు. ఇది మన ప్రధాని బాధ్యతారాహిత్యాన్ని చూపిస్తోంది. మన దౌత్యం విఫలమైంది’’ అని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.ప్రజలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రధాని, హోంమంత్రి, రక్షణశాఖ, జాతీయ భద్రతా సలహాదారులకు లేదా అని ప్రియాంక ఈ సందర్భంగా ప్రశ్నించారు. ‘’బైసరన్‌ వ్యాలీకి వేలాది మంది పర్యటకులు వస్తారని ప్రభుత్వానికి తెలియదా. భద్రత ఎందుకు లేదు. భద్రతను భగవంతుడి దయకే ఎందుకు వదిలేశారు. ఇంత దారుణమైన ఉగ్రదాడి జరగనుందని, ఇందుకు పాక్‌ కుట్ర పన్నుతోందని ప్రభుత్వ ఏజెన్సీలు ముందుగానే ఎందుకు పసిగట్టలేక పోయాయి? ఇది మన ప్రభుత్వం, నిఘా సంస్థల వైఫల్యమే. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఎవరైనా రాజీనామా చేశారా? గతం గురించే మాట్లాడుతారు కానీ, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలపై మాత్రం సమాధానం చెప్పరు’’ అని కాంగ్రెస్‌ ఎంపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టడం నిఘా వర్గాల వైఫల్యానికి నిదర్శనమన్నారు. దీనివల్ల విలువైన ప్రాణాలు పోవడంతోపాటు సరిహద్దు భద్రతలో ఉన్న వైఫల్యాలు బహిర్గతం అయ్యాయయని అన్నారు. విదేశాంగ విధానం పూర్తిగా విఫలమైందన్న ఆయన.. ఎవరి ఒత్తిడి వల్ల కాల్పుల విరమణ పాటించాల్సి వచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరోవైపు చైనా కూడా ముప్పుగా మారిందని, మన భూమిని, మార్కెట్‌ను చేజిక్కించుకునే దేశంగా మారిందని విమర్శించారు.

విధిలేని పరిస్థితుల్లో పాకిస్థాన్‌ సరెండర్‌ అయ్యింది
పహల్గాం దాడి ఉగ్రవాదుల్లో ముగ్గుర్ని హతమార్చాం..
` సిందూర్‌పై చర్చ సందర్భంగా అమిత్‌ షా
` పాక్‌ అణ్వాయుధ బెదిరింపులకు తలొగ్గం: రాజ్‌నాథ్‌ సింగ్‌
న్యూఢల్లీి (జనంసాక్షి): ఆపరేషన్‌ సింధూర్‌పై ఇవాళ లోక్‌సభలో చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మాట్లాడారు. ఆపరేషన్‌ సింధూర్‌ కొనసాగుతున్న సమయంలో.. పాకిస్థాన్‌ లొంగిపోయినట్లు ఆయన తెలిపారు. ఆ పరిస్థితికి దారితీసిన ఘటనలను ఆయన సభలో పేర్కొన్నారు. పెహల్గామ్‌ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించారని, దాంట్లో 25 మంది భారతీయులు, ఓ నేపాలీ ఉన్నారన్నారు. ఏప్రిల్‌ 30వ తేదీన సీసీఎస్‌ మీటింగ్‌లో సింధూ నదీ జలాలపై నిర్ణయం తీసుకున్నామన్నారు. పాకిస్థానీ పౌరుల్ని వెనక్కి పంపామన్నారు. సీఆర్పీఎఫ్‌, ఆర్మీ, జేకే పోలీసులు ఉగ్రవాదులకు గట్టి బదులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.మే 9వ తేదీన పాకిస్థాన్‌పై దాడి కోసం ఆర్మీకి ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి షా చెప్పారు. 11 ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేశామన్నారు. నూర్‌ ఖాన్‌ ఛక్లా, మురిద్‌, సుగుర్దా, రఫికీ, రహిమ్‌ ఖాన్‌, జాకోబాబాద్‌, భోలారిని ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఆరు రేడార్లను, సర్ఫేస్‌ టు ఎయిర్‌ ఆయుధాలను ధ్వంసం చేశామన్నారు. ఎయిర్‌ బేస్‌లను టార్గెట్‌ చేయలేదని, కానీ భారత్‌లో ఉన్న పౌర ప్రాంతాలను పాకిస్థాన్‌ అటాక్‌ చేసే ప్రయత్నం చేసిందన్నారు. పాకిస్థాన్‌ తన దాడులకు చెందిన అన్ని రకాల సామర్థ్యాలను కోల్పోవడంతో, ఆ దశలో ఆ దేశానికి మరో అవకాశం లేకుండా పోయిందని, అప్పుడు పాకిస్థాన్‌ లొంగిపోయినట్లు అమిత్‌ షా తెలిపారు.మే 10వ తేదీన పాకిస్థాన్‌ డీజీఎంవో.. దాడుల్ని ఆపేస్తున్నట్లు సాయంత్రం 5 గంటలకు ఫోన్‌ చేశారన్నారు. అయితే అడ్వాంటేజ్‌ ఉన్న సమయంలో ఎందుకు అటాక్‌ చేయలేదని ప్రశ్నిస్తున్నారని, కానీ ప్రతి యుద్ధానికి ఓ సామాజిక కోణం ఉంటుందని మంత్రి అన్నారు. 1951, 1971లో జరిగిన యుద్ధాల గురించి ఆయన వెల్లడిరచారు. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ను నెహ్రూ అప్పగించారని, షిమ్లా ఒప్పందంలో దాన్ని డిమాండ్‌ చేయలేదన్నారు.ఏప్రిల్‌ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఆపరేషన్‌ సిందూర్‌పై లోక్‌సభలో రెండో రోజు చర్చ కొనసాగుతోంది. ఈ చర్చ సందర్భంగా ఇవాళ షా మాట్లాడారు. పహల్గాం ప్రతీకారాన్ని ధృవీకరించారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ముగ్గురిని మట్టుబెట్టినట్లు వెల్లడిరచారు.
పాక్‌ అణ్వాయుధ బెదిరింపులకు తలొగ్గం: రాజ్‌నాథ్‌ సింగ్‌
న్యూఢల్లీి: ఆపరేషన్‌ సింధూర్‌పై ఇవాళ రాజ్యసభలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ చేపడుతున్న అణ్వాయుధ బెదిరింపులకు భారత్‌ తలవంచదు అని పేర్కొన్నారు. ఎటువంటి యుద్ధ వ్యూహాలనైనా తిప్పికొడుతుందన్నారు. ఉగ్రవాదానికి భారత్‌ వ్యతిరేకమన్న ఉద్దేశాన్ని చాటేందుకు ఆపరేషన్‌ సింధూర్‌ సంకేతంగా నిలుస్తుందని, కానీ గత ప్రభుత్వాలు దశాబ్ధాల క్రితమే ఇలాంటి చర్యలను చేయాల్సి ఉండే అని అన్నారు.ఒకవేళ పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని రూపుమాపాలనుకుంటే, ఆ దేశానికి సహకారం అందించేందుకు భారత్‌ సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. భారత్‌, పాకిస్థాన్‌ దేశాలు ఒకేసారి స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయని, కానీ పాకిస్థాన్‌ను ఉగ్రవాద కేంద్రంగా భావిస్తున్నారని, ఇండియాను మాత్రం ప్రజాస్వామ్యానికి తల్లిగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఉగ్రవాదం నుంచి ఎటువంటి విప్లవం పుట్టదు అని, దాని వల్ల కేవలం విధ్వంసం, ద్వేషమే మిగులుతుందన్నారు. ఉగ్రవాదులేమీ ఫ్రీడం ఫైటర్లు కాదన్నారు.ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థాన్‌ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయిదన్న విషయాన్ని విపక్షాలు ఎందుకు అడగడం లేదన్నారు. కానీ భారతీయ యుద్ధ విమానాల గురించి మాత్రమే ప్రశ్న వేస్తోందని విమర్శించారు. ఏదో ఒక రోజు పీవోకే ప్రజలు ఇండియాతో కలుస్తారని, భారతీయులమని చెప్పుకునేందుకు వాళ్లు గర్వపడుతారని రాజ్‌నాథ్‌ అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌కు కేవలం కామా మాత్రమే పెట్టామని, ఫుల్‌ స్టాప్‌ పెట్టలేదన్నారు.కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించారని వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. ఆపరేషన్‌ సింధూర్‌ లక్ష్యం కేవలం పాకిస్థాన్‌ను శిక్షించడమే అని, కానీ ఆ దేశంపై యుద్ధం చేయడం తమ ఉద్దేశం కాదన్నారు. పాకిస్థాన్‌లో ఉన్న 9 ఉగ్ర స్థావరాలపై ఇండియా దాడి చేసిందని, ఆ దాడిలో ఒక్క పాకిస్థానీ పౌరుడు కూడా మరణించలేదని మంత్రి రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.మరో వైపు లోక్‌సభలో హోంశాఖ మంత్రి అమిత్‌ షా చేసిన ప్రసంగంపై ప్రధాని మోదీ తన ఎక్స్‌ అకౌంట్లో ట్వీట్‌ చేశారు. ఆపరేషన్‌ సింధూర్‌, ఆపరేషన్‌ మహాదవ్‌పై ఆ ప్రసంగంలో పూర్తి వివరాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

 

రాజ్యసభలోనూ వాడీవేడీ చర్చ..
` ఉగ్రవాదులు పహల్గాం వరకు ఎలా రాగలిగారు?
` భద్రతాపరమైన లోపాలకు అమిత్‌ షా బాధ్యత వహించాలి:ఖర్గే
న్యూఢల్లీి(జనంసాక్షి):ఆపరేషన్‌ సిందూర్‌పై రాజసభ్యలోనూ వాడీవేడీ చర్చ జరిగింది. ఈ క్రమంలో రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేపై సభాపక్ష నేత జేపీ నడ్డా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తీవ్ర వాగ్వాదానికి కారణమైంది.దీంతో అధికార, విపక్ష సభ్యుల చప్పుళ్లతో సభ కొద్దిసేపు దద్దరిల్లింది. చివరకు తన వ్యాఖ్యలను నడ్డా వెనక్కి తీసుకొని, క్షమాపణ చెప్పడంతో సభ సద్దుమణిగింది.పహల్గాం దాడి, ఆపరేషన్‌ సిందూర్‌పై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దాదాపు గంటపాటు ప్రసంగించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ పైనా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఖర్గే ప్రసంగం ముగిసిన వెంటనే స్పందించిన నడ్డా.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ‘మానసిక సమతుల్యత’ కోల్పోతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీపై ఖర్గే చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. దీంతో నడ్డా చర్యలను తీవ్రంగా తప్పుపట్టిన విపక్షాలు క్షమాపణ చెప్పాలంటూ బల్లలు చరుస్తూ ఆందోళన చేపట్టాయి. అనంతరం ఖర్గే కూడా మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వంలో తాను గౌరవించే మంత్రుల్లో నడ్డా కూడా ఒకరని, అయినప్పటికీ తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. వెంటనే కేంద్ర మంత్రి నడ్డా స్పందిస్తూ.. ఇప్పటికే తన మాటలు వెనక్కి తీసుకున్నానని, క్షమాపణ కూడా చెప్పానని అన్నారు.‘’నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న నాయకుడు. అందుకు భాజపానే కాదు దేశం మొత్తం గర్విస్తోంది’’ అని కేంద్ర మంత్రి నడ్డా పేర్కొన్నారు. ఖర్గే మాత్రం ఆయన స్థాయిని పట్టించుకోకుండా అభ్యంతరకరంగా మాట్లాడారని విమర్శించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడికి సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ తన పరిధిని దాటి ప్రధానిపై వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అవి ఆయన స్థాయికి తగినట్లు లేవని, వాటిని రికార్డుల నుంచి తొలగించాల్సిన అవసరం ఉందని జేపీ నడ్డా పేర్కొన్నారు.
ఉగ్రవాదులు పహల్గాం వరకు ఎలా రాగలిగారు?: ఖర్గే
దేశంలో ఉగ్రమూలాలు దెబ్బతిస్తే.. మరి ఉగ్రవాదులు పహల్గాం వరకు వచ్చి ఎలా దాడి చేశారంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. పహల్గాంలో భద్రతాపరమైన లోపాలకు హోంమంత్రి అమిత్‌ షా బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై చర్చ సందర్భంగా రాజ్యసభలో ఖర్గే ప్రసంగించారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సమయంలో దేశ సాయుధ దళాల శౌర్యపరాక్రమాలను ‘ఇండియా’ కూటమి ప్రశంసించిందని, దేశ ప్రయోజనాల కోసం కేంద్రానికి మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. ‘’పాకిస్థాన్‌కు విపక్షాలు మద్దతు ఇస్తున్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అబద్ధాలతో ఎక్కువకాలం ప్రజలను మభ్యపెట్టలేరు. మేం ఎప్పుడూ ఆ దేశానికి మద్దతు ఎవ్వలేదు. ఇవ్వబోమూ. ఉగ్రవాదాన్ని పాక్‌ పోషిస్తోందని మొదటి నుంచి చెబుతున్నాం. భాజపా హయాంలో ఉగ్రవాద సమస్య మూడిరతలు పెరిగింది. ఉగ్రదాడులను నిరోధించడంలో ప్రభుత్వం తన లోపాలు, వైఫల్యాలను అంగీకరించాలి. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో దాయాది దాడుల నుంచి సరిహద్దు ప్రజలను రక్షించడంలోనూ కేంద్రం తగు చర్యలు తీసుకోలేదు. పహల్గాం దాడికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ ఉగ్రదాడిలో ప్రమేయమున్న మిగిలిన ఉగ్రవాదులనూ గుర్తించి, శిక్షించాలి. అదేవిధంగా.. సరైన విదేశాంగ విధానాన్ని రూపొందించాలి’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు.
టెర్రరిస్టుల ఏరివేతలో ‘సిందూర్‌’ ‘మహాదేవ్‌’ ఆపరేషన్‌లది కీలక పాత్ర : ప్రధాని మోదీ
ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించి హోంమంత్రి అమిత్‌ షా లోక్‌సభ లో చేసిన ప్రసంగంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఉగ్రవాదుల ను ఏరివేయడంలో ఆపరేషన్‌ మహాదేవ్‌ ఆపరేషన్‌ సిందూర్‌ కీలకపాత్ర పోషించాయని ప్రధాని అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌, ఆపరేషన్‌ మహదేవ్‌ గురించి హోంమంత్రి అమిత్‌ షా లోక్‌సభలో సుదీర్ఘ వివరణ ఇచ్చారని ప్రధాని మోదీ చెప్పారు. దేశ భద్రతపై భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన తన ప్రసంగంలో సవివరంగా చెప్పారని ట్వీట్‌ చేశారు. అంతకుముందు లోక్‌సభలో అమిత్‌ షా ప్రసంగిస్తూ ప్రతిపక్షాల తీరుపై ధ్వజమెత్తారు. దేశం అభివృద్ధి చెందకపోవడానికి, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ ఉనికికి నెహ్రూనే కారణమని ఆరోపించారు.1948లో భారత సైనిక దళాలు పీవోకేను చేజిక్కించుకునే స్థానంలో ఉన్నప్పటికీ అప్పటి ప్రధాని ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించడంవల్ల ఆ అవకాశం చేజారిపోయిందని అమిత్‌ షా విమర్శించారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కూడా నెహ్రూ చర్యలను వ్యతిరేకించారని గుర్తుచేశారు. తూర్పు పాకిస్థాన్‌ విమోచన యుద్ధం సమయంలోనూ పీఓకేను దక్కించుకునే అవకాశం వచ్చినప్పటికీ అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం దాన్ని చేజార్చుకుందని అన్నారు.ఐక్యరాజ్యసమితి భద్రతామండలి లో భారత్‌ శాశ్వత సభ్యత్వాన్ని పొందలేకపోవడానికి కూడా నెహ్రూనే కారణమని అమిత్‌ షా ఆరోపించారు. నెహ్రూ నిర్ణయాలవల్లే మనకు ఇంకా భద్రతామండలిలో శాశ్వత స్థానం దక్కలేదని చెప్పారు. యూఎన్‌ఎస్‌సీలో శాశ్వత సభ్యత్వం కోసం మోదీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని తెలిపారు. దేశంపై ఉగ్రవాదులు కుట్రలకు పాల్పడుతుంటే చూస్తూ కూర్చోవడానికి ప్రస్తుతం ఉన్నది మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం కాదని, మోదీ ప్రభుత్వమని అమిత్‌ షా వ్యాఖ్యానించారు.