ఎన్‌ఐఏ ప్రాసిక్యూషన్‌ విఫలం

` నిర్దోషులుగా మాలేగావ్‌ నిందితులు
` ముంబయి ప్రత్యేక కోర్టు కీలక తీర్పు
ముంబయి(జనంసాక్షి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 నాటి మాలేగావ్‌ పేలుడు కేసులో ముంబయిలోని ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌, లెఫ్టినెంట్‌ కర్నల్‌ ప్రసాద్‌ పురోహిత్‌ సహా మొత్తం ఏడుగురు నిందితులను ఎన్‌ఐఏ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఈ మేరకు గురువారం తీర్పు వెలువరించింది.ఈ కేసు దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌ వాదనలో చాలా లోటుపాట్లు ఉన్నాయని కోర్టు తెలిపింది. ‘‘ఈ కేసుకు ఉపా (చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక) చట్టం వర్తించదు. ఈ పేలుడుకు వినియోగించిన మోటార్‌బైక్‌.. మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ (%ూతీaస్త్రవa ూఱఅస్త్రష్ట్ర ుష్ట్రaసబతీ%) పేరు మీద రిజిస్టర్‌ అయిందని ప్రాసిక్యూషన్‌ చేసిన వాదనకు తగిన సాక్ష్యాధారాలు లేవు. బైక్‌కు అమర్చిన బాంబు వల్లే పేలుడు సంభవించిందని చెప్పేందుకు కూడా ఆధారాల్లేవ్‌. ఉగ్రవాదానికి మతం లేదు. ఎందుకంటే ఏ మతం కూడా హింసను ప్రోత్సహించదు. కానీ, కేవలం ఊహాగానాలు, నైతిక ఆధారాలతో ఎవరినీ కోర్టులు శిక్షించవు. బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ మినహా ఈ కేసులో ఎలాంటి బలమైన ఆధారాల్లేవు’’ అని తీర్పు వెలువరించే సమయంలో కోర్టు వెల్లడిరచింది. ఈ కేసులో ఆరుగురు మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. క్షతగాత్రులకు రూ.50వేల ఆర్థికసాయం ఇవ్వాలని సూచించింది. తీర్పుపై మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ హర్షం వ్యక్తంచేశారు. ఈ కేసు కారణంగా గత 17 ఏళ్ల పాటు తన జీవితం నాశనం అయ్యిందన్నారు. తనను బాధ పెట్టిన వారిని దేవుడే శిక్షిస్తారని అన్నారు. మరోవైపు, ఈ తీర్పును తాము హైకోర్టులో సవాల్‌ చేయనున్నట్లు బాధిత కుటుంబాలు వెల్లడిరచాయి.మహారాష్ట్ర లోని మాలేగావ్‌ ప్రాంతంలో 2008 సెప్టెంబరు 29న పేలుడు సంభవించింది. ఓ మసీదు సమీపంలో మోటార్‌ సైకిల్‌కు అమర్చిన బాంబు పేలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. అప్పట్లో ఈ కేసు పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రజ్ఞా ఠాకూర్‌, పురోహిత్‌తో పాటు రమేశ్‌ ఉపాధ్యాయ్‌, అజయ్‌ రహీర్‌కార్‌, సుధాకర్‌ ద్వివేది, సుధాకర్‌ చతుర్వేది, సమీర్‌ కులకర్ణి ప్రధాన నిందితులుగా కేసు నమోదైంది.ఈ కేసులో తొలుత దర్యాప్తు ప్రారంభించిన ఏటీఎస్‌.. ప్రస్తుత సాక్షి (40వ నంబరు) సహా పలువురి వాంగ్మూలాలను అప్పట్లో నమోదుచేసింది. ఆపై కేసు దర్యాప్తు బాధ్యతలను ఎన్‌ఐఏ స్వీకరించింది. ఈ కేసులో 220 మంది సాక్షులను విచారించగా.. వారిలో 15 మంది అంతకుముందు తాము ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మాట్లాడటం గమనార్హం.