స్పీకర్‌ కోర్టుకు ‘అనర్హత’ బంతి

` 3 నెలల్లో స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలి
` దీనిపై పార్లమెంట్‌ కూడా సమీక్షించాలి
` బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీం తీర్పు
న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌ను అనుమతించిన సుప్రీం ధర్మాసనం.. వీలైనంత త్వరగా లేదా 3 నెలల్లోగా స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్‌ చేసిన విజ్ఞప్తిని సీజేఐ గవాయ్‌ తోసిపుచ్చారు. అదే సమయంలో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. స్పీకర్‌ నిర్ణయానికి కాలపరిమితి విధించాలనే అంశంపై పార్లమెంట్‌ నిర్ణయం తీసుకోవాలని సీజేఐ గవాయ్‌ ఆదేశించారు.కాగా, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల కేసుపై సుప్రీంకోర్టులో సుధీర్ఘ వాదనలు జరిగాయి. స్పీకర్‌ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలనే అంశంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా లేదా అనే దానిపై సుప్రీంకోర్టులో సుధీర్ఘ వాదనలు నడిచాయి. ఈ వాదనల అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌ 3వ తేదీన జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం తీర్పు రిజర్వ్‌ చేసింది. బిఆర్‌ఎస్‌ నుంచి పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలను వీలైనంత త్వరగా లేదా 3 నెలల్లోపు నిర్ణయించాలని సూచించింది. ఏ ఎమ్మెల్యే అయినా.. స్పీకర్‌ పక్రియను పొడిగించాలని అడగకూడదు. అలా చేస్తే స్పీకర్‌ ప్రతికూల నిర్ణయాలు తీసుకోవచ్చు. రాజకీయ ఫిరాయింపులు జాతీయ చర్చనీయాంశంగా మారింది. దాన్ని అరికట్టకపోతే.. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే శక్తి దానికి ఉందని వ్యాఖ్యానించారు. వివిధ సందర్భాల్లో ఈ అంశంపై పార్లమెంటులో చేసిన వివిధ ప్రసంగాలను కూడా పరిశీలించాం. రాజేష్‌ పైలట్‌.. దేవేంద్ర నాథ్‌ మున్షి లాగా.. అనర్హత చర్యలపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడం కోర్టుల ముందు జాప్యాన్ని నివారించడమే. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు కట్టబెట్టారు. ఆర్టికల్స్‌ 136, 226, 227 లకు సంబంధించి న్యాయ సవిూక్ష అధికారాలు చాలా పరిమితంగా ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోవడంలో డివిజన్‌ బెంచ్‌ తప్పు చేసింది. స్పీకర్‌ ఒక న్యాయనిర్ణేత అధికారిగా వ్యవహరిస్తూనే హైకోర్టు, సుప్రీంకోర్టు అధికార పరిధికి లోబడి ఉండే ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారని తీర్పులో ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ 2014 నవంబర్‌ 22న తీర్పును పక్కన పెడుతున్నాము. ఒక ముఖ్యమైన నిర్ణయంలో శాసనసభ స్పీకర్‌లు ప్రజాస్వామ్యానికి ప్రమాదం కలిగించే ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునే విషయంలో ఆలస్యం చేస్తారు. కాబట్టి, ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేల అనర్హతపై ప్రస్తుతం ఉన్న యంత్రాంగాన్ని పార్లమెంటు సవిూక్షించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి చర్యలు సంవత్సరాల తరబడి సాగడం అర్థరహితంగా అని పేర్కొంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసిన తర్వాత మాత్రమే స్పీకర్‌ ఎమ్మెల్యేలకు నోటీసు జారీ చేయడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించింది. అపరేషన్‌ సక్సెస్‌.. పేషెంట్‌ డైడ్‌’ అన్న సూత్రం వర్తించకూడదని వ్యాఖ్యానించింది.ఒక ముఖ్యమైన నిర్ణయంలో శాసనసభ స్పీకర్‌లు ప్రజాస్వామ్యానికి ప్రమాదం కలిగించే ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునే విషయంలో ఆలస్యం చేస్తారు. కాబట్టి, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేల అనర్హతపై ప్రస్తుతం ఉన్న యంత్రాంగాన్ని పార్లమెంటు సవిూక్షించాలి. ఇలాంటి చర్యలు ఏళ్ల తరబడి సాగడం వల్ల అర్థరహితంగా మారుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడిరది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకొనేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, ఎమ్మెల్యేలు పాడికౌశిక్‌రెడ్డి, కేపీవివేకానంద, జి.జగదీశ్‌రెడ్డి, పల్లారాజేశ్వర్‌రెడ్డి, చింతా ప్రభాకర్‌, కల్వకుంట్ల సంజయ్‌, భాజపా శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ ఏడాది జనవరి 15న దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో తొమ్మిదిసార్లు విచారణకు వచ్చాయి. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ ఆగస్టీన్‌ జార్జ్‌ మసీప్‌ాలతో కూడిన ధర్మాసనం అన్నిపక్షాల వాదనలు విన్న తర్వాత ఏప్రిల్‌ 3న తీర్పును రిజర్వు చేసింది. ఇందులో ప్రతివాదులుగా తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, ఎమ్మెల్యేలు పి.శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, టి.ప్రకాశ్‌గౌడ్‌, ఎ.గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్‌లు ఉన్నారు. సుదీర్ఘ వాదనల అనంతరం గురువారం తీర్పు వెలువడిరది. దీనిని బిఆర్‌ఎస్‌ నేతలు స్వాగతించాలి.

 

సుప్రీం తీర్పును స్వాగతించిన బీఆర్‌ఎస్‌
` ఫాంహౌజ్‌లో పార్టీ నేతలతో కేసీఆర్‌ సమీక్ష
` 3 నెలల్లో ఉప ఎన్నికలు తప్పవు
` సుప్రీం తీర్పును స్వాగతించిన కేటీఆర్‌
గజ్వేల్‌(జనంసాక్షి): ఎర్రవల్లిలోని నివాసంలో పార్టీ నేతలతో భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ సమావేశమయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు పలువురు నేతలు భేటీకి హాజరయ్యారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఈ అంశంపై నేతల మధ్య చర్చ జరిగినట్టు సమాచారం.
3 నెలల్లో ఉప ఎన్నికలు తప్పవు: కేటీఆర్‌
’సత్యమేవ జయతే’ అని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లోపు స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన ఈమేరకు స్పందించారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును భారత రాష్ట్ర సమితి స్వాగతిస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన సీజేఐకి దన్యవాదాలు తెలిపారు. రాహుల్‌ గాంధీ చెప్పే పాంచ్‌ న్యాయ సూత్రకు కట్టుబడి ఉండాలి. చట్టవిరుద్ధంగా 10 మంది పార్టీ మారారని చెప్పేందుకు దర్యాప్తు అవసరం లేదు. కష్ట సమయాల్లో మాతో నిలిచిన భారత రాష్ట్ర సమితి లీగల్‌ టీమ్‌కు ధన్యవాదాలు. 10 నియోజకవర్గాల్లో ఉపఎన్నికకు 3 నెలల సమయం ఉంది. పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని కేటీఆర్‌ పేర్కొన్నారు. దేశం యొక్క ప్రజాస్వామ్య నిర్మాణం హానికరమైన పద్ధతుల ద్వారా క్షీణించకుండా చూసుకున్నందుకు గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాలను పటిష్టం చేయాలని, ఫిరాయింపులపై ఆటోమేటిక్‌ రద్దు చేయాలని తన పంచ న్యాయ్‌లో వాదించిన రాహుల్‌ గాంధీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నాను. మిస్టర్‌ గాంధీ, విూ స్వంత ఉపదేశాలకు కట్టుబడి ఉండమని నేను విూకు చెబుతున్నాను అని కేటీఆర్‌ పేర్కొన్నారు.గౌరవనీయులైన స్పీకర్‌ పదవిని విూరు, విూ పార్టీ భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడానికి ఉపయోగించుకోరని నేను ఆశిస్తున్నాను. ఈ 10 మంది ఎమ్మెల్యేలు అక్రమంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరి ప్రతిరోజూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అంగీకరించడానికి పెద్దగా పరిశోధన అవసరం లేదు అని కేటీఆర్‌ తెలిపారు.
రాహుల్‌ మీరు చెప్పే రాజ్యాంగాన్ని ఆచరిస్తారా?:హరీశ్‌
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు- పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. ఈ అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోపు స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.ఈ అంశాన్ని హరీశ్‌రావు ప్రస్తావిస్తూ.. విూరు బోధించే వాటిని విూరు ఆచరించగలరా..? అని రాహుల్‌ గాంధీని హరీశ్‌రావు సూటిగా ప్రశ్నించారు. విూ తండ్రి దివంగత రాజీవ్‌ గాంధీ 52వ రాజ్యంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టిన ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్పీకర్‌ను విూరు కోరుతారా..? అని ప్రశ్నించారు. లేదా రాజ్యాంగాన్ని చేతిలో మోసుకెళ్లడం కేవలం ఎన్నికల మోసమా..? అని రాహుల్‌ గాంధీని హరీశ్‌రావు నిలదీశారు.

 

న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం
` సుప్రీం తీర్పుపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ స్పష్టీకరణ
` స్పీకర్‌కు సుప్రీం సూచనలు మాత్రమే చేసింది
` గతంలో ఫిరాయింపులను మరచిన బీఆర్‌ఎస్‌
` మీడియా సమావేశంలో పలువురు కాంగ్రెస్‌ నేతలు
` అభివృద్ది కోసమే పార్టీ మారా..
` ఫిరాయింపు ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు
హైదరాబాద్‌(జనంసాక్షి): ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ స్పష్టం చేశారు. తనకు మూడు నెలల గడువు విధించడంపై న్యాయ నిపుణులతో చర్చించాకే తదుపరి నిర్ణయానికి వెళ్తామని అన్నారు. ఈ క్రమంలో ధన్‌ఖడ్‌ వ్యాఖ్యల ప్రస్తావన తెచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు పై న్యాయ నిపుణులతో చర్చిస్తా. మాజీ ఉప రాష్ట్రపతి జగ్దీప్‌ ధన్‌ఖడ్‌ ఏం మాట్లాడారో అందరూ చూశారు. వాటిని కూడా మేము పరిశీలిస్తున్నాం. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం. సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించాకే అన్ని వివరాలు త్వరలో చెప్తా అని అన్నారు. ఇదిలా ఉంటే.. పార్టీ మారిన పది మందిపై తొలుత తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఆ సమయంలో.. విచారణ షెడ్యూల్‌ కోసం సింగిల్‌ బెంచ్‌ జడ్జి తెలంగాణ స్పీకర్‌కు నాలుగు వారాల గడువు విధించారు. అయితే డివిజనల్‌ బెంజ్‌ దానిని కొట్టేసింది. ఇక ఇవాళ్టి తీర్పులో ఫిరాయింపులపై చర్యల విషయంలో స్పీకర్‌కు సుప్రీం కోర్టు మూడు నెలల కాలపరిమితి విధించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి, గవర్నర్‌లకు గడువు విధిస్తూ సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు వెల్లడిరచింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉప రాష్ట్రపతి హోదాలో ఓ కార్యక్రమానికి హాజరైన ధన్‌ఖడ్‌.. సుప్రీం కోర్టుపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. పార్లమెంటే సుప్రీం అని. ఎన్ని-కై-న ప్రజాప్రతినిధులే రాజ్యాంగ ప్రకారం అల్టిమేట్‌ మాస్టర్స్‌ అని అన్నారాయన. ‘సుప్రీం కోర్టు రాష్ట్రపతికి గడువు విధించడం తగదు. ఇప్పుడు జడ్జీలు శాసనాలు చేస్తారు, కార్యనిర్వాహక విధులు నిర్వర్తిస్తారు, సూపర్‌ పార్లమెంటులా వ్యవహరిస్తారు‘ అని విమర్శించారు. న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్య శక్తులపై అణుక్షిపణి ప్రయోగించకూడదు అని తీవ్ర వ్యాఖ్య చేశారాయన. అయితే.. పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలన్న పిటిషన్‌ విచారణ సమయంలో సుప్రీం కోర్టు పరోక్షంగా ధన్‌ఖడ్‌ వ్యాఖ్యలపై స్పందించింది. ఇప్పుడు మేమే కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేస్తున్నామన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా? అంటూ ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లోపు స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ స్పందించారు. న్యాయస్థానాలు అంటే తమకు గౌరవం ఉందని సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ‘‘రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీలను పార్టీలో చేర్చుకుంది. ఆ పార్టీ విధానాలు నచ్చక బయటకు వచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ వేసి ప్రభుత్వం కూలిపోతుందని పగటి కలలు కన్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయాధికారం స్పీకర్‌కే ఉంటుందని తెలిసినా నాయకులు నానా యాగి చేశారు’’ అని ఆది శ్రీనివాస్‌ అన్నారు.
స్పీకర్‌కు సుప్రీం సూచనలు మాత్రమే చేసింది
ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌ అధికారాలను సుప్రీంకోర్టు ప్రశ్నించలేదని, కేవలం సూచనలు మాత్రమే చేసిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ అన్నారు. దీనిపై ఎవరికి వారు వక్ర భాష్యాలు చెబుతున్నారని అన్నారు. సీఎల్పీ విూడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. సభాహక్కులు కాపాడేది కేవలం స్పీకర్‌ మాత్రమేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందన్నారు. తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందంటూ భారత రాష్ట్ర సమితి నాయకులు తెలివి తక్కువగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. గతంలో వారు చేసిన ఫిరాయింపుల గురించి మాట్లాడాలని అన్నారు. బిఆర్‌ఎస్‌ నాయకులు ముందు సుప్రీంకోర్టు తీర్పును చదవాలి. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలను తమ పార్టీలో విలీనం చేసుకున్న చరిత్ర కేసీఆర్‌ది. అధికారంలో ఉన్న పదేళ్లు వారు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కింది వారే. సీఎల్పీ నేతగా ఒక దళిత నేత ఉంటే సహించలేక కేసీఆర్‌ కాంగ్రెస్‌ శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకున్నారు. కమ్యూనిస్టు పార్టీల అంతం చూడాలని కేసీఆర్‌ ప్రయత్నించారు. మేం ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని బతికించాం అన్నారు. గతంలో అక్రమాలకు పాల్పడి సమర్థించుకోవడం బిఆర్‌ఎస్‌ నేతలకే దక్కిందని అన్నారు. ప్రతిపక్ష హోదా ఉన్నా అసెంబ్లీకి రాని కేసీఆర్‌పై మేం కోర్టుకు వెళ్లాలా? కేసీఆర్‌ అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్‌ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాంఅని అద్దంకి దయాకర్‌ అన్నారు. ఇలాంటి వారు చట్టాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
అభివృద్ది కోసమే పార్టీ మారా..: ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు
భారత రాష్ట్ర సమితినుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సుప్రీంకోర్టు తీర్పును శిరసా వహిస్తానని భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకటరావు అన్నారు.కోర్టు తీర్పులపై తమకు గౌరవం ఉందన్నారు. ప్రజాప్రతినిధిగా భద్రాచలం అభివృద్ధి కోసమే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లోకి వెళ్లానని స్పష్టంచేశారు. నియోజకవర్గంలో తనకు ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందన్న ఆయన.. ఒకవేళ ఉపఎన్నికలు వచ్చినా మళ్లీ గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ప్రజల సంక్షేమం, ఈ ప్రాంత అభివృద్ది తనకు ముఖ్యమని అన్నారు. వెనకబడ్డ భద్రాచలం విషయంలో తాను నిరంతరం కృషి చేస్తున్నానని అన్నారు.

 

సుప్రీం తీర్పు మంచి పరిణామం
` స్వాగతించిన తెలంగాణ బీజేపీ
హైదరాబాద్‌(జనంసాక్షి):పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బిజెపి స్వాగతించింది. ఈ తీర్పను తెలంగాణ భాజపా అధ్యక్షుడు రామచందర్‌రావు స్పందించారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న తీర్పును తాము స్వాగతిస్తున్నట్లు- చెప్పారు. ఈ తీర్పు మంచి పరిణామమన్నారు. భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్‌లు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాయని విమర్శించారు. కాంగ్రెస్‌ చేపట్టనున్న జనహిత పాదయాత్రపై రామచందర్‌రావు స్పందిస్తూ.. ఆ పార్టీ జనహిత పాదయాత్ర చేస్తోందో? జనాల్ని మోసం చేసే పాదయాత్ర చేస్తుందో చెప్పాలన్నారు. ఆరు గ్యారెంటీ-లు, డిక్లరేషన్లు, కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హావిూల్లో ఎన్ని నెరవేర్చిందో తెలుపుతూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. శ్వేతపత్రం విడుదల చేస్తేనే కాంగ్రెస్‌కు పాదయాత్ర చేసే నైతిక హక్కు ఉంటు-ందన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్‌ మోసం చేస్తోందని విమర్శించారు.