‘పహల్గాం’ దాడి ప్రతీకారం

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌
ముగ్గురు ‘పహల్గాం’ ఉగ్రవాదులు మృతి
శ్రీనగర్‌(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌లో సోమవారం జరిగిన ‘ఆపరేషన్‌ మహాదేవ్‌’లో పహల్గాం దాడితో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను సైనిక దళాలు మట్టుబెట్టినట్లు సమాచారం. ఈ విషయాన్ని సైన్యం ధ్రువీకరించినట్లు ఆల్‌-ఇండియా రేడియో తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. మరోవైపు హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకడు గతేడాది సోనామార్గ్‌ టన్నెల్‌లో జరిగిన ఉగ్రదాడికి కారకుడు కాగా, మరొకడు పహల్గాం ఉగ్రదాడిలో అనుమానితుడిగా పీటీఐ కథనంలో పేర్కొంది.హర్వాన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల సమాచారంతో నెల రోజులుగా సైన్యం, పోలీసు బలగాలు గాలింపు కొనసాగించాయి. ఈ ఆపరేషన్‌ కోసం గత కొన్ని రోజులుగా దళాలు పకడ్బందీగా ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దాచిగామ్‌ అడవుల్లో రెండ్రోజుల క్రితం అనుమానాస్పద కమ్యునికేషన్లను భద్రతా దళాలు పసిగట్టాయి. దీనికి తోడు.. స్థానిక సంచార జాతుల వారు కూడా ఉగ్రవాదుల కదలిలపై భద్రతా దళాలకు సమాచారం అందించారు. సోమవారం చాలా బృందాలను సైన్యం ఆ ప్రదేశాలకు తరలించింది. ఉదయం 11.30 గంటల సమయంలో 24 రాష్ట్రీయ రైఫిల్స్‌, 4 పారా కమాండోల బృందం ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించింది. ముష్కర మూక షాక్‌ నుంచి కోలుకొనేలోపే శరవేగంగా ఆపరేషన్‌ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ స్థావరంలో మొత్తం ఐదు నుంచి ఏడుగురు ఉగ్రవాదులున్నట్లు సమాచారం. చిక్కటి అరణ్యంలో ఓ గొయ్యి తవ్వి దానిపై టెంట్‌ వేసుకొని వీరు నక్కారు. ఈ క్రమంలో గాలింపు చేపట్టిన భద్రతా దళాలకు లిడ్వాస్‌ ప్రాంతంలో తొలిసారి ఉగ్రవాదులు భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ విషయాన్ని చినార్‌ కోర్‌ కూడా ‘ఎక్స్‌’లో ధ్రువీకరించింది. ఇప్పటికే పహల్గాం ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన పర్వీజ్‌ అహ్మద్‌ జోథార్‌, బషీర్‌ అహ్మద్‌లను గత నెల అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.
ఆపరేషన్‌కు ఈ పేరు ఎందుకు..?
దాచిగామ్‌ సమీంలోని మహాదేవ్‌ పర్వతం ఆధారంగా ఈ ఆపరేషన్‌కు పేరు పెట్టారు. ఎన్‌కౌంటర్‌ జరుగుతున్న ప్రదేశం జబర్వన్‌-మహదేవ్‌ పర్వతాల మధ్య జరుగుతోంది. అందుకే ఈ పేరు పెట్టారు. ఈ ఆపరేషన్‌ను జమ్మూకశ్మీర్‌ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్‌ సంయుక్తంగా చేపట్టాయి. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోంది.మృతిచెందిన ముగ్గురూ విదేశీ ఉగ్రవాదులే.. వీరు లష్కరే తయిబాకు చెందినవారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో కార్డన్‌సెర్చ్‌ చేపట్టారు. ఘటనాస్థలంలో ఏకే-47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న భద్రతా దళాలను నార్తర్న్‌ కమాండ్‌ అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ ప్రతీక్‌ శర్మ అభినందించారు. దళాలు వేగంగా స్పందించి చర్యలు తీసుకొన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో గల ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్‌ లోయ వద్ద ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అతి సమీపం నుంచి కాల్పులు జరిపి 25 మంది పర్యాటకులు, ఓ కశ్మీరీ వ్యక్తి ప్రాణాలు తీశారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. అప్పటినుంచి భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట సాగిస్తున్నాయి. లష్కరే తయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. వీరిలో ఒక్కొక్కరి తలపై రూ.20లక్షల వరకు రివార్డును ఇప్పటికే ప్రకటించారు. ఇటు పార్లమెటులో ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ జరుగుతుండటం, అటు ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో దీని గురించి గూగుల్‌లో వార్తలు ట్రెండ్‌ అవుతున్నాయి.