అధికారికంగా కాళన్న శత జయంతి
పాఠ్యాంశాల్లో కాళోజీ చరిత్ర
సిఎం కె.చంద్రశేఖర్‌రావు
హైదరాబాద్, ఆగస్టు 28 (జనంసాక్షి) : ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతిని ఇప్పటి నుంచి అధికారికంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. వరంగల్ కాళోజి ఫౌండేషన్ ప్రతినిధులతో గురువారం సచివాలంలో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సెప్టెంబర్ 9న జరిగే కాళోజి శత జయంతి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో, పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశిసిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు ముఖ్యమంత్రి సూచించారు. కాళోజి జయంతి, పాఠ్యపుస్తకాలు కాళోజి జీవిత చరిత్ర-రచనలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి వారితో చర్చించారు. కాళోజి శత జయంతి సందర్భంగా వరంగల్‌లో రవీంద్రభారతి కన్నా గొప్పగా నిర్మించే కాలోజి కల్చరల్ సెంటర్‌కు తాను స్వయంగా శంకుస్థాపన చేస్తానని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ భవనంలోనే కాళోజి రచనలు, ఆయన జ్ఞాపకాలు పదిల పరచాలని సిఎం చెప్పారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ రవీంద్రభారతిలో కూడా అధికారికంగా నిర్వహించే జయంతిలో తాను పాల్గొంటానని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ నగరాలు అత్యంత ప్రాధాన్యత, చరిత్ర ఉన్న ప్రాంతాలని, కాని గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వరంగల్ కవాలసినంత అభివృద్ధి కాలేదని సిఎం ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు వరంగల్‌ను తెలంగాణ సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇందులో భాగంగానే వరంగల్ నగరంలో కాళోజీ పేరిట అద్భుతమైన కల్చరల్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తామని, అది వరంగల్ నగరానికే వన్నె తెచ్చేవిధంగా ఉంటుందని అన్నారు. ఈ విషయంలో డబ్బుకు వెనుకాడేది లేదని ప్రకటించారు. కాళోజి శత జయంతి సందర్భంగా హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రతి గ్రామంలో కూడా జయంతి ఉత్సవం జరుగుతుందని చెప్పారు. జయంతి సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు కూడా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కాళోజి జీవిత చరిత్ర, ఆయన రచనలను పాఠ్యాంశాలలో పెడతామని ప్రకటించారు. కాళోజితోపాటు ఇతర తెలంగాణ విశిష్ట వ్యక్తుల జీవిత చరిత్రను కూడా భావితరాలకు అందించాలని సిఎం చెప్పారు. సీమాంధ్ర పాలకులు మన చిహ్నాలను చెరిపి వేశారని, వారి చిహ్నాలను మనపై రుద్దారని ఆయన చెప్పారు. ఇప్పుడు మన వాళ్ల గురించి మన భావితరాలకు చెప్పుకోవాలని సిఎం అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కెవి.రమణాచారి, బివి.పాపారావు, ఎంపీ కండియం శ్రీహరి, కాళోజి ఫౌండేషన్ ప్రతినిధులు అంపశయ్య నవీన్, బి.నర్సింగ్‌రావు, నాగిళ్ల రామశాత్రి, నందిని సిధారెడ్డి, పొట్లపల్లి శ్రీనివాసరావు, పి.అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.