ప్రముఖ దర్శకుడు బాపు ఇకలేరు
చెన్నై, ఆగస్టు 31 (జనంసాక్షి) : ప్రముఖ సినీ దర్శకుడు బాపు ఆదివారం సాయంత్రం చెన్నైలోని మలర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. 1933, డిసెంబర్ 15న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జన్మించారు. 1967లో సాక్షి సినిమా ద్వారా దర్శకునిగా వెండితెరకు పరిచయమయ్యారు. 1986లో రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారం అందుకున్నారు. తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళ భాషల్లో కూడా దర్శకత్వం వహించి తనకంటూ గుర్తింపు పొందారు. 1989లో తొలిసారి హిందీలో ప్రేమ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ముత్యాలముగ్గు, మిస్టర్ పెళ్ళాం, శ్రీరామరాజ్యం వంటి అద్భుతమైన కళాఖండాలను ఆయన ప్రేక్షకులకు అందించారు. ముత్యాలముగ్గు, మిస్టర్ పెళ్ళా చిత్రాలకు జాతీయ అవార్డులు అందుకున్నారు. పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం ఆయనను సత్కరించింది. ఆయన నిర్మించిన ఆరు చిత్రాలకు నందిఅవార్డులు లభించాయి. తెలుగువారి సంస్కృతి భాగమైన బాపుగీత రాత దర్శకుడు, దర్శకుడు, చిత్రకారుడిగా పేరొందిన బాపు తెలుగువారి సంస్కృతిలో ఓ భాగమైంది. అతను తీసిన చిత్రాలు దాదాపు అన్ని ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. బాపు అసలు పేరు కత్తిరాజు వెంకటలక్ష్మీనారాయణ. బాపు మృతిపట్ల ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు సినీరంగ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు, నటులు తీవ్ర సంపాతాన్ని వ్యక్తంచేశారు.
బాపు.. రెండక్షరాల ఈ పేరు తెలుగు సంస్కృతి, సంద్రాయాలను వెండితెరపై కళ్ళకుకట్టింది. మానవ సంబంధాల గొప్పతనాన్ని చాటిచెప్పింది. రేఖల్లో దివ్యవత్వాన్ని చూపింది, తెలుగు సినిమాకి భాగ్య’రేఖ’గా మారింది. ఆంధ్రదేశమంతా అల్లరి చేసిన ‘బుడుగు’కి రూపాన్నించ్చింది. చిన్నాపెద్దా అందర్నీ ఓలలాడించింది. ఎంతని చెబుతాం, ఏమని చెబుతాం-తెలుగు సినిమా దశ, దిశలను మార్చిన సత్తిరాజు లక్ష్మీనారాయణ ఉరఫ్ బాపూగురించి! బుడుగు పేరెత్తితేనే బాపు పులకించిపోతారు. బుడుగు ఊసుల్లో తేలిపోతారు. ‘నా బుడుగు రెండు బొందెలున్న నిక్కరేసుకుకనీ, పొట్టిగా, బొద్దగా, ముద్దుగా చలాకీగా ఉంటాడు. రౌడీ రాస్కెల్, ఆరిపిడుగా, పోకిరి వెధవా, కుర్రకుంకా, జడ్డీవెధవా అని ఇంటి బయటా అందరి చేతా ముద్దుగా తిట్టించుకుంటాడు అంటూ మురిసిపోతారు. నల్లకోటు ధరించి లాయరవ్వాల్సిన ఆయన కుంచెపై మక్కువ పెంచుకుని చిత్రకాడయ్యారు. కాస్త సమయం చిక్కినా బాపు చిత్రకారుడైపోతారు. ముళ్ళపూడి వెంకటరమణతో స్నేహం సినిమా వైపు నడిపించింది. ఇద్దరూ ఒక్కటై ఒక్కటిగా సినిమాలు తీసి బాపు-రమణలుగా తెలుగు సినీ చరిత్రలో తమ పేర్లను సువర్ణాక్షరాలతో లికించుకున్నారు. 50కిపైగా దృశ్యకావ్యాలను అందించిన బాపు జీవిత, సినీ ప్రస్థానం..
బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సవిూపంలోని కంతేరు ఆయన స్వస్థలం. వేణుగోపాలరావు, సూర్యకాంతమ్మ దంపతుల సంతానం. 1933, డిసెంబర్ 15న నిడమోలులోని అమ్మమ్మ ఇంట్లో జన్మించారు. బాపూకి ముగ్గురు సోదరులు, ఒక సోదరి వున్నారు. పెద్ద తమ్ముడు శంకర్ నారాయణ తన అన్న స్ఫూర్తితోనే పెన్సిల్ రేఖా చిత్రకారుడిగా పేరుగాంచారు. తండ్రి వృత్తి రీత్యా మద్రాసుకి వచ్చిన బాపూ మద్రాసు విశ్వవిద్యాలయంలో 1955లో బీఎల్ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే చిత్రకారుడిగా ప్రావీణ్యం సాధించిన బాపు 1945లో ‘ఆంధ్రపత్రిక’లో కార్టూనిస్ట్‌గా కూడా పనిచేశారు. హిందూ దేవతారూపాలను ఎక్కువగా చిత్రీకరించేవారు. బాపూ సినిమాల్లో కూడా అధిక శాతం హిందూ ఇతిహాసాలకు సంబంధించినవే. రామాయణంను తన సినిమాల ద్వారా సామాన్య ప్రజలకి చేరువ చేసిన ఘనుల్లో బాపూ కూడా ఒకరు. 1967లో ‘సాక్షి’ సినిమాతో దర్శకుడిగా అవతారమెత్తిన బాపు తెలుగు, హిందీ, తమిళ భాషలతో కలిపి మొత్తం 51 సినిమాలకు దర్శకత్వం వహించారు. ‘బాంగారుపిచ్చిక’ (1978), బుద్ధిమంతుడు (1969), బాలరాజు కథ (1970), సంపూర్ణ రామాయణం (1971), అందాల రాముడు (1973), శ్రీరామాంజనేయ యుద్ధం (1974), ‘ముత్యాలముగ్గు’ (1975), ‘సీతాకల్యాణం’ (1976), భక్తకన్నప్ప (1976) ‘సీతాస్వయవరం’ (1976), ‘మనవూరి పాండవులు’ (1978), ‘తూర్పు వెళ్లే రైలు’ (1979), రాధాకల్యాణం (1981), ‘సీతమ్మ పెళ్లి’ (1984), ‘రామబంటు’ (1996), ‘రాధా గోపాలం’ (2005), ‘సుందరాకాండ’ (2008), ‘శ్రీరామరాజ్యం’ (2011)… బాపూ తెరకెక్కించిన దృశ్యకావ్యాల్లో కొన్ని. హిందీలో ‘హమ్ పాంచ్’ (1980), వో సాత్ దిన్ (1983), ‘మొహబ్బత్’ (1984), ‘ప్యారీ బెహ్న’ (1985) చిత్రాలు తీశారు.
పురస్కారాలు : 1986లో రమణతో కలిసి ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డును, బాపు రెండు జాతీయ అవార్డులు, ఆరు నంది అవార్డులను అందుకున్నారు. 2013లో పద్మశ్రీ పురస్కారం బాపూని వరించింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడవిూలతోపాటు పలు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్‌లను కూడా ఆయన పొందారు.
పేరులోనే తెలుగు ‘లిపి’…
బాపూ చేతివ్రాతనే ఒక లిపిగా గుర్తించడం చాలా గొప్ప విషయం. ఏ పుస్తకంలో చూసిన బాపు చేతరాత ఫాంట్‌లో అక్షరాలు తప్పక కనిపిస్తాయి. తెలుగు సినీ పరిశ్రమలో ఈ అరుదైన ఘనత దక్కించుకున్న ఏకైక వ్యక్తి మన బాపూనే. సత్తిరాజు లక్ష్మీనారాయణ ‘బాపూ’గా పిలవడానికి ఒక కారణం ఉంది. జాతీయోద్యమ రోజుల్లో జన్మించిన సత్తిరాజుని మహాత్ముడి స్ఫూర్తితోను, తన తండ్రి పేరు కలిసొచ్చేలా ‘బాపు’ అని ఆయన తల్లి ముద్దుగా పిలుచుకునేవారు. తిరువాతి కాలంలో ఆ పేరే ఆయనకు చిరస్థాయిగా నిలిచిపోయింది.