సకల సౌకర్యాలతో దళితవాడలు : సీఎం కేసీఆర్‌

C
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : దళిత వాడల్లో సకల సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హామీనిచ్చారు. దళితవాడల్లో దరిద్రాన్ని తరిమికొడదామని ఆయన పిలుపునిచ్చారు. టిడిపి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్‌ విజ్ఞప్తి మేరకు కేసీఆర్‌ సనత్‌నగర్‌లోని ఐడిహెచ్‌ కాలనీని

సందర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ అక్కడ ఇళ్లు శిథిలావస్థలో ఉన్నాయన్నారు. వెంటనే ఆ ఇళ్లను ఖాళీ చేయమని ఆయన దళితులను కోరారు. అయిదు నెలలలో సకల సదుపాయాలతో కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇళ్ల నిర్మాణ పనులు రేపటి నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఐడీహెచ్‌ కాలనీని ఆదర్శకాలనీగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. రేపట్నుంచే పనులు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. దళితవాడల్లో దారిద్య్రం లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న ఆయన ఐడీహెచ్‌ కాలనీలో వైఫై సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. నిరుపేదలు పైసా చెల్లించనక్కరలేదని, ప్రభుత్వమే భరిస్తుందని ఆయన చెప్పారు. ఐదునెలల్లో పనులు పూర్తిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈరోజు ఉదయం ఈ కాలనీ సమస్యలపై కాలనీవాసులతో కలిసి తెదేపా నేత తలసాని కేసీఆర్‌ని కలిసిన సంగతి తెలిసిందే. వారికిచ్చిన హామీ మేరకు కేసీఆర్‌ కాలనీని సందర్శించారు.