ఓరుగల్లులో కాళన్న కళాక్షేత్రం
అధికారికంగా ఉత్సవాలు
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాలి
హైటెక్ హంగులతో హాల్, ఉద్యానవనం
భారీ కాళోజి విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు
శంకుస్థాపన చేయనున్న కేసీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (జనంసాక్షి) : వరంగల్ జిల్లా కేంద్రంలో కాళోజీ కళాక్షేత్రం ఏర్పాటుచేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కాళోజీ జయంత్యుత్సవాలను అధికారికంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. హైటెక్ హంగులతో హాల్, ఉద్యానవనంతోపాటు భారీ కాళోజి విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. విగ్రహానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 9న కాళోజీ శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం మూడు ఎకరాల విస్తీర్ణంలో కళాక్షేత్రం ఏర్పాటు చేయాలని తాజాగా నిర్నయించింది. ఈ నెల 9న ముఖ్యమంత్రి కేసీఆర్ కళాక్షేత్రానికి శంకుస్థాపన చేయనున్నారు. కాళోజీ శత జయంతి ఉత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు మంగళవారం సవిూక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో జయంత్యుత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. అలాగే, వరంగల్ జిల్లా హన్మకొండలోని బాలసముద్రంలో ఉన్న మూడు ఎకరాల స్థలంలో కళాక్షేత్రం ఏర్పాటుచేయాలని స్పష్టంచేశారు. అలాగే, అక్కడ అతిపెద్ద కాళోజీ విగ్రహం, ఉద్యానవనం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆధునిక ఆడిటోరియం నమూనాకు ఆర్కిటెక్ట్‌ను నియమించాలని ఆదేశించారు. ఈ నెల 9న ఆయన కళాక్షేత్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం రవీంద్రభారతిలో జరిగే జయంత్యుత్సవాల్లో పాల్గొననున్నారు. కాళోజీ జయంత్యుత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల కార్యాలయాలు, విద్యాసంస్థల్లో అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది.