దేశ వైద్య చరిత్రలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతం
బెంగుళూరు నుంచి చెన్నైకి గుండె ప్రయాణం
విజయవంతంగా హృదయ మార్పిడి
చెన్నై, సెప్టెంబర్ 3 (జనంసాక్షి) : దేశ వైద్య చరిత్రలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బెంగుళూరు నుంచి చెన్నైకి గుండెను తీసుకెళ్ళి అక్కడ విజయవంతంగా ఆపరేషన్ ద్వారా మరో వ్యక్తికి అమర్చారు. గతంలో ఒకే ఆస్పత్రిలో గుండె మార్పిడి చేసేందుకే వైద్యులు చాలా కష్టపడ్డారు. కానీ ప్రస్తుతం ఏకంగా బెంగుళూరు నుంచి చెన్నైకి తీసుకొచ్చి మరో వ్యక్తి అమర్చడం గొప్ప అద్భుతంగా పేర్కొనవచ్చు. బెంగళూరులోని బీజీఎస్ ఆసుపత్రిలో బ్రెయిన్‌డెడ్‌కు గురైన మహిళ గుండెతో వైద్యబృందం చెన్నైకి చేరుకుంది. అనంతరం ఫొర్టీస్ ఆసుపత్రిలో వైద్యులు గుండెను మరో వ్యక్తికి అమర్చే ప్రక్రియ ప్రారంభించారు. బెంగళూరు నుంచి వచ్చిన వైద్య బృందం చెన్నై విమానాశ్రయం నుంచి ఆసుపత్రి వరకు సజావుగా చేరుకునేందుకు పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేశారు.
అసలేం జరిగిందంటే..
బెంగళూరులో జరిగిన రోడ్డుప్రమాదంలో 32 రెండేళ్ల ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను చికిత్స నిమిత్తం బీజీఎస్ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు బ్రెయిన్‌డెడ్ అయిందని సెప్టెంబర్ 1న కుటుంబ సభ్యులకు తెలిపారు. అనంతరం ఆమె అవయవాలను ఎవరికైనా దానం చేస్తే మంచిదని కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారు. మానవతా దృక్పథంతో స్పందించిన ఆమె కుటుంబ సభ్యులు వైద్యుల సూచనకు అంగీకారం తెలిపారు. బెంగళూరులోని అపోలో ఆసుపత్రిలో కిడ్నీలను దానం చేశారు. చెన్నైలోని ఫొర్టీస్ ఆసుపత్రిలో హార్ట్‌ఫెయిలై ఓ వ్యక్తి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని అక్కడి వైద్యులకు సమాచారం అందడంతో చెన్నై వైద్యులను సంప్రదించారు. దీంతో బుధవారం ఉదయం చెన్నై నుంచి వైద్య బృందం బెంగళూరుకు చేరుకుంది. గుండెను చెన్నైకు తరలించేందుకు రసాయనాలతో ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. బెంగళూరులో ఆసుపత్రికి విమానాశ్రయం 35కి.మీల దూరం వుండటంతో అక్కడి పోలీసులను సంప్రదించారు. దీంతో పోలీసులు గ్రీన్‌కారిడార్ (ట్రాఫిక్‌ను క్లియర్ చేయడం)ను ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు బెంగళూరు నుంచి విమానంలో గుండెను తరలించారు.
గుండెను అమర్చిన వైద్యులు
చెన్నైలోని ఫోర్టీస్ మలర్ ఆసుపత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్స ముగిసింది. బెంగళూరులో రహదారి ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్‌కు గురైన ఒక మహిళ గుండెను వైద్యులు విమానంలో చెన్నైకు తీసుకువచ్చారు. అనంతరం నాలుగు గంటలపాటు శ్రమించి హార్ట్‌ఫెయిల్‌తో బాధపడుతున్న రోగికి గుండెను అమర్చారు. చికిత్స విజయవంతమైనట్టు ఫోర్టీస్ మలర్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే రోగిని 12 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలో వుంచనున్నట్టు తెలిసింది. పర్యవేక్షణ అనంతరమే చికిత్సపై వైద్యులు ప్రకటన చేయనున్నారు.